సాగర్‌పై ఏపీ ప్రాజెక్టును నిలుపుదల చేయిస్తాం | Uttam Kumar Reddy KTR Sagar Water Dispute | Sakshi
Sakshi News home page

సాగర్‌పై ఏపీ ప్రాజెక్టును నిలుపుదల చేయిస్తాం

Nov 19 2026 5:03 AM | Updated on Nov 19 2026 5:13 AM

Uttam Kumar Reddy KTR Sagar Water Dispute

ఏపీ పనులు చేస్తోందని తెలిసిన వెంటనే కేంద్రానికి, బోర్డుకు ఫిర్యాదు చేశాం

బీఆర్‌ఎస్‌ హయాంలోనే కృష్ణా జలాల్లో రాష్ట్రానికి ద్రోహం

వారు ఒక్క ప్రాజెక్టునూ పూర్తి చేయలేదు

మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ధ్వజం.. కేటీఆర్‌ ఆరోపణలకు ఖండన

సోనియాగాంధీ గుండెల్లో తెలంగాణ ఉందని వ్యాఖ్య

సాక్షి, హైదరాబాద్‌: కేంద్ర ప్రభుత్వ పథకం ‘జల్‌జీవన్‌ మిషన్‌’ కింద నాగార్జునసాగర్‌ నుంచి 1.8 టీఎంసీలను తరలించడానికి ఏపీ ప్రభుత్వం పనులు చేస్తోందని తెలిసిన వెంటనే కేంద్ర ప్రభుత్వం, కృష్ణాబోర్డుకి ఫిర్యాదు చేయడంతోపాటు ఏపీ ప్రభుత్వానికి తీవ్ర అభ్యంతరం తెలిపామని నీటిపారుదల శాఖ మంత్రి ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు.

తప్పనిసరిగా ఈ ప్రాజెక్టును నిలుపుదల చేయిస్తామని ప్రకటించారు. నాగార్జున సాగర్‌ నుంచి 9 టీఎంసీల కృష్ణా జలాలను తరలించడానికి ఏపీ ప్రభుత్వం చేస్తున్న పనులకు సీఎం రేవంత్‌రెడ్డి, ఉత్తమ్‌ సహకరిస్తున్నారంటూ బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ చేసిన ఆరోపణలను ఖండించా­రు.

ఉత్తమ్‌ సచివాలయంలో బుధవారం విలేకరుల సమా­వేశంలో మాట్లాడుతూ.. కేటీఆర్‌ ఆరోపించినట్టు 9 టీఎంసీలు కాదు.. 1.8 టీఎంసీలను తరలించడానికి ఏపీ పనులు చేస్తోందని, అయినా అభ్యంతరం తెలిపామన్నారు. తమ కోటా నీళ్లనే తాగునీటి కోసం వాడుకోవడానికి ప్రాజెక్టు ని­ర్మించుకుంటున్నట్టు ఏపీ బదులిచ్చినా.. పనులు ఆపేయా­లని కోరినట్లు చెప్పారు. నాగార్జునసాగర్‌ భద్రత, తెలంగాణ నీటి వాటాల పరిరక్షణలో రాజీపడే ప్రసక్తే లేదన్నారు.

సోనియా లేకుంటే రాష్ట్రమే లేదు...
సోనియా గాంధీ పుస్తకంలో తెలంగాణ ప్రస్తావన లేదని కేటీఆర్‌ చేసిన విమర్శపై స్పందిస్తూ ఆమె గుండెల్లో తెలంగాణ ఉందని మంత్రి ఉత్తమ్‌ బదులిచ్చారు. ఆమె లేకుంటే తెలంగాణ రాష్ట్రమే లేదన్నారు. కేటీఆర్‌ కుటుంబానికి వచ్చి­న అదృష్టం, పదవులు ఆమె పుణ్యమే అని ఘాటుగా బదు­లిచ్చారు. ఆమె దృఢ సంకల్పంతోనే తెలంగాణ వచ్చిందని, కేటీఆర్‌ నాయన కూడా అసెంబ్లీలో ఇదే చెప్పిండని గుర్తు చేశారు.

పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో సాగునీటి ప్రాజెక్టులపై రూ.లక్షా 83వేలు ఖర్చుచేసి ఒక్క ప్రాజెక్టు అయినా పూర్తి చేశా­రా? అని ఉత్తమ్‌ ప్రశ్నించారు. తెలంగాణ ఏర్పడిన నాటికి అసంపూర్తిగా ఉన్న పాల­మూ­రు–రంగారెడ్డి, కల్వకుర్తి, నెట్టెం­పాడు, బీమా, కోయిల్‌సాగర్, ఆర్డీఎస్‌ ఆధునికీకరణ, ఎస్‌ఎల్‌­బీసీ, డిండి ప్రాజెక్టులు.. బీఆర్‌ఎస్‌ పాలన ముగిసే నాటికీ అసంపూర్తి­గానే ఉండిపోయాయని విమర్శించా­­రు. గత ప్రభుత్వం గోదావరి ప్రాజెక్టులపై 75.2శాతం, కృష్ణా ప్రాజెక్టులపై 24.8శాతం నిధులను ఖర్చు చేసి కృష్ణాప్రాజెక్టుల పట్ల వివక్ష చూపిందన్నారు.

ద్రోహం చేసింది కేసీఆరే..
కృష్ణా జలాల్లో ఉమ్మడి ఏపీకి ఉన్న 811 టీఎంసీల వాటాలో ఏపీకి 512 టీఎంసీలు ఇచ్చి తెలంగాణకు 299 టీఎంసీలు కేటాయిస్తే సరిపోతుందని నాడు సీఎంగా ఉన్న కేసీఆర్‌ సంతకాలు చేసి తెలంగాణకు తీరని ద్రోహం చేశారని ఉత్తమ్‌ మండిపడ్డారు. తాము వచ్చాక తెలంగాణకు 555 టీఎంసీలకు ఇవ్వాలని కృష్ణా ట్రిబ్యునల్‌ ముందు వాదనలు వినిపించామన్నారు.

రాయలసీమ ఎత్తిపోతల, పోతిరెడ్డిపాడు, ముచ్చుమర్రి ప్రాజెక్టులతో ఏపీ కృష్ణాజలాలను భారీగా తరలించుకుంటే బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నాడు పట్టించుకోలేదని తప్పుబట్టారు. కాళేశ్వ­రం ప్రాజెక్టుపై చూపిన ప్రేమ పాలమూరు ప్రాజెక్టుపై చూపలేదని, మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల ప్రజలపై ఎందుకింత కక్ష సాధింపు అని కేటీఆర్‌ను ప్రశ్నించారు.

కమీషన్లపై కక్కుర్తితో పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు సోర్సును జూరాల నుంచి శ్రీశైలంకు మార్చి పాలమూరు జిల్లాకు బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ద్రోహం చేసిందని ఉత్తమ్‌ ఆరోపించారు. మూడేళ్ల కాంగ్రెస్‌ పాలనలో కృష్ణా, గోదావరి జలాల్లో ఇప్పటి వరకు అత్యధిక నీళ్లను వాడుకున్నట్టు ఉత్తమ్‌ తెలిపారు. బీఆర్‌ఎస్‌ హయాంలో తెలంగాణలో సగటు వార్షిక నీటివినియోగం 210 టీఎంసీలు ఉండగా, కాంగ్రెస్‌ హయాంలో 247 టీఎంసీలకు పెరిగిందన్నారు.

3గత పదేళ్లలో అత్యధికంగా 2024–25లో 286 టీఎంసీల కృష్ణాజలాలను వాడుకున్నామన్నారు. 2014కు ముందు పదేళ్ల కాంగ్రెస్‌ పాలనలో శ్రీశైలం నుంచి ఏపీ 730 టీఎంసీలు బేసిన్‌ బయటకి తరలించగా, 10 ఏళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో 1190 టీఎంసీలను తరలించుకుందని ఆరోపించారు.

ఇదీ చదవండి: జల దోపిడీకి రేవంత్‌ సహకారం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement