10 గంటలు నిర్బంధించి.. చిత్రహింసలు | Sai Manikantha moves Telangana High Court against ED officials | Sakshi
Sakshi News home page

10 గంటలు నిర్బంధించి.. చిత్రహింసలు

Oct 31 2026 5:28 AM | Updated on Oct 31 2026 5:28 AM

Sai Manikantha moves Telangana High Court against ED officials

ఈడీ అధికారులపై తెలంగాణ హైకోర్టుకు సాయి మణికంఠ

బలవంతంగా తప్పుడు వాంగ్మూలంపై సంతకం చేయించుకున్నారు

ప్రైవేటు భూవివాదంలో జోక్యం చేసుకుని వేధించారని ఆరోపణ

ఈడీ అధికారులపై స్వతంత్ర సంస్థతో విచారణ జరిపించాలని విజ్ఞప్తి

సీసీ కెమెరాల ఫుటేజీ, సందర్శకుల రిజిస్టర్లను భద్రపరచాలని వేడుకోలు

విచారణ చేపట్టిన జస్టిస్‌ ఈవీ వేణుగోపాల్‌ ధర్మాసనం

ఈడీ, పోలీసులకు నోటీసులు జారీ.. విచారణ వచ్చే నెల 27కు వాయిదా

ఈడీ తరఫు న్యాయవాది తీరుపై న్యాయమూర్తి తీవ్ర ఆగ్రహం

సాక్షి, హైదరాబాద్‌: మద్యం అక్రమ రవాణా కేసు విచారణలో భాగంగా తనను సాక్షిగా పిలిచిన ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అధికారులు హైదరాబాద్‌ కార్యాలయంలో నిర్బంధించి తీవ్ర వేధింపులకు గురిచేశారని ఏపీకి చెందిన మంగళంపల్లి నాగసాయి మణికంఠ తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ మేరకు ఆయన తెలంగాణ హైకోర్టులో రిట్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. హైదరాబాద్‌లోని కార్యాలయంలో సుమారు పది గంటలపాటు నిర్బంధించారని, భౌతికంగా దాడి చేసి, తాము ముందుగానే తయారు చేసిన వాంగ్మూలంపై బలవంతంగా సంతకం చేయించుకున్నారని ఆరోపించారు. ఈడీ అధికారుల చర్యలు రాజ్యాంగానికి విరుద్ధమని ప్రకటించాలని కోరారు.

ఈడీ కార్యాలయంలోని సీసీ కెమెరాల ఫుటేజీ, సందర్శకుల రిజిస్టర్లు, గేట్‌ పాసులు, అధికారుల విధుల వివరాలను తక్షణమే భద్రపరిచేలా ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ పిటిషన్‌పై న్యాయమూర్తి జస్టిస్‌ ఈవీ వేణుగోపాల్‌ ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. పిటిషనర్, ఈడీ, రాష్ట్ర పోలీసుల తరఫు న్యాయవాదుల వాదనలు విన్న న్యాయమూర్తి.. ఈడీ డైరెక్టర్, జాయింట్‌ డైరెక్టర్, అసిస్టెంట్‌ డైరెక్టర్, రాష్ట్ర హోం ముఖ్య కార్యదర్శి, డీజీపీ, సైఫాబాద్‌ ఎస్‌హెచ్‌వో, ప్రైవేట్‌ ప్రతివాది వీ. సందీప్‌కు నోటీసులు జారీ చేశారు. 

తదుపరి విచారణను వచ్చే నెల 27కు వాయిదా వేస్తూ, ఆలోగా కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించారు. విచారణ సందర్భంగా ఈడీ న్యాయవాదిపై న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆన్‌లైన్‌లో హాజరై నేరుగా వాదనలకు దిగడంతో.. ‘అసలు మీరు ఎవరి తరఫున వాదిస్తున్నారు’అని జడ్జి ప్రశ్నించారు. ఆ తర్వాత కూడా న్యాయమూర్తి మాట్లాడేటప్పుడు అడ్డుపడటంపైనా అసహనం వ్యక్తం చేశారు. ఇది సరైన విధానం కాదని హితవు పలికారు. 

రాకపోతే తీవ్ర పరిస్థితులని బెదిరింపు
‘ఈడీ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ ప్రతీక్‌ సింగ్‌ ఈ నెల 8న పీఎంఎల్‌ఏ చట్టం కింద సమన్లు జారీ చేశారు. అక్టోబర్‌ 12న విచారణకు హాజరై పాన్, ఆధార్, పాస్‌పోర్టు పత్రాలు సమర్పించాలన్నారు. అయితే ఆ సమన్లు నేను గతంలో నివసించిన విజయవాడ చిరునామాకు పంపడంతో అందలేదు. అనంతరం వాట్సాప్‌లో పీడీఎఫ్‌ రూపంలో అందడంతో, కుటుంబ సభ్యుల అనారోగ్యం, ప్రయాణ ఏర్పాట్ల ఇబ్బందుల కారణంగా అక్టోబర్‌ 26న హాజరవుతానని ఈడీ అధికారికి ఈ–మెయిల్‌ ద్వారా చెప్పాను. కొత్తగా సమన్లు జారీ చేయలేదు, స్వచ్ఛందంగానే విచారణకు వెళ్లా. అయితే విచారణకు హాజరుకాకపోతే అరెస్టు చేస్తామని, పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని శ్రీనివాస్‌ అని పరిచయం చేసుకున్న ఈడీ ఇన్‌స్పెక్టర్‌ ఫోన్‌ చేసి బెదిరించారు’. 

తప్పుడు వాంగ్మూలం ఇవ్వలేదని దాడి
‘ఈ నెల 26న ఉదయం ఈడీ కార్యాలయానికి వెళ్లా. అక్కడ ఇద్దరు అధికారులు నన్ను ప్రశ్నించారు. నాకు తెలియని విషయాలపై ప్రశ్నించడంతో సమాధానాలు తెలియవని చెప్పా. మధ్యాహ్నం మరో గదిలోకి పంపించి సుమారు ఆరు గంటలపాటు నిర్బంధించారు. సాయంత్రం మా కుటుంబంతో భూ వివాదమున్న సందీప్‌ విచారణ గదిలోకి వచ్చారు. మా కుటుంబం భూమి విక్రయానికి సంబంధించి నల్లధనం అందుకుందని, కేవీ నాగేశ్వరరావు, కే సునీల్‌కుమార్‌ పేర్లు చెప్పాలని తీవ్ర ఒత్తిడి చేశారు. 

అయితే మా కుటుంబానికి ఎలాంటి నగదు అందలేదని, సందీప్‌ నుంచి రూ.30 లక్షలు మాత్రమే బ్యాంకు ద్వారా అందాయని, మిగిలిన మొత్తాన్ని చెల్లించలేదని చెప్పా. తప్పుడు వాంగ్మూలం ఇచ్చేందుకు నిరాకరించడంతో ఇద్దరు ఈడీ అధికారులు నన్ను తీవ్రంగా కొట్టారు. చెవులు మెలిపెట్టి, వేళ్లు వంచి, గోడకు తలుపునకు మధ్య నొక్కి చిత్రహింసలకు గురిచేశారు. సుమారు రెండు గంటలపాటు దాడి చేసి, వాళ్లు తయారు చేసిన వాంగ్మూలంపై బలవంతంగా సంతకం చేయించుకున్నారు. ఆ వాంగ్మూలాన్ని చదివేందుకు కూడా అనుమతించలేదు. దాని ప్రతిని ఇవ్వలేదు. ఆ వాంగ్మూలాన్ని పూర్తిగా ఉపసంహరించుకుంటున్నా’. 

పోలీసులకు ఫిర్యాదు చేసినా నో ఎఫ్‌ఐఆర్‌
‘మరుసటి రోజు 27న హిమగిరి ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించుకున్నా. చెవినొప్పి, శరీరమంతా నొప్పులు, వేళ్ల నొప్పితో ఇప్పటికీ బాధపడుతున్న. అదే రోజు సైఫాబాద్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశా. అయితే దానిని కేవలం క్రైమ్‌ పిటిషన్‌గా స్వీకరించి ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయలేదు. ఫిర్యాదుపై పోలీసులు ఎలాంటి తక్షణ చర్యలు తీసుకోలేదు. ఈడీ కార్యాలయంలోని సీసీ కెమెరాల ఫుటేజీ, సందర్శకుల రిజిస్టర్లను భద్రపరిచే చర్యలూ చేపట్టలేదు. ఫోన్‌ కాల్‌ డేటా రికార్డులను సేకరించలేదు. ఆలస్యం చేస్తే కీలక ఆధారాలు చెరిగిపోయే ప్రమా­దం ఉంది. ఈడీ అధికారులపై వచ్చిన ఆరోపణల­పై ఆ సంస్థతో సంబంధం లేని స్వతంత్ర దర్యాప్తు సంస్థతో హైకోర్టు పర్యవేక్షణలో విచారణ జరిపించాలి. 

ఈ నెల 26న ఉదయం 11 నుంచి రాత్రి 11 గంటల మధ్య ఈడీ కార్యాలయంలో నమోదైన సీసీ కెమెరాల ఫుటేజీని, సందర్శకుల రిజిస్టర్లు, గేట్‌ పాసులు, విధుల రోస్టర్, హాజరు రికార్డులను భద్రపరచాలి. ఫిర్యాదుపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసేలా పోలీసులను ఆదేశించాలి. బలవంతంగా సంతకం చేయించుకున్న వాంగ్మూలాన్ని చెల్లనిదిగా ప్రకటించాలి. ఈడీ కేసులో దానిని ఆధారంగా ఉపయోగించకుండా నిలువరించాలి. తన ప్రాథమిక హక్కుల­కు భంగం కలిగించినందుకు తగిన పరిహారం చెల్లించేలా ఆదేశించాలి’అని పిటిషన్‌లో వేడుకున్నారు. 

భూ వివాదమే వేధింపులకు కారణం
పిటిషన్‌లో మణికంఠ పేర్కొన్న వివరాల మేరకు.. ‘మా కుటుంబానికి ఆంధ్రప్రదేశ్‌లోని రాజమహేంద్రవరం గ్రామీణ మండలం మొరంపూడిలో 27 ఎకరాల పూర్వీకుల వ్యవసాయ భూమి ఉంది. ఇందులో నాలుగు ఎకరాలను కొనుగోలు చేసేందుకు వల్లూ సందీప్‌ 2023లో ఒప్పందం చేసుకున్నాం. రూ.1.30 కోట్లకు విక్రయ ఒప్పందంతోపాటు జనరల్‌ పవర్‌ ఆఫ్‌ అటార్నీ (జీపీఏ) ఇచ్చాం. అయితే సందీప్‌ రూ.30 లక్షలే తన వ్యక్తిగత బ్యాంకు ఖాతా నుంచి చెల్లించి, మిగిలిన రూ.కోటి చెల్లించలేదు. దీంతో మా కుటుంబం జీపీఏను రద్దు చేసి, ఆ భూమిని మరో వ్యక్తికి విక్రయించింది. అప్పటి నుంచి సందీప్‌.. మా కుటుంబాన్ని బెదిరిస్తున్నారు. ఈ వ్యక్తిగత భూవివా­దమే తదుపరి పరిణామాలకు కారణం’.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement