జీవన ప్రమాణాలు పెరగడమే ఆర్థిక సూచీ | Rising living standards are an economic indicator says Bhatti Vikramarka | Sakshi
Sakshi News home page

జీవన ప్రమాణాలు పెరగడమే ఆర్థిక సూచీ

Oct 31 2026 12:55 AM | Updated on Oct 31 2026 12:55 AM

Rising living standards are an economic indicator says Bhatti Vikramarka

సమ్మిళిత అభివృద్ధి, సుస్థిరత,ప్రజాకేంద్రిత పాలనతోనే లక్ష్యసాధన: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క  

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రజల జీవన ప్రమాణాలు పెరగడమే బలమైన ఆర్థిక వృద్ధికి సూచిక అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. రాష్ట్రం 2047 నాటికి 3 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థను చేరడానికి అవసరమైన ప్రతిభ, పారిశ్రామిక సామర్థ్యం, సాంకేతిక పరిజ్ఞానం పుష్కలంగా ఉన్నాయన్నారు. స్థూల ఆర్థిక గణాంకాలు, తలసరి ఆదాయం పెరగడమేకాక సామాన్య ప్రజల జీవన ప్రమాణాలు మార్పు తెచ్చేలా పనిచేస్తున్నట్టు వ్యాఖ్యానించారు. డాక్టర్‌ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ స్వర్ణోత్సవాల సందర్భంగా తుంగభద్ర బ్లాక్, శ్రవణ్‌కుమార్‌ హాల్‌లో నిర్వహిస్తున్న రెండు రోజుల జాతీయ సదస్సు ఆర్థిక వృద్ధి, సుస్థిర అభివృద్ధి, ప్రజా విధానాలు ప్రారంభోత్సవ కార్యక్రమానికి భట్టి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. 

ఈ సందర్భంగా సంస్థ ప్రచురించే సమృద్ధి జర్నల్‌ ప్రత్యేక సంచికను భట్టి ఆవిష్కరించారు. అభివృద్ధి అంటే కేవలం ఆర్థిక సూచీలు పెరగడం మాత్రమే కాదని, యువతకు భద్రమైన ఉపాధి అవకాశాలు, ప్రజలకు అందుబాటులో ఆరోగ్య సేవలు, వ్యవసాయ రంగానికి ఆర్థిక భరోసా కల్పించడం ద్వారా అభివృద్ధి ఫలాలు ప్రతి కుటుంబానికి చేరాలని అన్నారు. హైదరాబాద్‌లో కేంద్రీకృతమవుతున్న ఆర్థిక ప్రగతి రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు కూడా విస్తరించాలని ఆకాంక్షించారు. ఫ్రైట్‌ కారిడార్లు, ప్రత్యక్ష మార్కెట్‌ అనుసంధానాలు, జిల్లాల వారీగా పారిశ్రామిక అవకాశాల కల్పన ద్వారా పట్టణ, పల్లె ప్రాంతాల ఆర్థిక వ్యవస్థలను అనుసంధానించాలని సూచించారు.

మూసీనది పునరుజ్జీవం, భారత్‌ ఫ్యూచర్‌సిటీ వంటి కీలక పట్టణాభివృద్ధి కార్యక్రమాలకు ప్రాధాన్యమిస్తూ ముందుకు సాగాలని స్పష్టం చేశారు. బాధ్యతాయుతమైన బడ్జెట్‌ నిర్వహణ, స్వచ్ఛ ఇంధన వినియోగం, మహిళా స్వయం సహాయక సంఘాల భాగస్వామ్యం, వాతావరణ మార్పుల ప్రభావాలను ఎదుర్కొనే సంస్థాగత వ్యవస్థలను బలోపేతం చేయాల్సిన అవసరాన్ని వివరించారు. రెండు రోజుల జాతీయ సదస్సులో 12 రాష్ట్రాలు, ప్రాంతాల నుంచి ప్రముఖ విద్యావేత్తలు, పరిశోధకులు, విధాన నిపుణులు, అధ్యాపకులు పాల్గొన్నారు. సంస్థ డైరెక్టర్‌ జనరల్‌ శాంతికుమారి, అదనపు డైరెక్టర్‌ జనరల్‌ అనితా రామచంద్రన్‌ అంబేడ్కర్‌ వర్సిటీ వీసీ ప్రొఫెసర్‌ ఘంటా చక్రపాణి, ప్రొఫెసర్‌ శాంతా సిన్హా, తదితరులు పాల్గొన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement