ఒకవైపు మెరుగుదల.. మరోవైపు కొత్త సవాళ్లు
పిల్లల్లో పెరిగిన పోషకాహారం..పెద్దల్లో పెరిగిన బీపీ, షుగర్, ఒబెసిటీ
సిజేరియన్లలో దేశంలోనే తెలంగాణ అత్యధిక వాటా
ప్రైవేటు ఆస్పత్రుల్లో వాటా 83.9 శాతం , ప్రభుత్వాస్పత్రుల్లో 48.1 శాతం
ఆరోగ్య బీమా, ప్రసూతి సేవల్లో పురోగతి
మహిళల భద్రత, బాలల పోషణలో సవాళ్లు
ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్–6 ఆరోగ్యసర్వేలో వెల్లడి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఆరోగ్య పరిస్థితిలో ఒకవైపు మెరుగుదల కనిపిస్తుండగా.. మరోవైపు కొత్త సవాళ్లు పెరుగుతున్నాయి. పిల్లల్లో పోషకాహార లోపం కొంత తగ్గడం, ప్రసూతి సేవలు మెరుగుపడటం, ఆరోగ్య బీమా పరిధి పెరగడం వంటి సానుకూల పరిణామాలతోపాటు పెద్దల్లో మధుమేహం, అధిక బరువు, రక్తపోటు పెరుగుతున్నట్లు తాజాగా వెలువడిన 2023–24 జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే–6 (ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్–6) వెల్లడించింది. సిజేరియన్ ఆపరేషన్లలో తెలంగాణ దేశంలోనే అత్యధిక వాటా గల దేశంగా ఉంది. రాష్ట్రంలో ప్రైవేటు ఆసుపత్రుల్లో జరిగే ప్రసవాలలో 97.7 శాతం సిజేరియన్ ఆపరేషన్లే కావడం గమనార్హం. 2023–24 సర్వే గణాంకాలను 2019–21 ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్–5తో పోలిస్తే రాష్ట్ర ఆరోగ్య రంగంలో చోటుచేసుకున్న మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
ప్రసూతి సేవల్లో భేష్..
ప్రసూతి సేవల్లో తెలంగాణ గణనీయమైన పురోగతి సాధించింది. గర్భం తొలి మూడు నెలల్లో వైద్య పరీక్షలు చేయించుకున్న మహిళలు 88.5 నుంచి 89.6 శాతానికి , కనీసం నాలుగు ప్రసవ పూర్వ పరీక్షలు పొందిన వారు 70.4 నుంచి 80.3 శాతానికి పెరిగారు. గర్భిణుల్లో కనీసం 100 రోజులు ఐరన్–ఫోలిక్ యాసిడ్ మాత్రలు తీసుకున్న వారి వాటా 57.9 నుంచి 81 శాతానికి , 180 రోజులు తీసుకున్న వారు 34.4 నుంచి 55.7 శాతానికి పెరిగారు. సంస్థాగత ప్రసవాలు 97 నుంచి 98.8 శాతానికి , నైపుణ్యం కలిగిన వైద్య సిబ్బంది సమక్షంలో జరిగిన ప్రసవాలు 93.6 నుంచి 97.7 శాతానికి పెరిగాయి. అయితే సిజేరియన్ ప్రసవాలు 60.7 నుంచి 62.2 శాతానికి పెరగడం ఆందోళన కలిగించే అంశం. ప్రైవేటు ఆసుపత్రుల్లో సిజేరియన్ల వాటా 83.9 శాతం, ప్రభుత్వ ఆసుపత్రుల్లో 48.1 శాతం గా ఉంది.
పిల్లల పోషణలో మెరుగుదల
5 ఏళ్లలోపు పిల్లల్లో ఎదుగుదల లోపం (స్టంటింగ్) గత సర్వేలో 33.1 శాతం ఉండగా తాజా సర్వేలో 27 శాతానికి తగ్గింది. బరువుకు తగ్గ ఎత్తు లోపం (వేస్టింగ్) 21.7 నుంచి 16.9 శాతానికి తగ్గింది. తక్కువ బరువు పిల్లలు 31.8 నుంచి 27.8 శాతానికి తగ్గారు. పిల్లల్లో అధిక బరువు కూడా 1.3 నుంచి 1.2 శాతానికి తగ్గింది. అయితే చిన్నారులకు సరైన ఆహారం అందించడంలో పరిస్థితి ఇంకా ఆందోళనకరంగానే ఉంది. 6–23 నెలల పిల్లల్లో తగిన ఆహారం పొందుతున్న వారి వాటా 15.3 శాతం మాత్రమే. తల్లిపాలు ఇచ్చే పిల్లల్లో ఇది 15.8 శాతం , తల్లిపాలు ఇవ్వని పిల్లల్లో 12.4 శాతం గా ఉంది.
మధుమేహం, ఊబకాయం పెరుగుదల
రాష్ట్రంలో అసంక్రమిత వ్యాధుల భారం పెరుగుతున్నట్లు గణాంకాలు సూచిస్తున్నాయి. అధిక రక్తచక్కెర లేదా మధుమేహ నియంత్రణ మందులు వాడుతున్న మహిళలు 19.6 శాతం ఉండగా, గత కుటుంబ సర్వేలో ఇది 14.7 శాతం. పురుషుల్లో ఈ వాటా 18.1 నుంచి 24.5 శాతానికి పెరిగింది. అత్యధిక రక్తచక్కెర స్థాయి ఉన్న పురుషులు 13.3 శాతం , మహిళలు10 శాతంగా నమోదయ్యారు. అధిక బరువు లేదా ఊబకాయం ఉన్న మహిళలు 30.1 నుంచి 36.3 శాతానికి , పురుషులు 32.4 నుంచి 35.5 శాతానికి పెరిగారు. మరోవైపు సాధారణం కంటే తక్కువ బీఎంఐ(బాడీమాస్ ఇండెక్స్) ఉన్న మహిళలు 18.8 నుంచి 17.7 శాతానికి , పురుషులు 16.3 నుంచి 14.9 శాతానికి తగ్గారు. అధిక రక్తపోటు లేదా దానికి మందులు వాడుతున్న మహిళలు 24.2 శాతం, పురుషులు 28.2 శాతంగా ఉన్నారు.
మహిళల్లో పెరిగిన విద్య, ఆర్థిక సాధికారత
10 లేదా అంతకంటే ఎక్కువ సంవత్సరాలు చదివిన మహిళలు 45.5 నుంచి 51.1 శాతానికి, పురుషులు 61.2 నుంచి 65 శాతానికి పెరిగినట్లు కుటుంబసర్వే చెబుతోంది. ఇంటర్నెట్ ఉపయోగించిన మహిళల వాటా 26.5 నుంచి 64.8 శాతానికి పెరగడం గణనీయమైన మార్పు. స్వయంగా ఉపయోగించే బ్యాంకు ఖాతా ఉన్న మహిళలు 84.4 నుంచి 92.3 శాతానికి , గత ఏడాదిలో పని చేసి నగదు రూపంలో పారితోషికం పొందిన మహిళలు 45.1 నుంచి 53.2 శాతానికి పెరిగారు.
18–49 ఏళ్ల వివాహిత మహిళల్లో జీవిత భాగస్వామి నుంచి హింసను ఎప్పుడైనా ఎదుర్కొన్న వారి వాటా 37.2 నుంచి 30.8 శాతానికి తగ్గింది. 15 ఏళ్లు పైబడిన పురుషుల్లో పొగాకు వినియోగం 36.3 నుంచి 21.1 శాతానికి తగ్గగా, మహిళల్లో 5.6 నుంచి 5.9 శాతానికి మారింది. రాష్ట్రంలో ఆరోగ్య బీమా లేదా ఆరోగ్య ఆర్థిక రక్షణ పరిధిలో ఉన్న కుటుంబాలు 69.2 నుంచి 82.2 శాతానికి పెరిగాయి. విద్యుత్ సౌకర్యం ఉన్న కుటుంబాల వాటా 99.6 నుంచి 98.6 శాతానికి , మెరుగైన తాగునీటి వనరు ఉన్న కుటుంబాలు 98.7 నుంచి 98.2 శాతానికి స్వల్పంగా మారాయి. అయోడైజ్డ్ ఉప్పు వినియోగించే కుటుంబాలు 95.8 నుంచి 98.7 శాతానికి పెరిగాయి.


