గత ప్రభుత్వాన్ని ఫడ్నవీస్‌ తప్పుపట్టారు | CM Revanth Reddy in a chit chat with the media | Sakshi
Sakshi News home page

గత ప్రభుత్వాన్ని ఫడ్నవీస్‌ తప్పుపట్టారు

Oct 31 2026 1:19 AM | Updated on Oct 31 2026 1:19 AM

CM Revanth Reddy in a chit chat with the media

ముంపు లెక్కలు తప్పని, పరిహారం ఇవ్వలేదని ఆక్షేపించారు.. 

మీడియాతో చిట్‌చాట్‌లో సీఎం రేవంత్‌రెడ్డి

తుమ్మిడిహెట్టి విషయంలో గత ప్రభుత్వం నిబద్ధతతో పనిచేయలేదని మహారాష్ట్ర సీఎం అన్నారు 

152 మీటర్ల ఎత్తు వల్ల ముంపు, భూ అవసరాలపై తామే సొంతంగా సర్వే చేస్తామని చెప్పారు

కాళేశ్వరం బరాజ్‌ల పునరుద్ధరణ చేయక తప్పదన్న ముఖ్యమంత్రి

పోలవరం–బనకచర్ల ప్రాజెక్టుకు ఆద్యుడు కేసీఆరే అని ఆరోపణ

డిసెంబర్‌ 9లోగా జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇస్తామని హామీ

సాక్షి, న్యూఢిల్లీ: గోదావరి జలాల గరిష్ట వినియోగం లక్ష్యంగా చేపట్టిన తుమ్మిడిహెట్టి బరాజ్‌ నిర్మాణ విషయంలో గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వ్యవహరించిన తీరును మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ తీవ్రంగా తప్పుపట్టారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు. బరాజ్‌  నిర్మాణంతో మహారాష్ట్ర ప్రాంతంలో ముంపునకు గురయ్యే భూముల లెక్కలు తప్పని, పరిహారం విషయంలో నిబద్ధతతో వ్యవహరించలేదని ఆక్షేపించారని తెలిపారు. ‘గత ప్రభుత్వం 148 మీటర్ల ఎత్తులో బరాజ్‌ నిర్మాణానికి చేసుకున్న ఒప్పందం విషయంలో ఉల్లంఘనలున్నాయి. 

తెలంగాణ సర్వే చేసి నిర్మాణానికి అవసరం ఉంటుందని తెలిపిన భూసేకరణ, తదనంతరం మా పరిశీలనలో పెరిగింది. ముంపునకు గురయ్యే భూమికి ఇస్తామని చెప్పిన పరిహారాన్ని గత ప్రభుత్వం చెల్లించలేదు. పరిహారం విషయంలో నిబద్ధతతో వ్యవహరించలేదు. ఒప్పందాల అమలు విషయంలో తెలంగాణ ట్రాక్‌ రికార్డు అంత బాగాలేదు అని ఫఢ్నవీస్‌ నాతో అన్నారు..’ అని ముఖ్యమంత్రి వివరించారు. శుక్రవారం ఢిల్లీలో ఆయన మీడియాతో చిట్‌చాట్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా గోదావరి, కృష్ణా నదీ జలాల వినియోగం విషయంలో తీసుకుంటున్న చర్యలు, ఇటీవల మహారాష్ట్ర ముఖ్యమంత్రితో జరిపిన చర్చల సారాంశాన్ని వివరించారు. 

తుమ్మిడిహెట్టిపై నిబద్ధతతో ఉన్నాం..
‘తుమ్మిడిహెట్టి బరాజ్‌ని 152 మీటర్ల ఎత్తుతో చేపడితే తెలంగాణకు ఒనగూరే ప్రయోజనాలను ఫడ్నవీస్‌కు వివరించా. 148 మీటర్ల ఎత్తుపై గతంలో చేసుకున్న ఒప్పందాలను పునఃపరిశీలించేందుకు ఆయన సానుకూలంగా స్పందించారు. గోదావరి నీటి వినియోగానికి సానుకూలత తెలిపారు. అయితే 152 మీటర్ల ఎత్తులో ఉండే ముంపు, నీటి లభ్యత అంశాలపై తామే స్వయంగా సర్వే నిర్వహిస్తామని అన్నారు. 

గత ప్రభుత్వం సమర్పించిన భూ సర్వే వివరాలు తప్పులతడకగా ఉన్నందున భూముల ముంపుపై మేమే సొంతంగా సర్వే నిర్వహిస్తామని, తెలంగాణ చెబుతున్న అంశాలపై నిజ నిర్ధారణ నివేదికలు తామే తయారు చేస్తామని, పరిహారం లెక్కలు తామే తేలుస్తామని ఫడ్నవీస్‌ చెప్పారు. తుమ్మిడిహెట్టి నిర్మాణం చేయాలన్న ఉద్దేశమే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లేదు. అందుకే పదేళ్లు గాలికొదిలేశారు. మేము మాత్రం తుమ్మిడిహెట్టి నిర్మాణానికి నిబద్ధతతో ఉన్నాం. మహారాష్ట్రతో అంగీకారం కుదిరాక గోదావరి నీటిని నేరుగా ఎల్లంపల్లికి తరలించాలా? లేక సుందిళ్ళ నుంచి ఎల్లంపల్లికి తరలించాలా? అనేది నిర్ణయిస్తాం..’ అని సీఎం చెప్పారు.

కేంద్రం సూచనల మేరకే కాళేశ్వరం పునరుద్ధరణ
‘కాళేశ్వరం బరాజ్‌ల పునరుద్ధరణ విషయంలో ప్రభుత్వానికి ఎలాంటి వివక్ష లేదు. ప్రభుత్వ సంపదతో నిర్మించిన బరాజ్‌లను పునరుద్ధరించాల్సిందే. దీనికి మార్గాలు అన్వేషిస్తున్నాం. మేడిగడ్డ సహా మిగతా రెండు బరాజ్‌లు కూడా ప్రమాదకర స్ధితిలో ఉన్నాయి. వీటిలో నీటిని నిల్వ చేసే పరిస్థితి లేదు. నిర్మాణం పూర్తయిన ప్రాజెక్టులు అయితే వాటి నిర్వహణ, మరమ్మతుల బాధ్యత కేంద్ర డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ చూసుకుంటుంది. కానీ ఇవి ఇంకా నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులే. దీంతో వాటి పునరుద్ధరణ బాధ్యత రాష్ట్రానిదే. అయితే కేంద్ర ఏజెన్సీల సూచనల మేరకు పునరుద్ధరణ విషయంలో ముందుకు వెళతాం. సాంకేతిక నిపుణులు ఇచ్చే సలహాలనే అనుసరిస్తాం.

నీటిని నిల్వ చేయకుండా ఎత్తిపోతలు ఎలా..?
మేడిగడ్డ నుంచి నీటిని ఎత్తిపోయకుండా కాంగ్రెస్‌ ప్రభుత్వం కృత్రిమ కరువును సృష్టిస్తోందని కేటీఆర్, హరీశ్‌రావు ఆరోపిస్తున్నారు. కానీ మేడిగడ్డ బరాజ్‌లో కనీస నీటి నిల్వ ఉంటేనే నీటిని ఎత్తిపోయడానికి సాధ్యమవుతుంది. నీటి ప్రవాహం నుంచి నీళ్లను ఎలా ఎత్తిపోస్తాం? ఒకవేళ మేడిగడ్డ నుంచి నీటిని ఎత్తిపోసినా అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల్లో నీటిని నిల్వ చేసే పరిస్థితి లేదు. అక్కడి నుంచి నీళ్లు మళ్లీ వెనక్కి వెళ్లాల్సిందే..’ అని రేవంత్‌ ధ్వజమెత్తారు. 

పోలవరం–బనకచర్ల ప్రతిపాదన కేసీఆర్‌దే..
‘గోదావరి జలాలను ఏపీ ప్రభుత్వం మళ్లించుకుంటోందని, దీనికి కాంగ్రెస్‌ ప్రభుత్వమే కారణమన్న చందంగా కేటీఆర్, హరీశ్‌ వ్యాఖ్యానిస్తున్నారు. మెడ మీద తలకాయ ఉన్న ఏ రాజకీయ నేతైనా తన సొంత రాష్ట్ర ప్రయోజనాలను పక్కన బెట్టి, పొరుగు రాష్ట్ర ప్రయోజనాలను కాపాడతారా?  భద్రాచలం దిగువన లభ్యతగా ఉండే గోదావరి జలాలను మళ్లించుకునేలా పోలవరం–బనకచర్ల ప్రాజెక్టును ప్రతిపాదించింది మాజీ ముఖ్యమంత్రి కేసీఆరే. అసెంబ్లీ సాక్షిగా భద్రాచలం దిగువన ఉన్న మిగులు నీటిని వాడుకోమని ఉచిత సలహా చంద్రబాబుకు ఇచ్చింది కేసీఆరే..’ అని సీఎం ఆరోపించారు. (అందుకు సంబంధించిన వీడియోను చూపించారు) 

కృష్ణాను ఎండబెట్టింది కేసీఆరే..
‘కృష్ణా పరీవాహక ప్రాంతాలకు నీళ్లిచ్చే ప్రాజెక్టులను పదేళ్ల హయాంలో కేసీఆర్‌ ప్రభుత్వం పూర్తిగా పండబెట్టింది. కల్వకుర్తి, ఎస్‌ఎల్‌బీసీ, పాలమూరు–రంగారెడ్డి సహా ఒక్క ప్రాజెక్టునూ పూర్తి చేయలేదు. జూరాల నుంచి నీటిని తీసుకునేలా చేపట్టిన కొడంగల్‌ ఎత్తిపోతలను రద్దు చేశారు. భూసేకరణకు డబ్బులివ్వకుండా కమీషన్లు వచ్చే పనులను చేశారు. ఓ పక్క రోజుకు 11 టీఎంసీల నీటిని తరలించుకునేలా ఏపీ ప్రాజెక్టులకు అనుమతులిచ్చి, తెలంగాణ ప్రాంతానికి కేసీఆర్‌ తీరని అన్యాయం చేశారు. నదీ జలాల విషయంలో నాకు రాష్ట్ర ప్రయోజనాలు తప్ప, మిగతా ఏ ప్రయోజనాలూ లేవు. ఎవరి ప్రయోజనాలూ కాపాడాల్సిన అవసరం లేదు..’ అని ముఖ్యమంత్రి అన్నారు. 

జర్నలిస్టుల ఇళ్ల స్థలాలకు భూమి గుర్తించండి
జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలపై రేవంత్‌రెడ్డి స్పష్టత ఇచ్చారు. డిసెంబర్‌9 లోగా జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు అన్ని చర్యలూ తీసుకుంటామన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులతో కలపకుండా జర్నలిస్టులకు వేరుగా భూమిని గుర్తించి, లే అవుట్‌లను సిద్ధం చేయాలని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని ఆదేశించారు. కొంగర కలాన్, ఫ్యూచర్‌ సిటీలో ఎక్కడ భూమి కేటాయించాలన్న దానిపై జర్నలిస్టులతో చర్చించాలని మంత్రికి సూచించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement