ఢిల్లీ ఐఐటీ ‘ఏజెంట్‌ ఏఐ’! | IIT Delhi has introduced a brand new course | Sakshi
Sakshi News home page

ఢిల్లీ ఐఐటీ ‘ఏజెంట్‌ ఏఐ’!

Oct 31 2026 1:09 AM | Updated on Oct 31 2026 1:09 AM

IIT Delhi has introduced a brand new course

అందుబాటులోకి సరికొత్త కోర్సు 

ఎనిమిది ప్రధాన మాడ్యూళ్లతో రూపకల్పన 

జనవరి 9 నుంచి ఆన్‌లైన్‌ క్లాసులు

సాక్షి, హైదరాబాద్‌: ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ)లో నైపుణ్య సవాళ్ళు ఎదురవుతున్న నేపథ్యంలో ఢిల్లీ ఐఐటీ సరికొత్త కోర్సును అందుబాటులోకి తెచ్చింది. ‘ఏజెంట్‌ ఏఐ’పేరుతో ఆరు నెలల కాలవ్యవధితో దీన్ని అందిస్తోంది. ఐటీ కంపెనీలన్నీ పూర్తి యాంత్రీకరణ, ఏఐ, డేటాబేస్‌ వైపు వెళ్తున్నాయి. ఫలితంగా ఐటీ సంస్థలు ఉద్యోగులను తగ్గించుకుంటున్నాయి. ఈ క్రమంలో ఏఐపై నైపుణ్యం తక్కువగా ఉన్నవాళ్ళే టార్గెట్‌ అవుతున్నారు. దీన్ని ఎదుర్కొనేందుకు ఈ కోర్సు రూపొందించినట్లు ఢిల్లీ ఐఐటీ పేర్కొంది. ఏఐ రంగంలో పనిచేయాలనుకునే విద్యార్థులు, సాఫ్ట్‌వేర్‌ నిపుణులు, డేటా సైన్స్‌ అభ్యర్థులు, ఉద్యోగులు తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి కోర్సును ఎంచుకోవచ్చని ఐఐటీ అధ్యాపకులు సూచిస్తున్నారు.

ఈ కోర్సులో ఏముంటుంది?
ఎనిమిది ప్రధాన మాడ్యూళ్లను ఇందులో చేర్చారు. ఇప్పటి వరకూ ఉన్న కోర్సులకు ఇది భిన్నంగా ఉంటుందని ఢిల్లీ ఐఐటీ తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా వచ్చిన, వస్తున్న మార్పులకు అనుగుణంగా మాడ్యూల్స్‌ను రూపొందించామని పేర్కొంది. 
» ఏజెంటిక్‌ ఏఐ పునాదులు బలోపేతం చేస్తారు. జనరేటివ్‌ ఏఐకి, ఏజెంటిక్‌ ఏఐకి మధ్య తేడాలు తెలియజెప్పడం ఇందులో ముఖ్యమైంది.
» ఆటోనమస్‌ ఏజెంట్ల రూపకల్పన ద్వారా స్వతంత్రంగా ప్రణాళికలు రూపొందించి, పనులను పూర్తి చేసే ఏఐ వ్యవస్థలను అభివృద్ధి చేయగల సామర్థ్యం అందిస్తారు. 
» లార్జ్‌ లాంగ్వేజ్‌ మోడల్స్‌ను పూర్తిగా ఆధునీకరించారు. ఏఐ అప్లికేషన్ల నిర్మాణంలో వీటి వినియోగం పెరిగేలా కోర్సును డిజైన్‌ చేశారు
» ఏఐలో కీలకమైన ర్యాగ్‌ టెక్నాలజీపై అవగాహన కల్పిస్తారు. బాహ్య సమాచార వనరుల నుంచి సమాచారాన్ని సేకరించి, ఏఐ సమాధానాల నాణ్యతను మెరుగుపరచడానికి ఇది ఉపయోగపడుతుంది.
» మల్టీ ఏజెంట్‌ సిస్టమ్స్‌ కూడా కోర్సులో ప్రత్యేకం. వివిధ ఏఐ ఏజెంట్లు సమన్వయంతో పనిచేసే వ్యవస్థల అభివృద్ధి విధానాన్ని ఇందులో చేర్చారు. 
» ఏఐ భద్రత, పాలనను ఒక మాడ్యూల్‌గా చేర్చారు. డేటా భద్రత, విశ్వసనీయత, నియంత్రణ ప్రమాణాలు ఇందులో ఉంటాయి.
» ఎంటర్‌ప్రైజ్‌ డిప్లాయ్‌మెంట్‌ మాడ్యూల్‌ ద్వారా వ్యాపార సంస్థల్లో ఏఐ వ్యవస్థలను అమలు చేయడం, నిర్వహించడం వంటి అంశాలను బోధిస్తారు.
» దీంతో పాటు లాంగ్‌ గ్రాఫిక్, క్రూవ్‌ ఏఐ, ఆటోజెన్, మోడల్‌ కంటెస్ట్‌ ప్రోటోకాల్‌ వంటి సాధనాలపై కూడా కోర్సులో శిక్షణ ఇస్తారు. ప్రాక్టికల్‌ అసైన్‌మెంట్లు, తుది ప్రాజెక్టు ద్వారా నేర్చుకున్న అంశాలను ఆచరణలో ఉపయోగించే అవకాశం కల్పిస్తారు.

రూ. 1.45 లక్షల ఫీజు
ఆరు నెలల కాల వ్యవధి ఉండే ఈ కోర్సుకు రూ1.45 లక్షలు ఫీజు ఉంటుంది. ఢిల్లీ ఐఐటీ నుంచే దీన్ని నిర్వహిస్తారు. బోధన విధానం ఆన్‌లైన్‌ ద్వారా ఉంటుంది. సైన్స్, ఇంజినీరింగ్, కామర్స్‌ తదితర విభాగాల్లో గ్రాడ్యుయేట్లతో పాటు కనీసం ఏడాది అనుభవం ఉన్న ఉద్యోగులు ఈ కోర్సులో చేరేందుకు అర్హులు. ప్రతీ శనివారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ క్లాసులు ఉంటాయి. జనవరి 9 నుంచి క్లాసులు మొదలవుతాయి. సాధారణ జనరేటివ్‌ ఏఐ ప్రధానంగా కంటెంట్‌ను సృష్టించడం, ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడంపై దృష్టి పెడుతుంది. 

ఏజెంటిక్‌ ఏఐ మాత్రం ఒక లక్ష్యాన్ని సాధించేందుకు సమాచారాన్ని సేకరించడం, నిర్ణయాలు తీసుకోవడం, సాఫ్ట్‌వేర్‌ సాధనాలను వినియోగించడం, అనేక దశల్లో పనులను పూర్తి చేయడం వంటి సామర్థ్యాలను అందిస్తుంది. బ్యాంకింగ్, విద్య, ఆరోగ్య సేవలు, ఐటీ, కస్టమర్‌ సర్వీస్, వ్యాపార కార్యకలాపాల ఆటోమేషన్‌ వంటి రంగాల్లో ఈ సాంకేతికతకు అవకాశాలు ఉన్నాయి. ఏజెంటిక్‌ ఏఐ వ్యవస్థలను ఉపయోగించేటప్పుడు భద్రత, మానవ పర్యవేక్షణ, తప్పుల నివారణ కూడా కీలకం. దీన్ని కోర్సులో నేర్పుతారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement