అమ్ముకోవాలని చూస్తున్నది కాంగ్రెస్సే : హరీశ్‌రావు
550 ఎకరాల భూముల పరిరక్షణకు బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలోనే న్యాయపోరాటం
2015 ఏప్రిల్ 7 నుంచే సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయవాది సీఎస్.వైద్యనాథన్ వాదనలు
ట్రినిటీ ఇన్‌ఫ్రావెంచర్స్ కేసులో 2023 జూన్ 15న రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు
సాక్షి, హైదరాబాద్: మియాపూర్‌లోని 550 ఎకరాల విలువైన ప్రభుత్వ భూములను కాపాడింది గత బీఆర్‌ఎస్ ప్రభుత్వమేనని, ఇప్పుడు వాటిని విక్రయించేందుకు ప్రయ త్నిస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వమని బీఆర్‌ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీశ్‌రావు ఆరోపించారు. సుప్రీంకోర్టులో భూముల వివా దానికి సంబంధించిన కేసుల విచారణ, న్యాయవాదుల నియామకం, తీర్పులకు సంబంధించిన రికార్డులను ప్రస్తావిస్తూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలను తప్పుబట్టారు. మియాపూర్ భూవివాదం 2003లోనే ప్రత్యేక అనుమతి పిటిషన్ రూపంలో సుప్రీంకోర్టుకు చేరిందని, 2013లో సివిల్ అప్పీళ్లుగా విచారణకు వచ్చిందని వివరించారు.
రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ భూములు చేజారకుండా అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారన్నారు. 2015 ఏప్రిల్ 7న సుప్రీంకోర్టులో జరిగిన విచారణకు సంబంధించిన రికార్డుల్లోనూ సీనియర్ న్యాయ వాది సీఎస్. వైద్యనాథన్ పేరు ఉందని గుర్తుచేశారు. 2015 నుంచి 2023 వరకు దాదాపు ఎనిమిదేళ్లపాటు బీఆర్‌ఎస్ ప్రభు త్వం న్యాయపోరాటం సాగించిందని తెలిపారు. ఈ మేరకు సుప్రీంకోర్టు రికార్డులను ఉటంకిస్తూ శుక్రవారం హరీశ్‌రావు ఒక ప్రకటన విడుదల చేశారు.
ట్రినిటీ తీర్పే కీలక ఆధారం
మియాపూర్ భూములకు సంబంధించిన సుప్రీంకోర్టు తీర్పులో 2023 జూన్ 15న వెలువడిన ట్రినిటీ ఇన్‌ఫ్రావెంచర్స్ లిమిటెడ్ వర్సెస్ ఎంఎస్.మూర్తి కేసు తీర్పును ప్రస్తా వించారని హరీశ్‌రావు తెలిపారు. 2023 ఎస్‌సీసీ ఆన్‌లైన్ 738గా నమోదైన ఈ తీర్పు లోని 93వ పేరాలో పేర్కొన్న చట్టపరమైన అంశాలను మియాపూర్ కేసులోనూ సుప్రీంకోర్టు ప్రస్తావించిందని వివరించారు. ఆ కేసులో తెలంగాణ ప్రభుత్వం తరఫున సీఎస్.వైద్యనాథన్ వాదించారని, సంబంధిత న్యాయస్థాన రికార్డుల్లో ఈ విషయం స్పష్టంగా ఉందన్నారు.
మియాపూర్ కేసుకు సంబంధించిన 2015, 2023 నాటి విచారణ రికార్డుల్లోనూ ఆయన పేరు ఉన్న విష యాన్ని ప్రస్తావించారు. అప్పటి ప్రభుత్వం సమర్పించిన పిటిషన్లు, అఫిడవిట్లు, ఆధారాలు భూముల పరిరక్షణకు దోహద పడ్డాయని చెప్పారు. ఈ నేపథ్యంలో తాజా తీర్పు ఘనతను అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వానికి దక్కకుండా చేయాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు.
రూ.60 వేల కోట్ల భూములపై కన్ను
మియాపూర్‌లోని 550 ఎకరాల భూముల విలువ రూ.60 వేల కోట్లకు పైగా ఉంటుందని ముఖ్యమంత్రే ప్రకటించారని హరీశ్ రావు గుర్తుచేశారు. ఇంతటి విలువైన ప్రభుత్వ ఆస్తులను ప్రజల భవిష్యత్ అవస రాలకు వినియోగించాల్సింది పోయి విక్ర యించాలని చూస్తున్నారని ఆరోపించారు. భూముల పరిరక్షణకు గత ప్రభుత్వం చేసిన కృషిని విస్మరించి, తామే సాధించిన విజ యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రచారం చేసు కోవడం విడ్డూరంగా ఉందన్నారు. మీడియా సమావేశాలు పెట్టి గత ప్రభుత్వంపై ఆరోపణలు చేసినంత మాత్రాన వాస్తవాలు మారవని వ్యాఖ్యానించారు. సుప్రీంకోర్టు తీర్పులు, విచారణ రికార్డులు ప్రజలకు అందుబాటులో ఉన్నాయని, వాటిని పరిశీలిస్తే భూముల పరిరక్షణలో గత ప్రభుత్వ పాత్ర స్పష్టమవుతుందని పేర్కొన్నారు.


