ఆరోగ్య పరిశోధనకు అనారోగ్య మార్గం? | Sakshi Guest Column On An unhealthy path to health research | Sakshi
Sakshi News home page

ఆరోగ్య పరిశోధనకు అనారోగ్య మార్గం?

Aug 20 2026 12:24 AM | Updated on Aug 20 2026 12:24 AM

Sakshi Guest Column On An unhealthy path to health research

విశ్లేషణ

ఆరోగ్య పరిశోధనా శాఖ ఇటీవల ఒక జాతీయ ఆరోగ్య పరిశోధనా విధానాన్ని ప్రతిపాదించింది. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు చెందిన ఈ విభాగం దాదాపు రెండు దశాబ్దాలుగా మనుగడలో ఉన్నప్పటికీ, ఆరోగ్య పరిశోధనకు సంబంధించి దేశానికి ఇంతవరకు ఒక కట్టుదిట్టమైన విధానం ఏదీ లేదనే వాస్తవాన్ని మొదటిసారిగా ఇపుడే గుర్తించి నట్టుంది. దేశంలో ఆరోగ్య పరిశోధనకు సంబంధించి ప్రధాన బాధ్యతను భారతీయ వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్‌) నిర్వర్తిస్తోంది. జాతీయ పరిశోధన–అభివృద్ధికి చెందిన నిధులలో ఆ సంస్థకు కేవలం 3.3 శాతం నిధులు మాత్రమే అందుతున్నాయని 2026 జూలైలో విడుదలైన జాతీయ ‘ఆర్‌ అండ్‌ డి’ డేటా వెల్లడించింది. రక్షణకు 32 శాతం, అంతరిక్ష పరిశోధనకు 15 శాతం అందుతున్నాయి. అసలు మొత్తం ఆర్‌–డిపై మన జాతీయ వ్యయం, స్థూల జాతీయోత్పత్తి (జి.డి.పి.)లో చైనా (2.58 శాతం)తో పోల్చుకుంటే, నామమాత్రంగా, 0.84 శాతంగా ఉంది. 

బయోమెడికల్, ఆరోగ్య ఆర్‌–డిపై వ్యయాన్ని పెంచడం నూతన ఆరోగ్య పరిశోధనా విధాన లక్ష్యాలలో ఒకటి. ఆరోగ్య పరిశో ధనపై పెట్టుబడిని జీడీపీలో ఇపుడున్న 0.024 శాతం నుంచి 2037 నాటికి 0.072 శాతానికి, 2047 నాటికి 0.15 శాతానికి పెంచాలని సంకల్పించారు. ఇది పెద్ద అంగగానే కనిపించవచ్చుకానీ, భారత దేశం ప్రస్తుతం ఎదుర్కొంటున్న సవాళ్లతోనూ, భవిష్యత్తులో ఉండగల వ్యాధుల భారంతోనూ పోల్చుకుంటే, ఆ వ్యయం కూడా తక్కువే. పైగా ప్రతిపాదిత పెంపుదలలు సుదూర కాలానివి. 

పక్షపాత పరిశోధనలకు ఊతమిస్తే?
దాన్నలా ఉంచితే, ప్రతిపాదిత పెంపుదల మరింత సమస్యాయుతంగా కనిపిస్తోంది. ‘ప్రభుత్వ పెట్టుబడి క్రమేపీ పెరుగుతుంది. దానికి బాధ్యతాయుతమైన ప్రైవేటు, దాతృత్వ, ప్రభుత్వేతర సంస్థల నుంచి వచ్చే పెట్టుబడి తోడవుతుంది’ అని ఆ విధానం పేర్కొంటోంది. ఆరోగ్య పరిశోధనలో ప్రైవేటు పెట్టుబడులకు ఇది అధికారికంగా ద్వారాలు తెరుస్తుంది. ప్రభుత్వం ప్రోత్సహించాలని కోరుకుంటున్న ప్రైవేటు పెట్టుబడి స్వరూప స్వభావాలు మరింత ఆందోళనకు కారణమవుతున్నాయి. ప్రైవేటు కంపెనీల నుంచి వచ్చే కార్పొరేట్‌ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్‌) నిధులను ప్రభుత్వ సంస్థలలో ఆర్‌–డిపై వినియోగించేందుకు అనుమతిస్తామని ఆ విధానంలో పేర్కొన్నారు. 

ఈ విధానం ఇపుడున్న ప్రభుత్వ–ప్రైవేటు భాగస్వామ్యాలకు భిన్నమైనది. కోవిడ్‌–19 వ్యాక్సిన్ల వంటి నిర్దిష్ట ప్రాజెక్టుల కింద ఫార్మా కంపెనీలు, ప్రభుత్వ సంస్థలు కొత్త  ఔషధాలను లేదా టీకాలను తయారు చేస్తూ వస్తున్నాయి. అది ఫార్మా లేదా మరో కంపెనీ ఏదైనా సరే ఇచ్చే సీఎస్‌ఆర్‌ నిధులతో ఓ చిక్కు ఉంది. ఒక కంపెనీ నెలకొల్పిన దాతృత్వ సంస్థ నిధులతోనైనా కూడా ఇబ్బందే. అది పక్షపాతపూరిత పరిశోధనకు దారితీయవచ్చు. పర్యావరణ ఆరోగ్యం (వాయు కాలుష్యం, పొగాకు, ఆల్కహాల్‌ ప్రభావాలు), కొన్ని వృత్తి ఉద్యోగాల్లో ఆరోగ్యంపై పడే ప్రభావం, ఆహార భద్రత, వాతావరణ మార్పు వంటి వివాదాస్పద అంశాలలో జరిగే పరిశోధ నలలో రహస్య అజెండా దాగుండొచ్చు. ‘శాస్త్రీయ సందేహా’లను సృష్టించవచ్చు. కొన్ని అగ్రశ్రేణి ఆరోగ్య ఎన్జీవోలు, ప్రజారోగ్య సంస్థలు క్షేత్ర స్థాయిలో చేసే పరిశోధనా అధ్యయనాలకు విదేశీ మారక ద్రవ్య నిబంధనల పేరుతో ప్రభుత్వం ఓపక్క అడ్డంపడుతూ, మరోపక్క ఆరోగ్య పరిశోధనలు నిర్వహించేందుకు పరిశ్రమలకు, విదేశీ ఫౌండేషన్లకు ద్వారాలు తెరవడం విడ్డూరం.  

విశ్వాసాలకు శాస్త్రీయ ముసుగు
ఈ మొత్తం విధానం ఆరోగ్య పరిశోధనను అన్ని స్థాయుల్లోనూ అధికార యంత్రాంగంతో ముడిపెడుతూ కేంద్రీకృతం చేసేదిగా ఉంది. జాతీయ ఆరోగ్య పరిశోధనా అజెండా స్థూల స్థాయిలో ప్రాధాన్యాలను నిర్దేశిస్తుందనీ, అ అజెండాను మూడు అంచెల పాలనా వ్యవస్థ అమలుజరుపుతుందనీ కొత్త విధానం చెబుతోంది. నూతన ఆరోగ్య పరిశోధనా సారథ్య కమిటీ అత్యున్నత స్థాయిలో ఉండి, వ్యూహాత్మక దిశా నిర్దేశాన్ని అందిస్తుంది. దానికి ముఖ్య శాస్త్రీయ సలహా మండలి నేతృత్వం వహిస్తుంది. దానిలో ప్రభుత్వాధికారులు (వైజ్ఞానిక శాఖల కార్యదర్శులు) సభ్యులుగా ఉంటారు. రెండవ అంచెలో ఆరోగ్య పరిశోధనా విభాగం సెంట్రల్‌ నోడల్‌ ఇంప్లిమెంట్‌ ఏజెన్సీగా పనిచేస్తుంది. శాస్త్రీయ–సాంకేతిక అమలు బాధ్యతలను మూడవ అంచెలో భారతీయ వైద్య పరిశోధనా మండలికి అప్పగిస్తారు. 

ప్రజారోగ్యం ప్రాథమికంగా రాష్ట్రాల జాబితాలోకి వస్తుంది. వైద్య విద్య–పరిశోధన ఉమ్మడి జాబితాలోకి వస్తాయి. కానీ, ప్రతిపాదిత పాలనా వ్యవస్థ రాష్ట్రాల పాత్రను తగ్గించేదిగా ఉంది. ఆరోగ్య పరిశోధనా అజెండాను కేంద్ర సారథ్య కమిటీకి అప్పగించడం వల్ల రాష్ట్రాల పాత్ర కేవలం అమలు చేయవలసినదిగా మారు తుంది. ప్రతిపాదిత ఆరోగ్య పరిశోధనా విధానం మరో ముఖ్యమైన మార్పునకు సంకేతంగా నిలుస్తోంది. ‘సమీకృత ఆరోగ్యం’ ముసుగులో ఆధునిక వైద్యానికి ఉద్దేశించిన పరిశోధనా నిధులను ఆయుర్వేదం, ఇతర వైద్య విధానాలను అనుసరించే సంస్థలు కూడా వినియోగించుకోవచ్చు. నిజానికి, అటువంటి సంస్థలు ఆయుష్‌ మంత్రిత్వ శాఖ, అది నిర్వహిస్తున్న యంత్రాంగాల నుంచి పరిశోధనా నిధులను ఇప్పటికే అందుకుంటున్నాయి. ఇది తిరిగి పాత పద్ధతులు, విశ్వాసాలు, అభిప్రాయాలను ధ్రువీకరించే ఉద్దేశంతో చేసే పరిశోధనలకు ఊతం ఇస్తుంది. గోమూత్రం వంటివి ఆధునిక పరిశోధనకు లోనవుతాయి. శాస్త్ర–సాంకేతిక పరిశోధన శాఖ వంటి ఇతర పరిశోధనా ఏజెన్సీలు ఇస్తున్న నిధులతో అటువంటి ప్రాజెక్టులు ఇప్పటికే నడుస్తున్నాయి. 

రాష్ట్రాల అవసరాలకు తగ్గట్టుగా...
మన దేశం భౌగౌళికంగా, సాంస్కృతికంగా మాత్రమే వైవిధ్య భరితమైనది కాదు. దాని ఆరోగ్య అవసరాలు కూడా భిన్నమైనవి. వివిధ చికిత్సా పద్ధతులు అందుబాటులో ఉండటంలో తారతమ్యాలున్నాయి. బిహార్‌ లేదా ఒడిశా వంటి రాష్ట్రాలతో పోలిస్తే కేరళ ఆరోగ్య సవాళ్ళు పూర్తిగా భిన్నమైనవి. ‘పైనుంచి–కింద’కు అనే అజెండాను రాష్ట్రాలు అమలు చేయక తప్పని స్థితిని కల్పించే బదులు, రాష్ట్రాలు వాటి ప్రాధాన్యాలు, అవసరాల ఆధారంగా సొంత ఆరోగ్య పరిశోధనా మౌలిక వసతులను అభివృద్ధి చేసు కునేలా నిధుల రూపంలో చేయూతనందిస్తే బాగుంటుంది. ఆరోగ్య పరిశోధన అంటే కేవలం కొత్త టెక్నాలజీలను పరీక్షించడం లేదా కొత్త టీకాలు, మందులను తయారు చేయడమే కాదు; పరిశోధన ఫలితాలు ఆరోగ్య విధానాలు, బడ్జెట్లకు దారి చూపాలి. ఆరోగ్య పరిశోధన ఒక నిరంతర, గతిశీల ప్రక్రియ. అది సామాజిక–ఆర్థిక అంశాలతో సన్నిహితంగా ముడిపడి ఉంటుంది. 

పట్టణాల్లో ఉండే పేదలు, గిరిజనులు వంటి అనేక బడుగు, బలహీన వర్గాల ఆరోగ్య సమస్యలు తరచు పరిశీలనకు నోచుకోవడం లేదు. ఇటీవలి కాలంలో పెద్ద సంఖ్యలో వైద్య కళాశాలలను తెరిచారు. తమతమ ప్రాంతాల్లో ఉండే ఆరోగ్య సమస్యలపై పరిశోధన సాగించే విధంగా వాటికి దిశా నిర్దేశం చేయాలి. ఆరోగ్య పరిశోధనకు అంకితమైన ఒక విధానాన్ని రూపొందించుకోవాల్సిన అవసరం ఎప్పటి నుంచో ఉంది. కాకపోతే పరిశోధన అజెండాను రూపొందించేందుకు కేంద్రీకృత విధానాన్ని అనుసరించడం, ప్రైవేటు రంగానికి ప్రముఖ పాత్ర కల్పించడం, ఆధునిక వైద్య పరిశోధనా అజెండాకు సమీకృత సంప్రదాయ వైద్యాన్ని జోడించడం వంటివాటితో ఈ విధానం తీసుకుంటున్న దిశ మాత్రమే అనారోగ్యకరంగా కనిపిస్తోంది.

దినేశ్‌ సి. శర్మ
వ్యాసకర్త సైన్స్‌ అంశాల వ్యాఖ్యాత 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement