కుంగ్‌ఫూ రోబో! | Chinese company unveils humanoid security robot | Sakshi
Sakshi News home page

కుంగ్‌ఫూ రోబో!

Oct 31 2026 1:32 AM | Updated on Oct 31 2026 1:32 AM

Chinese company unveils humanoid security robot

అత్యాధునిక హ్యూమనాయిడ్‌ సెక్యూరిటీ రోబోను ఆవిష్కరించిన చైనా సంస్థ

కెమెరాలతో నిఘాతోపాటు శత్రువులను భౌతికంగా ఎదుర్కొనే సామర్థ్యం

బ్రూస్‌ లీ లాంటి ఫైటింగ్‌ స్కిల్స్, సూపర్‌ కంప్యూటర్‌ బ్రెయిన్‌ కలబోతగా తయారీ

స్పైడర్‌ మ్యాన్‌ తరహాలో వాహనాల పైనుంచి అమాంతం దూసుకెళ్లింది.. హల్క్‌లాగా ఒక కారు కింద నలిగిపోతున్న వ్యక్తిని కాపాడటానికి ఆ వాహనాన్ని పైకి ఎత్తిపడేసింది. బ్యాట్‌మ్యాన్‌ స్టైల్‌లో ఓ మహిళపై దుండగుడి కత్తి దాడిని తిప్పికొట్టింది.. బ్రూస్‌ లీ, జాకీ చాన్‌లు చేసినట్లుగా కుంగ్‌ఫూతో రఫ్పాడించింది... 13 అడుగుల ఎత్తు నుంచి దూకి పల్టీలు కొట్టింది... కారు బానెట్‌పై మోచేత్తో, సైడ్‌ డోర్‌పై మోకాలితో గట్టిగా తన్నేసింది. హాలీవుడ్‌ సూపర్‌ హీరోల రీతిలో ఇన్ని స్టంట్లు చేసింది ఎవరో కాదు.. ఓ సరికొత్త హ్యూమనాయిడ్‌ రోబో!

సాక్షి, హైదరాబాద్‌: చైనాకు చెందిన యూనిట్రీ రోబోటిక్స్‌ హెచ్‌2–ఎక్స్‌ (కుంగ్‌ఫూ లెజెండ్‌ గార్డియన్‌) పేరిట సరికొత్త హ్యూమనాయిడ్‌ రోబో ప్రొటోటైప్‌ను ఆవిష్కరించింది. ఒకే రకమైన పనిని పునరావృతం చేసే హ్యూమనాయిడ్‌ రోబోలకు పూర్తి భిన్నంగా ఒక బాడీ గార్డ్‌ తరహాలో రక్షణ కల్పించగల రోబోను అభివృద్ధి చేసింది. ఈ రోబో సామర్థ్యాలను ప్రపంచానికి పరిచయం చేస్తూ దాదాపు ఒక నిడివిగల వీడియోను సామాజిక వేదికల ద్వారా విడుదల చేసింది. జంపింగ్, పంచింగ్, కుంగ్‌–ఫూ సామ­ర్థ్యాలను ఏకకాలంలో ప్రదర్శించగలగడం ఈ రోబో ప్రత్యేకత. ఇది కేవలం కెమెరాల ద్వారా నిఘా పెట్టడమే కాకుండా శత్రువులను భౌతికంగా ఎదుర్కోగలదు కూడా. 

బ్రూస్‌ లీ లాంటి ఫైటింగ్‌ స్కిల్స్, రోబో కాప్‌ వంటి బాడీ, సూపర్‌ కంప్యూటర్‌ లాంటి బ్రెయి­న్‌ కలిపితే ఈ రోబో అవుతుంది. 5.5 అడుగుల ఎత్తు, 65 కేజీల బరువు ఉన్న ఈ రోబో.. 8 గంటలపాటు బ్యాటరీతో పనిచేస్తుంది. 31 కోణాల్లో బాడీ కదలికలను చేపడుతుంది. అయితే దీని ధర, వాణిజ్య స్థాయిలో ఉత్పత్తి, మార్కెట్లోకి విడుదల తేదీ వంటి వివరాలను యూనిట్రీ రోబోటిక్స్‌ వెల్లడించలేదు. వచ్చే 5 ఏళ్లలో వాణిజ్య స్థాయిలో ఈ రోబో అందుబాటులోకి రావచ్చని.. ఇళ్ల ముందు నిలబడి కాపలా కాసేందుకు 2030 నుంచి 2035 వరకు సమయం పట్టొచ్చని సాంకేతిక నిపుణులు అంచనా వేస్తున్నారు.

హెచ్‌2–ఎక్స్‌ రోబో ప్రత్యేక ఫీచర్లు ఇవే..
» ఇది సాధారణ రోబోలా నడవడం మాత్రమే కాదు. అడ్డంకులను దాటి పైఅంతస్తుల్లోకి లేదా గోడలపైకి క్షణాల్లో దూకగలదు.
»  ఈ రోబోలోని ఏఐ సిస్టమ్‌లోకి ప్రపంచంలోని అత్యుత్తమ మార్షల్‌ ఆర్ట్స్‌ కుంగ్‌ఫూ పద్ధతులను ఫీడ్‌ చేశారు. దీంతో శత్రువుల దాడులను తప్పించుకుంటూనే వారిని సమర్థంగా ఎదుర్కోగలదు.
»  ఈ రోబో చేతులను దృఢమైన కార్బన్‌ ఫైబర్‌తోపాటు హైడ్రాలిక్‌ ప్రెజర్‌తో తయారు చేసింది. అందువల్ల ఇది విసిరే ఒక్కో పంచ్‌ శత్రువులను క్షణాల్లో అచేతనం చేయగలదు.
»  రోబో తల భాగంలో, శరీరంలో ఉండే థర్మల్, నైట్‌–విజన్, 4కే కెమెరాలు 360–డిగ్రీల కోణంలో చీకట్లోనూ ‘శత్రువులను’ చూడగలదు.
»  ఇది ముఖాన్ని మాత్రమే కాకుండా నడిచే శైలిని, గొంతును బట్టి యజమాని కుటుంబ సభ్యులు, పెంపుడు జంతువులను గుర్తిస్తుంది
»  ఇంట్లో లేదా కాంపౌండ్‌ లోపల జరిగే చిన్న కదలికను లేదా శబ్దాన్ని కూడా వెంటనే పసిగట్టగలదు.
»  ఇది యజమాని ఇంటి వైఫై, సీసీటీవీ కెమెరాలు, స్మార్ట్‌ లాక్స్‌తో కనెక్ట్‌ అయి ఉంటుంది. ఏదైనా ప్రమాదం జరిగితే వెంటనే వారి ఫోన్‌కు అలర్ట్‌ పంపుతుంది. 
»  ఇంట్లోకి వచ్చింది దొంగ అని నిర్ధారణ అయితే పోలీసులకు సమాచారం అందిస్తూనే స్వయంగా రంగంలోకి దిగి దొంగను పట్టుకోగలదు.
» యజమాని మాటలను అర్థం చేసుకొని అతని ఆదేశాల ప్రకారం ఇల్లు శుభ్రం చేయడం లేదా గేట్‌ దగ్గర కాపలా 
కాయడం వంటి పనులు కూడా చేస్తుంది.
»  ఈ రోబో చేతుల్లో టేజర్స్‌ (కరెంట్‌ షాక్‌ ఇచ్చేవి) లేదా పెప్పర్‌ స్ప్రే వంటివి అమర్చారు.
» దొంగలు ఒకవేళ ఆయుధాలతో దాడి చేసినా తట్టుకొనేలా దీని శరీరాన్ని బలమైన టైటానియంతో తయారు చేశారు.

రోబో ఎదురుతిరిగితే...?
హెచ్‌2–ఎక్స్‌ హ్యూమనాయిడ్‌ రోబో సామర్థ్యాలు అద్భుతంగా ఉన్నప్పటికీ దీనిలో ఒకవేళ సాంకేతిక లోపాలు తలెత్తితే ప్రమా­దకరంగా మారే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తమ­­వుతోంది. రోబో ఏదైనా పొరపాటు వల్ల యజమాని కుటుంబ సభ్యు­లను లేదా వారికి ఇంటికి వచ్చే బంధువులను దొంగలుగా భావిస్తే దాని దాడుల వల్ల ప్రాణాలకే ముప్పు ఏర్పడవచ్చు.


»  పిల్లలు ఆడుకుంటూ గాల్లోకి ఎగిరినా లేదా పెంపుడు జంతువులు అకస్మాత్తుగా దూకినా, రోబో వాటిని ముప్పుగా భావించి దాడి చేసే అవకాశం ఉంది.
»  సైబర్‌ నేరగాళ్లు ఈ రోబోలో ఒక సాఫ్ట్‌వేర్‌ బగ్‌ను ప్రవేశపెడితే అది విచక్షణ కోల్పోయి ఇంట్లోని వస్తువులను పగలగొట్టడం లేదా కనిపించిన వారిపై పంచ్‌లు కురిపించే ప్రమాదం ఉంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement