2 లక్షల మంది ఔట్‌ | Tech companies to lay off 2 lakh people by 2026( | Sakshi
Sakshi News home page

2 లక్షల మంది ఔట్‌

Oct 31 2026 1:00 AM | Updated on Oct 31 2026 1:00 AM

Tech companies to lay off 2 lakh people by 2026(

టెక్‌ కంపెనీల్లో 2026లో తీసివేతల సంఖ్య ఇది 

రోజుకు 654 మంది నిపుణులకు ఉద్వాసన 

ఐటీ ఉద్యోగులు, ఫ్రెషర్లలో లేఆఫ్స్‌ కలవరం 

ఏఐ, ఖర్చులు సాకుగా చూపుతున్న కంపెనీలు

ప్రపంచవ్యాప్తంగా సాంకేతిక రంగంలో ఉద్యోగాల కోతలు విపరీతంగా కొనసాగుతున్నాయి. గత సంవత్సరం కంటే ఈ ఏడాది పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారడం ఐటీ ఉద్యోగులు, ఫ్రెషర్లను కలవరానికి గురిచేస్తోంది. అంతర్జాతీయ అగ్రశ్రేణి టెక్‌ కంపెనీలు తమ ఖర్చులను తగ్గించుకోవడానికి, సాంకేతిక మార్పులకు అనుగుణంగా మారడానికి పెద్ద ఎత్తున సిబ్బందిని తొలగిస్తున్నాయి. 

యూఎస్‌కు చెందిన టెక్‌ కెరీర్, జాబ్‌ మార్కెట్‌ ప్లేస్‌ కంపెనీ ట్రూఅప్‌ ప్రకారం ఈ ఏడాది టెక్‌ కంపెనీలు భారత్‌సహా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 2 లక్షల మందిని తొలగించడం ఆందోళన కలిగించే అంశం. అంటే రోజుకు సగటున 654 మందికి ఉద్వాసన పలుకుతున్నాయన్నమాట. గత ఏడాది ఈ సంఖ్య రోజుకు 674గా నమోదైంది.     – సాక్షి, హైదరాబాద్‌

ఉద్యోగ మార్కెట్‌ సెంటిమెంట్‌.. 
» కొత్తగా వచ్చే అభ్యర్థులు (ఫ్రెషర్స్‌): కొత్తగా చదువు పూర్తి చేసి బయటకు వస్తున్న అభ్యర్థులకు కళాశాల నియామకాలు (క్యాంపస్‌ ప్లేస్‌మెంట్స్‌) బాగా తగ్గిపోయాయి. అగ్రశ్రేణి కంపెనీలు కొత్తవారి నియామకాలను తాత్కాలికంగా నిలిపివేయడం లేదా నెమ్మదించడం చేశాయి. ప్రారంభ స్థాయి ఉద్యోగాల కోసం విపరీతమైన పోటీ నెలకొనడం వల్ల యువతలో నిరాశ పెరుగుతోంది. 
» అనుభవజ్ఞులైన ఉద్యోగులు (సీనియర్‌ లెవల్‌): మధ్య, ఉన్నత స్థాయి నిపుణులకు కూడా మార్కెట్‌ అనుకూలంగా లేదు. భారీ జీతాలు ఉన్న సీనియర్‌ మేనేజర్లను వ్యయ నియంత్రణలో భాగంగా కంపెనీలు తొలగిస్తున్నాయి. ఒకవేళ ఉద్యోగం కోల్పోతే, మార్కెట్లో అదే స్థాయి ప్యాకేజీతో మరో ఉద్యోగం దొరకడం గగనంగా మారింది. అనుభవజ్ఞులు సైతం తమ జీతాల డిమాండ్లను తగ్గించుకుని లభించిన అవకాశాలను అందుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

భారతీయ మార్కెట్‌పై ప్రభావం.. 
ప్రపంచ సాంకేతిక పరిశ్రమకు భారత్‌ ఒక ప్రధాన కేంద్రం. అమెరికా, యూరప్‌ దేశాలకు చెందిన అనేక సంస్థలు తమ సాఫ్ట్‌వేర్‌ అభివృద్ధి, సమాచార విశ్లేషణ, సాంకేతిక సహాయం వంటి పనులను భారత్‌లో నిర్వహిస్తున్నాయి. అందువల్ల ప్రపంచవ్యాప్తంగా సాంకేతిక రంగంలో వచ్చే మార్పులు భారత ఉద్యోగ మార్కెట్‌పై నేరుగా ప్రభావం చూపుతాయి. టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్‌టెక్, విప్రో, టెక్‌ మహీంద్రా వంటి భారత ప్రముఖ సాంకేతిక సంస్థలు కూడా నియామకాల విషయంలో గతంతో పోలిస్తే మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాయి. విదేశీ సేవా ఆధారిత కంపెనీలు భారత్‌లో తమ కొత్త నియామకాలను భారీగా తగ్గించాయి.  

కోతలకు ప్రధాన కారణాలు.. 
కృత్రిమ మేధస్సు విప్లవం: ప్రస్తుత ఉద్యోగాల కోతలకు అతిపెద్ద కారణం కృత్రిమ మేధస్సు, ఆటోమేషన్‌. కంపెనీలు తమ సాధారణ విధులను నిర్వర్తించడానికి మానవ వనరుల కంటే అధునాతన సాంకేతిక సాధనాలపైనే ఎక్కువ మొగ్గుచూపుతున్నాయి. మానవ వనరుల వ్యయాన్ని తగ్గించి, ఆ నిధులను సాంకేతిక మౌలిక వసతుల అభివృద్ధికి మళ్లిస్తున్నాయి. 

వ్యయ నియంత్రణ: కరోనా సమయంలో అవసరానికి మించి సిబ్బందిని నియమించుకున్న కంపెనీలు ఇప్పుడు మార్కెట్‌ ఒడిదుడుకులను తట్టుకోవడానికి అంతర్గత పునర్వ్యవస్థీకరణ చేస్తున్నాయి. 

ఆర్థిక ఒత్తిళ్లు: ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆర్థిక మందగమనం, వ్యాపార లాభాల్లో క్షీణత కూడా కంపెనీలను తమ బడ్జెట్‌ కుదించేలా చేస్తున్నాయి. 

నిశ్శబ్దంగా లేఆఫ్స్‌  
నివేదికల ప్రకారం మన దేశంలోని సాంకేతిక రంగంలో ఈ ఏడాది సుమారు 35,000 ఉద్యోగాల కోతలు ఉండొచ్చని అంచనా. ఇందులో ఎక్కువ శాతం కంపెనీలు బయటకు చెప్పకుండా చేసే ’సైలెంట్‌ లేఆఫ్స్‌’ రూపంలో జరుగుతున్నాయి. భారత మార్కెట్లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఉద్యోగ అవకాశాలు 28 నెలల కనిష్టానికి పడిపోయాయి. ఒరాకిల్‌ వంటి అంతర్జాతీయ సంస్థలు తమ భారతీయ విభాగాల్లో పెద్ద ఎత్తున కోతలు విధించాయి. నిపుణుల అంచనాల ప్రకారం రాబోయే రోజుల్లో స్వయంచాలక పని విధానాల వల్ల భారత్‌లోని సంప్రదాయ ఐటీ ఉద్యోగాల్లో దాదాపు 20 శాతం వరకు శాశ్వతంగా తొలగించే ప్రమాదం ఉందని తెలుస్తోంది. 

యజమానుల మార్కెట్‌గా.. 
ఈ లేఆఫ్స్‌ కేవలం ఉద్యోగాలు కోల్పోవడంతోనే ఆగడం లేదు. మొత్తం కొలువుల మార్కెట్‌ గమనాన్ని మారుస్తున్నాయి. గతంలో ఉద్యోగుల డిమాండ్‌ నడిచిన మార్కెట్‌ ఇప్పుడు పూర్తిగా యజమానుల మార్కెట్‌గా మారిపోయింది. కంపెనీలు కేవలం సాధారణ కోడింగ్‌ నైపుణ్యాలు ఉన్నవారిని కాకుండా, బహుళ నైపుణ్యాలు (మల్టీ–స్కిల్లింగ్‌), కృత్రిమ మేధస్సుపై ప్రవేశం ఉన్న అభ్యర్థులనే కోరుకుంటున్నాయి. సాంకేతిక రంగంలో ఉద్యోగాల కోతల పరంపర ప్రస్తుతానికి ఆందోళన కలిగిస్తున్నా, ఇది ఒక రకమైన మార్పు కాలం అని విశ్లేషకులు భావిస్తున్నారు. సంప్రదాయ ఉద్యోగాలు తగ్గుతున్నా, కొత్త తరం సాంకేతికతలపై పట్టు సాధిస్తేనే రాబోయే రోజుల్లో ఉద్యోగ భద్రత లభిస్తుందని స్పష్టమవుతోంది.  

ప్రముఖ కంపెనీల లేఆఫ్స్‌..
సాంకేతిక ప్రపంచంలో ఈ ఏడాది కంపెనీలు 676 లేఆఫ్స్‌ ప్రకటించాయి. అత్యంత శక్తివంతమైన దిగ్గజ సంస్థలే ఈ ఉద్యోగాల కోతల పరంపరలో ముందుండటం గమనార్హం. మైక్రోసాఫ్ట్‌ సుమారు 60,000 మందికి స్వచ్ఛంద విరమణ పథకం ప్రకటించడం టెక్‌ రంగం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ ఏడాది భారీగా సిబ్బందిని తగ్గించుకున్న కొన్ని ప్రధాన అంతర్జాతీయ సంస్థల వివరాలు..

వేగంగా అందిపుచ్చుకోవాల్సిందే.. 
ఉద్యోగాల కోతలకు ఏఐ ఒక్కటే అసలు కారణం కాదు. వ్యాపార రంగంలో ఇప్పటికే జరుగుతున్న పెద్దమార్పును ఏఐ మరింత వేగవంతం చేస్తోంది. పెరుగుతున్న ఖర్చులు, ఉత్పాదకతపై ఒత్తిడి, తక్కువ వ్యయంతో మెరుగైన నాణ్యత, అధిక వేగం, మెరుగైన ఫలితాలు కావాలన్న కస్టమర్ల అంచనాలు కంపెనీలను మరింత సమర్థంగా, తెలివిగా పనిచేసేలా చేస్తున్నాయి. 

ఏఐతో పని విధానాలు వేగంగా మారుతున్నాయి. ఉత్పత్తులను మార్కెట్‌కు తీసుకెళ్లే సమయం కూడా గణనీయంగా తగ్గుతోంది. కొన్ని ఉద్యోగాల స్వరూపం మారుతున్నా, కొత్త అవకాశాలు కూడా అదే వేగంతో ఏర్పడుతున్నాయి. ఈ మార్పును స్వీకరించి, కొత్త సాంకేతికతలను వేగంగా అందిపుచ్చుకోవడం తప్పనిసరి.  – వెంకారెడ్డి, చీఫ్‌ పీపుల్‌ ఆఫీసర్, క్వాలిజీల్‌.

లేఆఫ్స్‌ విదేశాల్లోనే ఎక్కువ  
లేఆఫ్స్‌లో అధిక భాగం విదేశాల్లో జరుగుతున్నాయి. దీని ప్రభావం విదేశాల్లో పనిచేస్తున్న భారతీయ ఐటీ నిపుణులపైనే ఎక్కువగా ఉంది. విదేశాల్లో పనిచేస్తున్న భారతీయ ఐటీ ఉద్యోగుల్లో మెజారిటీ కోడింగ్‌ నిపుణులే. సరిగ్గా ఈ విభాగంలో పనిచేస్తున్న వారికే ఎక్కువ నష్టం జరుగుతున్నట్లు ఒక అంచనా. ఇకపై భారతీయ ఐటీ టాలెంట్‌కు వీసాలు అధిక కాగ్నిటివ్‌ నైపుణ్యాలు ఉన్నవారికే పరిమితం కావొచ్చు.

 జనరిక్‌ నైపుణ్యాలకు విదేశాల్లో చోటు ఉండకపోవచ్చు. ఇప్పటికే అక్కడ ఉన్నవారిలో స్కిల్స్‌ డెవలప్‌ చేసుకున్నవారు ఉన్నత స్థాయికి వెళ్తున్నారు. మిగిలినవారికి ఉద్యోగాలు దొరక్క దేశం విడిచి రావాల్సిన పరిస్థితులు ఉంటున్నాయి. ఈ వాతావరణంలోనూ భా రత్‌లో జీసీసీల జోష్‌ కొనసాగుతోంది.  – నానాబాల లావణ్యకుమార్,కో–ఫౌండర్, స్మార్ట్‌స్టెప్స్‌. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement