బ్యాంకర్ల రుణ వసూళ్లపై అట్రాసిటీ వర్తించదు | Atrocity does not apply to bankers loan collections | Sakshi
Sakshi News home page

బ్యాంకర్ల రుణ వసూళ్లపై అట్రాసిటీ వర్తించదు

Oct 31 2026 1:04 AM | Updated on Oct 31 2026 1:04 AM

Atrocity does not apply to bankers loan collections

తెలంగాణ బ్యాంకు అధికారులపై క్రిమినల్‌ చర్యలను కొట్టివేసిన సుప్రీంకోర్టు

నిర్దిష్టమైన కుల దూషణ ఆరోపణలు ఉంటేనే అట్రాసిటీ చట్టం వర్తిస్తుందని స్పష్టీకరణ

హైదరాబాద్‌ సీఐడీ పోలీస్‌ స్టేషన్‌లో నమోదైన ఎఫ్‌ఐఆర్‌ రద్దు

సాక్షి, న్యూఢిల్లీ: ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన వారు నిర్వహిస్తున్న కంపెనీల నుంచి రుణ వసూళ్లకు చర్యలు చేపట్టినంత మాత్రాన, ఆయా బ్యాంకు అధికారులపై అట్రాసిటీ చట్టం కింద ప్రాసిక్యూషన్‌ చేపట్టలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఆర్బీఐ మార్గదర్శకాలను పాటించలేదనే కారణంతో లేదా సంస్థను ఆర్థికంగా బహిష్కరించారనే ఆరోపణలతో ఈ చట్టాన్ని ప్రయోగించడం చల్లదని తేల్చిచెప్పింది. 

హైదరాబాద్‌ సీఐడీ పోలీస్‌ స్టేషన్‌లో బ్యాంకు అధికారులపై నమోదైన కేసును (చవాన్‌ ధర్మేందర్‌ వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ తెలంగాణ) విచారించిన న్యాయమూర్తులు జస్టిస్‌ జేబీ పార్దీవాలా, జస్టిస్‌ కె.వినోద్‌ చంద్రన్‌లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ మేరకు అక్టోబర్‌ 12న కీలక తీర్పు వెలువరించింది. ఈ సందర్భంగా అధికారులపై ఉన్న క్రిమినల్‌ ప్రొసీడింగ్స్‌ను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

అసలేం జరిగిందంటే.. 
స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా నుంచి హతషా ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ అనే చిన్న తరహా పరిశ్రమకు మంజూరైన రుణాలకు సంబంధించిన వివాదం ఇది. 2010 నుంచి కంపెనీ రుణాలు తీసుకుంటోందని, 2016లో ఆర్థిక నష్టాలతో అకౌంట్‌ ఎన్‌పీఏ (నిరర్థక ఆస్తి)గా మారిందని కంపెనీ డైరెక్టర్‌ వై.రాజశేఖర్‌ పేర్కొన్నారు. రూ.2.90 కోట్ల టర్మ్‌ లోన్‌ తీర్చడంతోపాటు, ఖాతాను క్రమబద్ధీకరించేందుకు మరో రూ.45 లక్షలు చెల్లించినట్టు ప్రమోటర్లు వెల్లడించారు. 

అయినా, బ్యాంకు అధికారులు తమ పట్ల కుల వివక్ష చూపారని, ఉన్నత కులాల వారికి రాయితీలతో కూడిన పునరావాస ప్యాకేజీలు ఇచ్చి, తమ సంస్థను ఉద్దేశపూర్వకంగా ఆర్థికంగా బహిష్కరించారని ఆరోపిస్తూ పోలీసులను ఆశ్రయించారు. నకిలీ పత్రాలు సృష్టించి తమకు నష్టం కలిగించారని, ఉన్నతాధికారులకు తప్పుడు సమాచారం ఇచ్చారని పేర్కొంటూ  అట్రాసిటీ చట్టంలోని సెక్షన్‌ 3(1)(క్యూ) కింద ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా 2019 ఫిబ్రవరి 4న హైదరాబాద్‌ సీఐడీ పోలీస్‌ స్టేషన్‌లో చవాన్‌ ధర్మేందర్‌ తదితర బ్యాంకు అధికారులపై ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది.

