పీజీ మెడికల్‌ ఫీజు పెంపునకు బ్రేక్‌ | Medical PG Fees High Court Relief | Sakshi
Sakshi News home page

పీజీ మెడికల్‌ ఫీజు పెంపునకు బ్రేక్‌

Nov 19 2026 5:19 AM | Updated on Nov 19 2026 5:19 AM

Medical PG Fees High Court Relief

పెంచిన వర్సిటీ ఫీజులో సగమే వసూలు చేయాలని హైకోర్టు ఆదేశం

క్లినికల్‌ ఎంక్యూ–1కు రూ.లక్ష.. ఎంక్యూ–2, 3కు రూ.1.5 లక్షలుగా నిర్ధారణ

మధ్యంతర ఉత్తర్వుల జారీ

సాక్షి, హైదరాబాద్‌: మెడికల్‌ పీజీ మేనేజ్‌మెంట్‌ కోటా సీట్లకు కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం పెంచిన యూనివర్సిటీ ఫీజులపై హైకోర్టు బ్రేక్‌ వేసింది. భారీగా పెంచిన ఫీజులను సగానికి తగ్గిస్తూ విద్యార్థులకు ఊరట కల్పించింది.

గత రెండు విద్యా సంవత్సరాలతో పోలిస్తే వర్సిటీ ఫీజులను అసాధారణ స్థాయిలో పెంచడాన్ని ధర్మాసనం తప్పుబట్టింది. ఈ పెంపును సవాల్‌ చేస్తూ దాఖలైన రిట్‌ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు.. మధ్యంతర ఉపశమనం కల్పించేందుకు ప్రాథమికంగా తగిన ఆధారాలు ఉన్నాయని అభిప్రాయపడింది. నవంబర్‌ 16న ఈ మేరకు తాత్కాలిక ఉత్తర్వులు జారీ చేసింది.

రూ.3 లక్షల ఫీజు రూ.1.5 లక్షలకు.. 
పీజీ మేనేజ్‌మెంట్‌ కోటాలోని క్లినికల్‌ సీట్లకు విశ్వవిద్యాలయం పెంచిన ఫీజులపై హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. ఎంక్యూ–1 కేటగిరీ క్లినికల్‌ సీట్లకు గతంలో రూ.49,600గా ఉన్న వర్సిటీ ఫీజును ఏకంగా రూ.2 లక్షలకు పెంచారు.

దీనిని తాజాగా హైకోర్టు రూ.లక్షకు తగ్గించింది. అంటే పెంచిన మొత్తంలో సగం మాత్రమే వసూలు చేయాలని ఆదేశించింది. అదేవిధంగా ఎంక్యూ–2, ఎంక్యూ–3 కేటగిరీల క్లినికల్‌ సీట్లకు గతంలో రూ.69,600గా ఉన్న ఫీజును రూ.3 లక్షలకు పెంచగా.. దానిని రూ.1.5 లక్షలకు పరిమితం చేసింది. దీంతో ఈ రెండు కేటగిరీల విద్యార్థులకు కూడా ఫీజు భారం సగానికి తగ్గనుంది.

వర్సిటీ, ప్రభుత్వానికి నోటీసులు 
ఫీజుల పెంపును సవాల్‌ చేస్తూ దాఖలైన కేసులో విచారణ చేపట్టిన ధర్మాసనం.. ఫీజుల పెంపునకు సంబంధించిన పూర్తి వివరాలతో రికార్డులు సమర్పించాలని ప్రభుత్వాన్ని, వర్సిటీని ఆదేశించింది. నోటీసులకు 4 వారాల్లో సమాధానం ఇవ్వాలని స్పష్టం చేసింది. ప్రతివాదులు కౌంటర్‌ అఫిడవిట్‌ దాఖలు చేసిన వెంటనే కేసును తదుపరి విచారణకు లిస్టింగ్‌ చేయాలని సూచించింది.

అయితే ఫీజుల తగ్గింపుపై ఇచ్చిన ఈ ఉత్తర్వులు రిట్‌ పిటిషన్‌పై తుది తీర్పునకు లోబడి ఉంటాయని స్పష్టం చేసింది. అంటే ప్రస్తుతం విద్యార్థులకు లభించింది మధ్యంతర ఉపశమనమే. కేసు తుది విచారణలో వెలువడే తీర్పును బట్టి ఫీజులపై అంతిమ నిర్ణయం ఉండనుంది.

ఫీజుల పెంపుపై అభ్యంతరాలు 
గత రెండు విద్యా సంవత్సరాల్లో అమలైన ఫీజులతో పోలిస్తే ప్రస్తుత విద్యా సంవత్సరానికి విశ్వవిద్యాలయం భారీగా ఫీజులు పెంచడాన్ని పిటిషనర్లు హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. పీజీ వైద్య విద్య అభ్యసించే విద్యార్థులపై ఈ పెంపు తీవ్ర ఆర్థిక భారాన్ని మోపుతుందని వాదించారు.

ఈ వాదనలను పరిశీలించిన ధర్మాసనం మధ్యంతర ఉపశమనానికి ప్రాథమికంగా తగిన ఆధారాలు ఉన్నాయంటూ పెంచిన ఫీజులను సగానికి తగ్గించింది. పిటిషనర్ల తరఫున న్యాయవాది సామ సందీప్‌రెడ్డి వాదనలు వినిపించారు. వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ తరఫున అసిస్టెంట్‌ గవర్నమెంట్‌ ప్లీడర్‌ తండ్ర రమేష్‌ హాజరయ్యారు. కాళోజీ వర్సిటీ తరఫున స్టాండింగ్‌ కౌన్సెల్‌ టి.శరత్‌ తరఫున న్యాయవాది జి.రవి హాజరయ్యారు.

ఇదీ చదవండి: సాగర్‌పై ఏపీ ప్రాజెక్టును నిలుపుదల చేయిస్తాం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement