మన చదువులు వర్తమాన అవసరాలకు తగినట్టు ఉండటం లేదని చాన్నాళ్లుగా నిపుణులు ఘోషిస్తున్నారు. చివరకు చదువయ్యాక అందించే నైపుణ్యాలు కూడా ఎందుకూ కొరగావటంలేదని తాజాగా నీతి ఆయోగ్ నివేదిక చెప్పడం ఆందోళన కలిగించే అంశం. దాని ప్రకారం ఉన్నత విద్యావంతుల్లో కేవలం 8.25 శాతం మందికి మాత్రమే విద్యార్హతకు తగిన ఉద్యోగం లభిస్తోంది. 2014–15 నుంచి ఇంతవరకూ రూ. 34,000 కోట్లు వెచ్చించి 7.67 కోట్లమందికి నైపుణ్యాభివృద్ధి శిక్షణనిచ్చినా ఫలితం అంతంతమాత్రమేనని నివేదిక చెబుతోంది. 15–29 యేళ్ల మధ్యవయస్కులైన 8.7 కోట్లమందైతే చదువు, పని, శిక్షణల్లో అన్నింటికీ దూరంగా ఉండిపోయారంటున్నది.
వీరు నిరుపేద వర్గాలవారు. మొన్న మార్చిలో విడుదలైన పీరియాడిక్ లేబర్ ఫోర్స్ (పీఎల్‌ఎఫ్) సర్వే ప్రకారం యువతలో వీరు 25 శాతం. నైపుణ్యాభివృద్ధి గురించి మాట్లాడటం మొదలై రెండు దశాబ్దాలు దాటుతున్నా, ఆ కోర్సులపై తమకు స్పష్టత లేదని 40 శాతంపైగా యువత చెప్పారని నీతి ఆయోగ్ నివేదిక వెల్లడించింది. ఇంత సమాచార లోపం ఉన్నప్పుడు ఎన్ని పథకాలు పెట్టి ఏం ప్రయోజనం?ప్రపంచ దేశాల్లో యువజనం అధికంగా గల దేశాల్లో భారత్ ఒకటి. మన జనాభాలో 65 శాతంమంది 35 యేళ్ల లోపువారు. సక్రమంగా వినియోగించుకోగలిగితే వీరు దేశానికి అపురూపమైన సంపద. ప్రపంచంలో చాలా దేశాలు వృద్ధ జనాభా ఎక్కువై దిక్కుతోచని స్థితిలో ఉన్నాయి. కానీ మనకు దండిగా యువత ఉన్నా వారికి ఉపాధి కల్పనలో విఫల మవుతున్నాం. ఏటా సమర్పించే వార్షిక బడ్జెట్‌లో గణాంకాలు ఘనంగా కనబడతాయి.
కేటాయింపులు కళ్లు చెదిరేలా ఉంటాయి. కానీ ఫలితాలు చూస్తే ఇలా బావురుమంటాయి. ఉండాల్సినంత లేకున్నా ఉన్నత విద్యాసంస్థల విస్తరణ గతంతో పోలిస్తే పెరిగింది. ఈ సంస్థలు యేటా లక్షలాదిమంది పట్టభద్రుల్ని తయారుచేస్తున్నాయి. కానీ అభ్యసన ఫలితాలు గమనిస్తే అవి అంతంతమాత్రమనీ, ఉపాధి సామర్థ్య లోపాలు అపారమనీ నీతి ఆయోగ్ నివేదిక ఒకటి లోగడే చెప్పింది. చదువులో సమాన అవకాశాలు లేకపోవడం ఒక సమస్య అయితే... ఉత్పాదక ఉద్యోగాల కొరత ఏర్పడటం మరో సమస్య. ఈ సమస్యలపై లోతైన అధ్యయనం చేసి, సకాలంలో తగిన పరిష్కారాలు వెదకనట్టయితే అపురూప సంపదగా ఉండాల్సిన మన యువశక్తి కాస్తా ఆర్థిక, సామాజిక ఒత్తిళ్లకు మూలకారణమయ్యే ప్రమాదం ఉంటుంది.
ఇన్ని లక్షలమంది ఉన్నత విద్యకెదిగారని అనుకోవటంవల్ల ఏ ప్రయోజనమూ ఉండదు. వారికుండాల్సిన మౌలిక అభ్యసనాలు, నైపుణ్యాలు, ఉత్పాదకతకు తోడ్పడే ఉపాధి, నిరంతర నైపుణ్యాభివృద్ధి ఉంటేనే మానవ వనరుల్ని మనం సక్రమంగా వినియోగించుకుంటున్నట్టు లెక్క. మన నిరుద్యోగిత 2017–18లో 18 శాతం ఉంటే 2022–23 నాటికి అది 10 శాతానికి తగ్గిందని, నిలకడగా అక్కడే ఉందని గణాంకాలు చెబుతున్నాయి. వీరంతా 15–29 యేళ్ల మధ్యవయస్కులు. కానీ పట్టభద్రులు, అంతకు మించి చదివిన 25 యేళ్ల లోపువారిలో నిరుద్యోగిత 1983 నాటికి 35 శాతమైతే, 2023 కల్లా అది 39 శాతమైంది. అసలు నిరుద్యోగిత రేటు లెక్కగట్టే తీరే లోపభూయిష్టమైనది. ఉపాధి కోరుతున్నవారిలో లభించనివారి శాతమెంతో అది వెల్లడిస్తుంది. అధికారిక సర్వేల్లో నిరుద్యోగులుగా ఉన్న ప్రతి ఒక్కరూ నమోదు చేసుకుంటారనుకోవటానికి లేదు. ఇక మహిళల్ని సర్వేలు సరిగా పరిగణనలోకి తీసుకోవటంలో విఫలమవుతున్నాయని తరచు ఆరోపణలొస్తుంటాయి. వారిని కూడా లెక్కేస్తే ఈ నిరుద్యోగ పటాలం అనూహ్యంగా ఉంటుంది.
ఏ ఉద్యమాలు గాల్లోంచి పుట్టుకురావు. దేశాన్ని ఓ కుదుపు కుదిపిన జెన్ జీ ఉద్యమం కేవలం నీట్ ప్రశ్నపత్రాల లీకువల్లే వచ్చిందనుకోవటానికి వీల్లేదు. అది తక్షణ ప్రేరణ అయితే కావొచ్చుగానీ... చదువుకు తగిన ఉపాధి లభించకపోవటం, అసలు చదువులే ప్రామాణికంగా లేకపోవటం మన యువతను నిరాశానిస్పృహల్లో ముంచెత్తు తున్నది. వర్తమాన అవసరాలకు తగిన పాఠ్యాంశాలుండటం, పరిశ్రమల అవసరాలకు అనుగుణమైన నైపుణ్యాలను అలవర్చటం అవసరం. అలాగే డబ్బుకొద్దీ ప్రామాణిక విద్య అనే ధోరణి మారాలి. నీతి ఆయోగ్ నివేదికైనా ప్రభుత్వాల కళ్లు తెరిపించాలి. విధానాలు సరిచేసుకోవాలి.


