దాదాపు రూ.1.5 లక్షల కోట్ల విలువైన భూములకు సంబంధించి కోర్టుల్లో సానుకూల తీర్పులు
వీటిల్లో అటవీ, రెవెన్యూ శాఖల భూములు మినహా మిగతావి విక్రయిస్తాం
వచ్చే నిధులు ప్రజా ప్రయోజనాలకు వెచ్చిస్తాం
విద్యాభివృద్ధికి, ప్రాజెక్టుల పూర్తికి,ఇందిరమ్మ ఇళ్లకు ఉపయోగిస్తాం
ఢిల్లీలో మీడియాతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
గతంలో ఐఎంజీ భారత్‌కు కేటాయించిన భూములపైనా ప్రభుత్వానికి అనుకూల తీర్పు
మియాపూర్‌లోని 550 ఎకరాల భూమి విషయంలోనూ సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పు
మేం అధికారంలోకి వచ్చాక బలమైన వాదనలు విన్పించాం.. గత ప్రభుత్వం కబ్జాదారులకుఅనుకూలంగా వ్యవహరించిందన్న సీఎం
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: హైదరాబాద్‌లో 2003–04లో నాటి చంద్రబాబు నేతృత్వంలోని తెలుగుదేశం ప్రభుత్వం ఐఎంజీ భారత్‌కు కేటాయించిన అత్యంత విలువైన 850 ఎకరాలు సహా రాష్ట్రంలోని ఏడెనిమిది చోట్ల దాదాపు రూ.1.5 లక్షల కోట్ల విలువైన భూములకు సంబంధించి కోర్టుల్లో సానుకూల తీర్పులు వచ్చాయని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు. ఈ నేపథ్యంలో స్వాధీనం చేసుకున్న భూముల్లో అటవీ, రెవెన్యూ శాఖలకు సంబంధించినవి మినహా హెచ్ఎండీఏ పరిధిలోని భూముల్లో లేఅవుట్లు వేసి విక్రయించడం ద్వారా నిధులు రాబడతామని వివరించారు. వాటిని విద్యావ్యవస్థ అభివృద్ధికి, సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయడానికి, ఇందిరమ్మ ఇళ్లను నిర్మించి దళిత, గిరిజన, వెనుకబడిన వర్గాలకు అందించడానికి వినియోగిస్తామని అన్నారు. శుక్రవారం ఢిల్లీ నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఎం మాట్లాడారు.
సర్కార్ న్యాయ పోరాటం
‘కబ్జాకు గురైన ప్రభుత్వ భూముల కోసం మా ప్రభుత్వం మూడేళ్లుగా కోర్టుల్లో బలమైన వాదనలు వినిపిస్తూ వచ్చింది. గత ప్రభుత్వాలు అక్రమంగా కేటాయించిన భూములు, అలాగే పరాధీనమైన ప్రభుత్వ భూములను తిరిగితెచ్చేలా కోర్టుల్లో బలమైనవాదనలు వినిపించని భూములపై మా ప్రభుత్వం న్యాయపోరాటం చేసింది. ఈ క్రమంలోనే హైదరాబాద్‌లోని మియాపూర్‌లో సుమారు రూ.50 వేల కోట్ల విలువైన 550 ఎకరాల భూమి ప్రభుత్వానికే చెందుతుందని గురువారం సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పు ఇచ్చింది. ఫలితంగా రూ.50 వేల కోట్ల విలువైన ప్రభుత్వ ఆస్తిని కాపాడుకోగలిగాం.
ఆ భూములను తక్షణమే స్వాధీనం చేసుకోవాలని రెవెన్యూ అధికారులకు ఆదేశాలిచ్చాం. అవసరమైన సర్వే నిర్వహించి, సరిహద్దులను నిర్ణయించాలని చెప్పాం. కంచె వేసి కబ్జాదారులు, కేసీఆర్ కుటుంబం నుంచి కాపాడతాం. సర్వే నంబర్లు 100, 101లో ఉన్న ఈ భూమిని రెవెన్యూ రికార్డులను తారుమారు చేసి కాలనీల ముసుగులో ఆక్రమించడానికి కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు, వారి వెనుక కొందరు పెట్టుబడిదారులు ప్రయత్నం చేశారు. దీని వెనుక ఉన్న గోల్డ్ స్టోన్ ప్రసాద్ సోదరుడు ట్రినిటీ ఇన్ఫ్రా పేరుతో ఖరీదైన బెంజ్ కారును కొనుగోలు చేసి, నమస్తే తెలంగాణ సీఎండీ దామోదర్‌రావుకు నజరానాగా ఇచ్చారు.
చంద్రశేఖర్‌రావు (కేసీఆర్)కు కోట్లాది రూపాయలు నజరానా ఇచ్చారనడానికి ఆ కారు ప్రగతిభవన్‌లోకి ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్లిరావడమే నిదర్శనం. వారి మధ్యనున్న లావాదేవీలు, ఒప్పందాలు, చీకటి కుంభకోణాలన్నీ ఆనాడే బయటపెట్టాం. గోల్డ్ స్టోన్ ప్రసాద్, ఆయన కుటుంబసభ్యులకు అనుకూలంగా రిజిస్ట్రేషన్లు చేయడానికి నాటి ప్రభుత్వం వ్యవహరించిన తీరును ఎండగట్టాం. అందుకు సహకరించిన సబ్ రిజిస్ట్రార్లను, రెవెన్యూ అధికారులను మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అరెస్టు చేశాం. గత ప్రభుత్వం కబ్జాదారులకు అనుకూలంగా వ్యవహరించింది..’ అని రేవంత్‌రెడ్డి ఆరోపించారు.
చంద్రబాబు పేరెత్తకుండా అక్రమాల ప్రస్తావన
ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ ప్రభుత్వం 2003–04లో హైదరాబాద్‌లోని గచ్చిబౌలి (400 ఎకరాలు), మామిడిపలిŠల్ (450 ఎకరాలు)లో అత్యంత విలువైన దాదాపు 850 ఎకరాలను క్రీడాభివృద్ధి పేరిట ఐఎంజీ భారత్‌కు కేటాయించిన విషయాన్ని ముఖ్యమంత్రి ప్రస్తావించారు. చంద్రబాబు పేరెత్తకుండానే ఆ సంస్థ డైరెక్టర్ బిల్లీరావు (అహోబలరావు) గురించి చెబుతూ నాటి అక్రమాలను మరోసారి గుర్తు చేశారు. ‘ఆ కేటాయింపులపై 2004లో వైఎస్ రాజశేఖరరెడ్డి నాయకత్వంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం విచారణ జరిపించింది. 2006లో కేటాయింపులు రద్దు చేసింది.
అయితే దాన్ని సవాల్ చేస్తూ బిల్లీరావు కోర్టుకు పోయి స్టే ఆర్డర్ తెచ్చుకున్నారు. కానీ నాడు అధికారంలో ఉన్న కేసీఆర్ కుటుంబం, కేటీఆర్ 30 శాతం ముడుపులకు మాట్లాడుకొని, బిల్లీరావుకు అనుకూలంగా కోర్టుల్లో కేసు వీగిపోయేలా చేశారు. దీనిపై నాడు నేను రాజకీయపరమైన పోరాటం చేశా. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు రూ.40 వేల కోట్ల విలువైన ఆ 850 ఎకరాలకు సంబంధించి కోర్టుల్లో బలమైన వాదనలు వినిపించాం. సుదీర్ఘ విచారణల తర్వాత ఆ భూముల కేటాయింపుల రద్దును సమర్థిస్తూ 2024 మార్చిలో హైకోర్టు తీర్పు ఇచ్చింది..’ అని సీఎం తెలిపారు.
ప్రభుత్వానికి దక్కిన విలువైన భూములివీ..
‘హయత్‌నగర్ మండలంలో 140 ఎకరాల అటవీ భూమిని పట్టా ముసుగులో ఆక్రమించిన ప్రైవేట్ వ్యక్తులకు అనుకూలంగా కేసీఆర్ ప్రభుత్వం వ్యవహరించింది. కానీ మా ప్రభుత్వ వాదనలతో ఏకీభవించిన సుప్రీంకోర్టు... అది అటవీ భూమి అని 2025 డిసెంబర్లో తీర్పు ఇచ్చింది. ఇప్పుడా భూమి రిజర్వ్ ఫారెస్టుగా, పబ్లిక్ పార్క్‌గా పర్యావరణహితంగా మారింది. శేరిలింగంపల్లి మండలం కొండాపూర్‌లో 36 ఎకరాల భూమిని కేసీఆర్‌కు కావాల్సినవారు కబ్జా చేశారు. దాదాపు రూ.3,600 కోట్ల విలువైన ఆ భూమిని తిరిగి స్వాధీనం చేసుకోవడానికి మా ప్రభుత్వం బలమైన వాదనలు వినిపించింది. తద్వారా 2025 సెప్టెంబర్‌లో హైకోర్టు అనుకూలంగా తీర్పు ఇచ్చింది.
రంగారెడ్డి జిల్లా గండిపేట మండలంలో మంచిరేవుల గ్రామంలో 143 ఎకరాల ప్రభుత్వ భూమిని రాయలసీమకు చెందిన కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కట్టబెట్టడానికి కేసీఆర్ ప్రభుత్వం ప్రయత్నించింది. కేటీఆర్ అనుకూలంగా వ్యవహరించారు..’ అని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. రాయలసీమ అంటే వారు వైఎస్సార్సీపీకి చెందినవారా అని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు రేవంత్‌రెడ్డి స్పందిస్తూ..ఇందులో పార్టీల ప్రమేయం ఏమీలేదని స్పష్టత ఇచ్చారు. 1994 నుంచి వస్తున్న ఆ భూ వివాదంపై సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేసి, 2024లో అనుకూలమైన తీర్పును సాధించినట్లు వివరించారు. ఆ భూమి విలువ సుమారు రూ.10 వేల కోట్లు ఉంటుందని చెప్పారు. అందులో 50 ఎకరాల భూమిని పోలీసు స్కూల్‌కు తమ ప్రభుత్వం కేటాయించిందని తెలిపారు.
‘భూపాలపల్లిలో దాదాపు రూ.400 కోట్ల విలువైన 106 ఎకరాల అటవీ భూమిని గత ప్రభుత్వం ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టింది. కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లోకి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేకు నజరానాగా ఈ భూమి ఇచ్చారు. దానిపైనా సుప్రీంకోర్టు వరకూ వెళ్లి, 2024 ఏప్రిల్‌లో ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు సాధించాం. అలాగే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 600 ఎకరాల అటవీ భూమినీ ప్రైవేట్ వ్యక్తులదని రకరకాల రికార్డులను సృష్టించి కేసీఆర్ ఆక్రమించుకోవాలనుకున్నారు. మా ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తే అనుకూల తీర్పు వచ్చింది..’ అని ముఖ్యమంత్రి తెలిపారు.
వారి ధన దాహం విలువ అంత ఉంది..!
ఇప్పటివరకూ ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పులు పొందిన ఏడు కేసుల్లోనూ భూముల విలువ సుమారు రూ.1.5 లక్షల కోట్లు ఉంటుందని, కేసీఆర్ ముఠా ధనదాహం విలువ అంత ఉందని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. మియాపూర్ భూముల విషయంలో కేసీఆర్, కేటీఆర్, వారి అనుయాయుల పాత్ర ఉంది కాబట్టే.. సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత తేలుకుట్టిన దొంగల్లా ఉండిపోయారని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ భూముల విషయంలో బీఆర్ఎస్ నాయకులు తమ ప్రభుత్వంపై అనేక ఆరోపణలు చేశారని, విచారణ జరపాలని పదేపదే డిమాండ్ చేశారని రేవంత్‌రెడ్డి గుర్తు చేశారు.
ఉమ్మడి రాష్ట్రంలో పద్మాలయ స్టూడియో, ల్యాంకో లగడపాటి భూములపై కేసులు వేసిన కేసీఆర్, హరీశ్‌రావు.. అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని ఎందుకు స్వాధీనం చేసుకోలేదని ప్రశ్నించారు. ఎర్రవల్లి, శివారు వెంకటాపురం గ్రామాల మధ్య ఉన్న వివాదాన్ని తమకు అనుకూలంగా మార్చుకున్నారని, అక్కడి భూ ఆక్రమణలను తేల్చడానికి అధికారుల సర్వేకి ఆదేశించామని తెలపారు. అవి ఆక్రమణలని తేలితే, అక్కడ శ్రీకాంతాచారి అమరవీరుల కాలనీ నిర్మిస్తామని చెప్పారు.


