న్యూఢిల్లీ: అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ), వృద్ధిలోకి వస్తున్న కీలక రంగాల అధిపత్యం, వివిధ రంగాలలో రాణిస్తున్న యువత కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థ 2047కల్లా 55 లక్షల కోట్ల డాలర్లకు చేరనున్నట్లు మాజీ ప్రధాన ఆర్థిక సలహాదారు కృష్ణమూర్తి వి.సుబ్రమణ్యన్ తాజాగా అంచనా వేశారు. 8 శాతం వాస్తవిక(రియల్) జీడీపీ వృద్ధి కొనసాగనున్నట్లు ‘ఇండియా 2047 లీడర్స్ టాక్’ పేరుతో ఏర్పాటు చేసిన సదస్సులో అభిప్రాయపడ్డారు. ఇందుకు దేశ కీలక ఆర్థిక మూలాల రంగాలలో వ్యూహాత్మక పెట్టుబడుల వినియోగం వీలు కల్పించనున్నట్లు పేర్కొన్నారు.
2047కల్లా 55 ట్రిలియన్ డాలర్ల వికసిత్ భారత్‌ను నిర్మించడం వాస్తవికంగా సాధించదగినదేనని అభిప్రాయపడ్డారు. వార్షికంగా పురోగతి పథంలో ఉన్న ఎకానమీ, బాధ్యతాయుత సంపద సృష్టి, వివిధ రంగాలకు ప్రోత్సాహాన్నిచ్చే నిర్మాణాత్మక విధానాలతో ఇది సాధ్యపడుతుందని వివరించారు.
పటిష్ట, దీర్ఘకాలిక విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకట్టుకోవడంతోపాటు గ్లోబల్ వేల్యూ చైన్‌తో సమీకృతమయ్యేలా ప్రపంచస్థాయి ఎల్రక్టానిక్స్ అభివృద్ధి, పారిశ్రామిక తయారీ ఇందుకు తోడ్పాటునివ్వనున్నట్లు తెలియజేశారు. అత్యున్నత నైపుణ్యతకలిగిన యువతను ప్రోత్సహించడం, ఏఐలో సామర్థ్యాలు వీటికి జత కలవనున్నట్లు వివరించారు. 2026 ఏప్రిల్ వరల్డ్ ఎకనమిక్ ఔట్‌లుక్‌లో అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ(ఐఎంఎఫ్) 2025–26లో దేశ నామినల్ జీడీపీ 3.92 లక్షల కోట్ల డాలర్లుగా పేర్కొనడంతోపాటు.. ప్రపంచంలోనే ఆరో పెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించినట్లు ప్రస్తావించారు.


