హైదరాబాద్: నగరంలో మాంసం దుకాణాలపై టీజీసేఫ్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. పలు ప్రాంతాల్లోని మటన్, చికెన్ దుకాణాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కొన్ని దుకాణాల్లో అపరిశుభ్ర వాతావరణం ఉన్నట్లు గుర్తించారు. మాంసం విక్రయించే కౌంటర్ల వద్ద పరిశుభ్రత పాటించకపోవడాన్ని అధికారులు గుర్తించారు. కొన్ని దుకాణాల్లో మాంసం కౌంటర్లపై బొద్దింకలు, ఈగలు కనిపించాయి. దీంతో మాంసం విక్రయిస్తున్న తీరుపై అధికారులు అసంతృప్తి వ్యక్తం చేశారు.
మరికొన్ని దుకాణాల్లో చికెన్ వ్యర్థాలను ఎక్కడపడితే అక్కడ పడేసినట్లు గుర్తించారు. వ్యర్థాలను సక్రమంగా తొలగించకుండా దుకాణాల పరిసరాల్లోనే వదిలేయడంతో అపరిశుభ్ర పరిస్థితులు నెలకొన్నాయి. ఆహార పదార్థాల విక్రయాల్లో కనీస పరిశుభ్రత ప్రమాణాలు పాటించడం లేదని తనిఖీల్లో వెల్లడైంది.
ఈ క్రమంలో నిబంధనలు పాటించని పలు మాంసం దుకాణాల యజమానులకు టీజీసేఫ్ అధికారులు నోటీసులు జారీ చేశారు. దుకాణాల్లో పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని, మాంసం నిల్వ, విక్రయించే ప్రాంతాలను శుభ్రంగా ఉంచాలని సూచించారు. మాంసం విక్రయించే దుకాణాల్లో పరిశుభ్రత ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని అధికారులు స్పష్టం చేశారు. చికెన్, మటన్ వ్యర్థాలను ఎప్పటికప్పుడు తొలగించాలని, కౌంటర్ల వద్ద ఈగలు, బొద్దింకలు లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.