హైకోర్టు తీర్పుతో విభేదించిన సుప్రీం.. 
తమపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేయాలని కోరుతూ బ్యాంకు అధికారులు గతంలో తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఎంఎస్‌ఎంఈల పునరుద్ధరణకు  ఆర్బీఐ, కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను బ్యాంకులు తప్పనిసరిగా పాటించాల్సిందేనని పేర్కొంటూ జోక్యానికి హైకోర్టు నిరాకరించింది. దీంతో బ్యాంకు అధికారులు సుప్రీంకోర్టులో అప్పీల్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు ధర్మాసనం.. హైకోర్టు వైఖరితో విభేదించింది. అధికారులపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయడాన్ని తీవ్రంగా తప్పుబట్టింది. బ్యాంకు అధికారుల విజ్ఞప్తిని మన్నిస్తూ క్రిమినల్‌ ప్రొసీడింగ్స్‌ను కొట్టివేసింది.

ఉద్దేశపూర్వక దూషణలు ఉంటేనే చట్టం వర్తింపు..
అట్రాసిటీ చట్టం కింద నేరం నమోదు కావాలంటే, నిందితులు ఉద్దేశపూర్వకంగా కులం పేరుతో దూషించినట్టు లేదా వివక్ష చూపినట్లు నిర్దిష్టమైన ఆరోపణలు ఉండాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కేవలం వ్యాపార రుణాలు, ఎన్‌పీఏ వ్యవహారాలు, కంపెనీకి పునరావాస ప్రయోజనాలు కల్పించకపోవడం వంటి అంశాల ఆధారంగా అధికారులపై క్రిమినల్‌ చర్యలు తీసుకోవడాన్ని ఏమాత్రం సమర్థించలేమని ధర్మాసనం తేల్చిచెప్పింది. కంపెనీ డైరెక్టర్లను వారి కులం కారణంగా కించపరిచినట్టు ఫిర్యాదులో ఎటువంటి నిర్దిష్ట ఆరోపణలు లేవని న్యాయస్థానం వెల్లడించింది. ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్న ఆరోపణల ప్రాతిపదికన క్రిమినల్‌ ప్రాసిక్యూషన్‌ కొనసాగించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.

ఫిర్యాదుల కోసం డీఆర్‌టీకి వెళ్లొచ్చు...
ఆర్బీఐ మార్గదర్శకాల ఉల్లంఘనలు, పునరావాస ప్రయోజనాలు నిరాకరించడం, రుణగ్రహీతపై బలవంతపు చర్యల కోసం తప్పుడు సమాచారం ఇవ్వడం వంటి ఆరోపణలు వాస్తవంగా ఉంటే డెట్స్‌ రికవరీ ట్రిబ్యునల్‌ (డీఆర్‌టీ) లేదా ఇతర సరైన వేదికను ఫిర్యాదుదారులు ఆశ్రయించొచ్చని సుప్రీంకోర్టు సూచించింది. రికవరీ ప్రొసీడింగ్స్‌ సమయంలో ఈ ఆరోపణలు చట్టబద్ధమైనవా కాదా అనేది సదరు అథారిటీ నిర్ధారిస్తుందని ధర్మాసనం స్పష్టం చేసింది. ఆరోపించిన నకిలీ పత్రాలు సైతం రుణ ఖాతాకు గ్యారెంటర్లుగా ఉన్న కంపెనీ డైరెక్టర్లు ఇచ్చినవేనని నిందితుల తరఫు న్యాయవాదులు వాదనలు వినిపించిన విషయాన్ని కోర్టు పరిగణనలోకి తీసుకుంది. మొత్తం వ్యవహారాన్ని పరిశీలించిన అనంతరం బ్యాంకు అధికారులపై నమోదైన కేసును ధర్మాసనం కొట్టివేసింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement