సాక్షి, హైదరాబాద్: మానవ అక్రమ రవాణా బాధితుల సంరక్షణకు తెలంగాణ హైకోర్టు మార్గదర్శకాలు జారీ చేసింది. ప్రముఖ స్వచ్ఛంద సంస్థ ప్రజ్వల దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పి.శామ్ కోషి, జస్టిస్ నర్సింగ్‌రావు నందికొండ ధర్మాసనం ఈ కింది మార్గదర్శకాలు జారీ చేసింది.
1. బాధితులు, నిందితులకు వేర్వేరు వసతి కేంద్రాలు
n మానవ అక్రమ రవాణా బాధితుల కోసం ఏర్పాటు చేసిన రక్షణ గృహాలను నిందితులు, నిర్వాహకులను నిర్బంధించే కేంద్రాలుగా ఉపయోగించరాదు.
n బాధితులు, నిర్వాహకులు, నేరస్తులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులకు వేర్వేరు వసతి, పునరావాస ఏర్పాట్లు చేయాలి.
n ప్రత్యేక కరెక్షనల్ ఇన్‌స్టిట్యూషన్లు, ఇతర చట్టబద్ధ నిర్బంధ కేంద్రాలను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వంలోని సంబంధిత శాఖలు చర్యలు తీసుకోవాలి.
n కొత్త కేంద్రాలు ఏర్పాటయ్యే వరకు ప్రస్తుతం అందుబాటులో ఉన్న చట్టబద్ధ సదుపాయాల్లో తగిన ఏర్పాట్లు చేయాలి.
n న్యాయస్థానం అనుమతి, చట్టబద్ధ ప్రక్రియ లేకుండా ఎవరినీ నిర్బంధించరాదు. కేవలం గతంలో ఎఫ్‌ఐఆర్ నమోదైందనే కారణంతో నిర్బంధం లేదా వసతి కల్పించరాదు.
n ఒక వ్యక్తి మరో కేసులో నిందితుడిగా ఉన్నంత మాత్రాన అతడిని బాధితుడిగా గుర్తించకుండా ఉండరాదని, ప్రతి కేసులో ఆధారాలను విడిగా పరిశీలించాలని స్పష్టం చేసింది.
2. పోలీసులకు, యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్లకు..
n గత ఫిబ్రవరిలో జారీ చేసిన సమగ్ర స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (ఎస్‌ఓపీ)ను డీజీపీ, మహిళా భద్రతా విభాగం, యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ల ద్వారా అమలు చేయాలి.
n దాడులకు ముందే ప్రణాళిక రూపొందించి, అనుమానిత నిర్వాహకులు, రిక్రూటర్లు, రవాణాదారులు, దోపిడీకి పాల్పడుతున్నవారిని గుర్తించాలి.
n రక్షించిన ప్రతీ వ్యక్తి పరిస్థితిని విడివిడిగా అంచనా వేయాలి. బలవంతం, మోసం, అప్పుల బానిసత్వం, స్వేచ్ఛగా సంచరించలేకపోవడం, పత్రాలను స్వాధీనం చేసుకోవడం వంటి అంశాలను పరిశీలించాలి.
n గతంలో క్రిమినల్ కేసు నమోదైందనే కారణంతో బాధితుడికి రక్షణ కల్పించకుండా ఉండరాదు.
n నిందితులు బాధితులుగా నటించి రక్షణ గృహాల్లో ప్రవేశించే అవకాశాన్ని కూడా పరిశీలించాలి.
n దాడుల సమయంలో బాధితులను అనుమానిత నిర్వాహకులు, వారిపై నియంత్రణ కలిగిన వ్యక్తుల నుంచి వేరు చేయాలి.
n బాధితులను బెదిరించడం, ప్రభావితం చేయడం, సాక్ష్యాలను తారుమారు చేయడం వంటి చర్యలను అడ్డుకోవాలి.
n బాధితులకు తక్షణ వైద్య చికిత్స, మానసిక ప్రథమ చికిత్స అందించాలి. పత్రాలు, ఎలక్ట్రానిక్ ఆధారాలను చట్ట ప్రకారం భద్రపరచాలి.
n మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచే సమయంలో ప్రతీ వ్యక్తి పాత్ర, నేర చరిత్ర, వయసు, రక్షణ అవసరాలు, ప్రతిపాదిత ఆశ్రయ గృహం సామర్థ్యం వంటి వివరాలను సమర్పించాలి.
3. నిరోధక చర్యలు, సమాచార మార్పిడి
n అక్రమ రవాణా, వ్యభిచార గృహాల నిర్వహణ వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు భవనాలు ఉపయోగించకుండా యజమానులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని డీజీపీ సూచనలు, ప్రజా అవగాహన ప్రకటనలు జారీ చేయాలి.
n అద్దెకు వచ్చే వ్యక్తుల లింగం, వృత్తి, సామాజిక నేపథ్యం ఆధారంగా వివక్ష చూపరాదు.
n అక్రమ రవాణా, వ్యభిచార గృహాల నిర్వహణకు సంబంధించి ధ్రువీకరించిన సమాచారాన్ని సంబంధిత పోలీసు విభాగాల మధ్య చట్టబద్ధంగా పంచుకునే వ్యవస్థ ఏర్పాటు చేయాలి.
n కేవలం ఆరోపణల ఆధారంగా ఎవరినీ దోషిగా పరిగణించరాదు.
4. స్వచ్ఛంద సంస్థలు, రక్షణ గృహాలకు మార్గదర్శకాలు
n చట్టబద్ధంగా గుర్తింపు పొందిన రక్షణ గృహాలు, ఇతర సదుపాయాల వివరాలతో జిల్లా వారీగా జాబితా నిర్వహించాలి.
n ఆయా కేంద్రాల సామర్థ్యం, ప్రత్యేక సేవలు, సంప్రదింపు అధికారుల వివరాలను నమోదు చేయాలి.
n ఎవరినైనా రక్షణ గృహానికి పంపే ముందు అక్కడ ఖాళీలు, భద్రతా పరిస్థితులపై సంబంధిత సంస్థతో సాధ్యమైనంతవరకు సంప్రదించాలి.
n స్వచ్ఛంద సంస్థలు సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాయనే కారణంతో వాటిని ఇష్టానుసారంగా నిర్బంధ కేంద్రాలుగా పరిగణించరాదు.
n ఒక వ్యక్తి వల్ల ఇతర నివాసితులకు ముప్పు ఉందని విశ్వసనీయ సమాచారం ఉంటే, సంబంధిత పోలీసులకు, మేజిస్ట్రేట్‌కు వెంటనే తెలియజేసి తగిన రక్షణ చర్యలు కోరాలి.
5. జిల్లా న్యాయ సేవాధికార సంస్థలకు ఆదేశాలు
n తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఈ ఉత్తర్వులను అన్ని జిల్లా న్యాయ సేవాధికార సంస్థలకు పంపాలి. సమన్వయం కోసం నోడల్ అధికారిని నియమించాలి.
n యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్లు, మహిళా–శిశు సంక్షేమ శాఖ, చైల్డ్ వెల్ఫేర్ కమిటీలు, విద్యాశాఖలు, గుర్తింపు పొందిన స్వచ్ఛంద సంస్థలతో జిల్లా స్థాయిలో సమన్వయ వ్యవస్థ ఏర్పాటు చేయాలి.
n బాధితులకు ఉచిత న్యాయ సాయం, న్యాయవాదుల సేవలు, పరిహారం, పునరావాసం అందేలా చర్యలు తీసుకోవాలి.
n బలవంతపు శ్రమ, లైంగిక దోపిడీ, బాలల అక్రమ రవాణా, సైబర్ మోసాల ద్వారా జరిగే ప్రలోభాలు, సురక్షిత వలసలు, ఫిర్యాదు విధానాలు, ఉచిత న్యాయ సహాయం తదితర అంశాలపై అవగాహన కల్పించాలి.
n ప్యానెల్ న్యాయవాదులు, పారా లీగల్ వాలంటీర్లకు బాధితు లు, నిందితుల మధ్య తేడా, చట్టంలోని సెక్షన్ 17 కింద విచారణ, గోప్యత వంటి అంశాలపై అవగాహన కల్పించాలి.
6. పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలకు ఆదేశాలు
n పాఠశాల విద్యాశాఖ, ఉన్నత విద్యాశాఖ పరిధిలోని విద్యాసంస్థలు ప్రతి విద్యా సెమిస్టర్‌లో కనీసం ఒక మానవ అక్రమ రవాణా నిరోధక అవగాహన కార్యక్రమం నిర్వహించాలి.
n ఉద్యోగాల పేరుతో జరిగే మోసాలు, ఆన్‌లైన్ ప్రలోభాలు, లైంగిక దోపిడీ, సురక్షిత ఫిర్యాదు విధానాలు, సహాయం పొందే మార్గాలపై అవగాహన కల్పించాలి.
n విద్యా సంస్థలు నిర్వహించిన కార్యక్రమాల వివరాలను సంబంధిత శాఖలకు సమర్పించాలి.
7. బాలల అక్రమ రవాణా, లైంగిక వేధింపుల కేసుల్లో అదనపు రక్షణ
n బాలలుగా అనుమానించే వ్యక్తులను రక్షించినప్పుడు జువైనైల్ జస్టిస్ చట్టం, పోక్సో చట్టం నిబంధనలను తప్పనిసరిగా పాటించాలి.
n బాలలను పరిపాలనా సౌలభ్యం కోసం పెద్దల రక్షణ గృహాల్లో ఉంచరాదు. చట్ట ప్రకారం చైల్డ్ వెల్ఫేర్ కమిటీ పరిధిలోకి తీసుకురావాలి.
n బాలలకు వైద్య సహాయం, కౌన్సెలింగ్, న్యాయ సహాయం, గుర్తింపును గోప్యంగా ఉంచే రక్షణ కల్పించాలి.
n బాలలను పదేపదే ప్రశ్నించడం, భయపెట్టే విధంగా విచారించడం చేయరాదు.
8. సైబర్ ఆధారిత అక్రమ రవాణా, ఆన్‌లైన్ దోపిడీ
n సోషల్ మీడియా, మెసేజింగ్ యాప్‌లు, ఆన్‌లైన్ ప్రకటనలు, ఉద్యోగ నియామక ఆఫర్ల ద్వారా జరిగే అక్రమ రవాణా, ప్రలోభాలు, దోపిడీ కేసుల్లో యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్లు, సైబర్ క్రైమ్ పోలీసు విభాగాలు సమన్వయంతో పనిచేయాలి.
n ఆన్‌లైన్ లైంగిక దోపిడీ, గ్రూమింగ్, బ్లాక్‌మెయిల్, వ్యక్తిగత చిత్రాల ప్రచారం, బాలలపై లైంగిక వేధింపుల ఫిర్యాదులను వెంటనే సంబంధిత పోలీసు లేదా సైబర్ క్రైమ్ విభాగాలకు పంపాలి.
n పాఠశాలలు, స్వచ్ఛంద సంస్థలు స్వయంగా సమాంతర విచారణలు నిర్వహించరాదు.
9. మేజిస్ట్రేట్లకు న్యాయపరమైన మార్గదర్శకాలు
n ‘పిటా’ చట్టంలోని సెక్షన్ 17 కింద ఉత్తర్వులు జారీ చేసే ముందు చట్ట ప్రకారం అవసరమైన విచారణ తప్పనిసరిగా నిర్వహించాలి.
n బాధితులు, అనుమానిత నిర్వాహకులు, నేరస్తులుగా ఆరోప ణలు ఎదుర్కొంటున్న వ్యక్తుల పాత్రలను విడివిడిగా పరిశీలించాలి.
n నిజమైన బాధితులను అనుమానిత దోపిడీదారులతో ఒకే రక్షణ గృహంలో ఉంచకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
n కేవలం అనుమానం ఆధారంగా శిక్షాత్మక నిర్బంధం విధించరాదు. విచారణ, వాదనలు వినే అవకాశం కల్పించాల్సిన చట్టబద్ధ ప్రక్రియను పక్కనపెట్టరాదు.
n ఈ ఉత్తర్వుల ప్రతిని మేజిస్ట్రేట్లకు పంపించి, అవసరమైన అవగాహన కార్యక్రమాలపై పరిశీలన కోసం హైకోర్టు రిజిస్ట్రీ ప్రధాన న్యాయమూర్తి ముందు ఉంచాలి.
ఇదీ చదవండి: గర్ల్స్ హాస్టల్‌లోకి పురుషులు.. లోపల బాగోతం వేరే!
10. జిల్లా కలెక్టర్లు, ప్రభుత్వ శాఖలకు ఆదేశాలు
n మహిళా, శిశు సంక్షేమం, కార్మిక, సాంఘిక సంక్షేమం, వైద్య, విద్యాశాఖలు, జిల్లా యంత్రాంగం సమన్వయం కోసం సంప్రదింపు అధికారులను నియమించాలి.
n బాధితులకు వైద్య, మానసిక సహాయం, పునరావాసం, తిరిగి సమాజంలో కలిసేందుకు అవసరమైన సేవలు అందించాలి.
n జిల్లా కలెక్టర్లు ప్రతి ఆరు నెలలకు కనీసం ఒకసారి వివిధ శాఖలతో సమీక్ష సమావేశం నిర్వహించాలి.
n ఆశ్రయ గృహాల లభ్యత, శిక్షణ అవసరాలు, అవగాహన కార్యక్రమాలు, బాధితులకు సేవలు అందడంలో ఎదురవుతు న్న జాప్యాలను సమీక్షించాలి.
11. అమలు నివేదికల సమర్పణ
n సంబంధిత నోడల్ అధికారులు ఈ ఉత్తర్వులు అందిన మూడు నెలల్లోగా ప్రాథమిక అమలు నివేదికను రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శికి సమర్పించాలి.
n ఆ తర్వాత ఏడాది పాటు ప్రతి ఆరు నెలలకు ఒకసారి పురోగతి నివేదికలు ఇవ్వాలి.
n ప్రత్యేక వసతి కేంద్రాల ఏర్పాటు, అప్పటివరకు చేసిన ప్రత్యామ్నాయ ఏర్పాట్లు, బాధితులు–నిందితులను వేరు చేసే విధానం, నివారణ చర్యలు, శాఖల మధ్య సమాచార మార్పిడి వివరాలను తొలి నివేదికలో పొందుపరచాలి.
n బాధితుల పేర్లు, గుర్తింపును వెల్లడించే వివరాలను నివేదికల్లో పేర్కొనరాదు.


