ట్రంప్‌కు ఎదురుగాలి! | US President Donald Trump is not averse to diplomacy | Sakshi
Sakshi News home page

ట్రంప్‌కు ఎదురుగాలి!

Aug 29 2026 3:50 AM | Updated on Aug 29 2026 3:50 AM

US President Donald Trump is not averse to diplomacy

రెండో దఫా అధికార పీఠం అధిరోహించి కూడా రెండేళ్లు కావస్తున్నా అమెరికా అధ్యక్షుడు డోనాల్ట్‌ ట్రంప్‌కు దౌత్యనీతి ఒంటబట్టలేదు. తాను నిర్దేశించినదాన్ని అంగీకరించటమే తప్ప మరోవిధంగా మాట్లాడే హక్కు, అధికారం ఏ దేశానికీ లేదని ఆయన ఇప్పటికీ నమ్ముతున్నారు. ఆయన దృష్టిలో కేవలం అదే దౌత్యం. భారత్‌ నుంచి కెనడా వరకూ... ఇరాన్‌ నుంచి వెనిజులా వరకూ ఆయనది ఇదే బాణీ. ట్రంప్‌ను నేరుగా ప్రతిఘటించే వారుండొచ్చు, పరోక్షంగా చెప్పిచూద్దామనుకునే వారుండొచ్చు... మార్గాలు వేరైనా ట్రంప్‌ షరతులకు తలొగ్గబోమని చెప్పడమే వీరందరి సారాంశం. 

చాన్నాళ్లుగా విసుగెత్తి ఉన్నారేమో... కెనడా ప్రధాని మార్క్‌ కెర్నీ చాలా కరకుగానే వ్యవహరించారు. ఒకదాని వెంబడి మరో గొంతెమ్మ కోర్కెతో చీకాకుపరుస్తున్న అమెరికా తీరును నిరసిస్తూ వాణిజ్య ఒప్పందంపై చర్చలు సాగిస్తున్న తమ ప్రతినిధి బృందాన్ని వెనక్కురావాలని ఆదేశించారు. ఒప్పందం దాదాపు ఖరారై సంతకాలు జరపడమే తరువాయి అనుకునే దశలో ఎదురైన ఈ ఊహించని పరిణామం అమెరికాను అయోమయంలోకి నెట్టింది. ఇలాంటి భంగపాట్లే ఇరాన్‌ దగ్గర ఎదురయ్యాయి. మన దేశంతో చర్చలు ఒక కొలిక్కి వచ్చాయని అమెరికా అనేకమార్లు ప్రకటించింది. కానీ అదేమీ జరగలేదు. 

వెనిజులా అధ్యక్షుడు మదురోను ట్రంప్‌ తన సైన్య బలంతో ఈ ఏడాది మొదట్లో అపహరించి, అమెరికాలో ఆయనపై విచారణ తంతు సాగిస్తున్నారు. ఇకపై అది తమ భూభాగమని అమెరికా చెప్పడం ఆ దేశ ప్రజల్ని మాత్రమే కాదు... అత్యధిక దేశాలను ఆగ్రహోదగ్రుల్ని చేస్తోంది. ఇక ఇరాన్‌ సంగతి చెప్పనవసరం లేదు. యుద్ధాన్ని తాత్కాలికంగా నిలిపేశామని చెప్పటం నుంచి హార్మూజ్‌ తమదేనని ప్రకటించటం వరకూ ట్రంప్‌ ఎన్ని చేసినా ఇరాన్‌ నిబ్బరంగా ‘నీ లెక్కేమిట’న్నట్టే వ్యవహరిస్తోంది. 

మిత్ర దేశమైన దక్షిణ కొరియాదీ అదే వైఖరి. ఏటా 11 రోజులపాటు అమెరికా, దక్షిణ కొరియాలు ఉమ్మడి సైనిక విన్యాసాలు జరుపుతాయి. ఈసారి అయిదో రోజుకల్లా అమెరికా సైనికులు తట్టా బుట్టా సర్దుకుని తిరుగుముఖం పట్టారు. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌జోంగ్‌ ఉన్‌తో చెలిమి కోసం ట్రంప్‌ తహతహలాడటంపై ఆగ్రహించి దక్షిణ కొరియా ఈ నిర్ణయం తీసుకుందంటున్నారు. ఈ విన్యాసాల ఉద్దేశం ఉత్తర కొరియాను భయపెట్టడం. తీరా ఆ దేశంతోనే అమెరికా చేతులు కలుపుతుంటే... ఈ విన్యాసాలకు అర్థమేమిటన్నది దక్షిణ కొరియా ప్రశ్న. వాస్తవానికి ఉత్తర కొరియా పూర్తి స్థాయి అణ్వస్త్ర దేశంగా మారింది. ఆ దేశం దగ్గర ‘చాలా శక్తిమంతమైన’ ఆయుధా లున్నాయని ట్రంపే కొద్దికాలం క్రితం ప్రకటించారు. దాన్ని మరిచి కొత్త చుట్టరికాలు కలుపుకుందామని ట్రంప్‌ ప్రయత్నించినంత మాత్రాన ఆ దేశం నమ్మే అవకాశమేమీ లేదు. 

ఇరాన్‌తోసహా అన్ని దేశాలతోనూ దౌత్యపరంగా వరస వైఫల్యాలు తప్పడం లేదు గనుక ఉత్తర కొరియాకు దగ్గరై అమెరికా జనాన్ని ఆశ్చర్యపరచాలని ట్రంప్‌ భావిస్తున్నట్టు కనబడుతోంది. కానీ వేరే దేశాలతో పెంచుకున్న వైరం వికటిస్తున్న విధంగానే ఉత్తర కొరియాతో చెలిమి సైతం బెడిసికొట్టే అవకాశం లేకపోలేదు. చివరకు ఉత్తర కొరియాఏం చేస్తుందన్నది అలావుంచితే... ఆసియా–పసిఫిక్‌ దేశాలన్నిటా ట్రంప్‌ అంతరంగంపై ఇప్పటికే ఉన్న సందేహాల్ని మరింతగా పెంచింది. ఈ దేశాలన్నీ చైనా దూకుడువల్ల చాలా ఇబ్బంది పడుతున్నాయి. ఇలాంటి సమయంలో తమకు అండగా నిలిచి, చైనాకు కళ్లెం వేయాల్సిన అమెరికా ఆడుతున్న వింతనాటకాలు వాటికి మింగుడుపడటం లేదు.

అందుకే దక్షిణ కొరియా, జపాన్‌ ఇటీవల సాన్నిహిత్యమవుతున్నాయి. ఆ రెండింటిమధ్యా ఇబ్బందికర చరిత్రవున్నా ట్రంప్‌ వింత చేష్టలు వారిని సన్నిహితం చేశాయి. కెనడా ఉత్పత్తులపై 50 శాతం అదనపు సుంకాలు వేయాల్సివస్తుందని ట్రంప్‌ ప్రకటించగా, దానికి ప్రతిగా వచ్చే నెల 8 నుంచి అమెరికా ఉత్పత్తులపై 15 నుంచి 50 శాతం వరకూ సుంకాలు విధిస్తామని కెర్నీ ప్రకటించారు. అమెరికా అదనపు సుంకాల విలువ 2,000 కోట్ల డాలర్లయితే, కెనడా సుంకాలు 2,760 కోట్ల డాలర్లు. ఈ ప్రపంచం తనకు భయపడటం మాట అటుంచి... జాలి కూడా చూపబోదని ట్రంప్‌కు ఎంత త్వరగా తెలిస్తే అమెరికా ప్రజలకు అంత మేలు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement