వచ్చేలోగా 'వడ్డీం'పు | Telangana Farmers Loan Moratorium Troubles | Sakshi
Sakshi News home page

వచ్చేలోగా 'వడ్డీం'పు

Nov 19 2026 4:10 AM | Updated on Nov 19 2026 4:10 AM

Telangana Farmers Loan Moratorium Troubles

కరువు మండలాల రైతాంగానికి మారటోరియం ఎఫెక్ట్‌

మారటోరియం అమల్లోకి వచ్చేలోగా వీలైనంత వసూలు చేసుకునే యోచనలో బ్యాంకులు

బ్యాంకర్ల ‘ముందు చూపు’తో ప్రతికూల పరిస్థితుల్లోనూ అన్నదాతలపై వడ్డీ భారం

రుణాల రెన్యువల్‌ కోసం అదే పనిగా ఫోన్లు.. వడ్డీ చెల్లించాలంటూ సిబ్బంది ఒత్తిళ్లు

మళ్లీ రుణాలు రావంటూ రైతులకు హెచ్చరికలు

దీంతో మళ్లీ అప్పు చేసి వడ్డీ కడుతున్న వైనం

రైతు రుణ వసూళ్ల నిలిపివేత నిర్ణయం, ఎస్‌ఎల్‌బీసీ తీర్మానం కాగితాలకే పరిమితం

వడ్డీ రాయితీ లేదా సర్దుబాటుపై స్పష్టత కరువు

రూ.60 వేల కోట్లకు పైగా స్వల్పకాలిక రైతు రుణాలపై రూ.2,400 కోట్ల వరకు వడ్డీ అంచనా

దీనిపై స్పష్టత ఇవ్వాలంటున్న రైతు సంఘాలు

సాక్షి, హైదరాబాద్‌: కరువు వేళ రాష్ట్ర రైతాంగానికి కొత్త తిప్పలు వచ్చి పడ్డాయి. రైతు రుణాలపై ప్రకటించిన మారటోరియం వారిని ఇబ్బందులకు గురిచేస్తోంది. ప్రభుత్వం ప్రకటించిన కరువు మండలాల్లో ఇది అమలు కానుంది. రైతు రుణాల వసూళ్లపై తాత్కాలిక నిషేధానికి బ్యాంకర్లు సూత్రప్రాయంగా అంగీకరించారు. అయితే, ఆదుకుంటామంటూ ప్రభుత్వం, అండగా ఉంటామంటూ ఎస్‌ఎల్‌బీసీ చేసిన ప్రకటన అన్నదాతకు భారంగా పరిణమిస్తోంది.

మారటోరియం అమల్లోకి వచ్చేలోగా అయినకాడికి వసూలు చేసుకుందామని భావిస్తున్న బ్యాంకులు.. వెంటనే రుణాలు రెన్యువల్‌ చేసుకోమంటూ తెస్తున్న ఒత్తిడి కారణంగా  రైతులు వెంటనే పాత రుణాలకు వడ్డీలు చెల్లించి వాటిని రెన్యువల్‌ చేసుకోవాల్సి వస్తోంది. అధికారికంగా ప్రకటించిన కరువు మండలాల్లో రైతు రుణాలపై మారటోరియం అమలు చేసే విషయంలో తీర్మానం చేసి మరీ అంగీకరించిన బ్యాంకర్లకు తోడు ప్రభుత్వమూ అంటీముట్టనట్టు వ్యవహరిస్తుండడమే ఇందుకు కారణమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అసలు మారటోరియం ప్రకటనకు సార్థకత ఏంటనే ప్రశ్న ఉదయిస్తోంది.

''నేను ఎప్పుడు బ్యాంకు రుణం రెన్యువల్‌ చేసుకోవాలని వెళ్లినా కనీసం రెండు నుంచి మూడు గంటలు పట్టేది. సిబ్బంది సరిగా పట్టించుకోరు. సర్వర్లు పనిచేయడం లేదని, సిబ్బంది అందుబాటులో లేరని ఏవో కారణాలు చెబుతూ జాప్యం చేసేవారు. కానీ ఈనెల 16వ తేదీన మా ఊళ్లో ఉన్న బ్యాంకుకు రెన్యువల్‌ కోసం వెళ్లగానే సరిగ్గా పదిహేను నిమిషాల్లో రూ.10 వేలు కట్టించుకుని పని పూర్తి చేశారు. వాస్తవానికి అంతకు ముందు రోజు నాలుగైదుసార్లు బ్యాంకు నుంచి నాకు ఫోన్లు వచ్చాయి. వడ్డీ కట్టి అప్పు రెన్యువల్‌ చేసుకోవాలని బ్యాంకు సిబ్బంది పదేపదే చెప్పారు. దీనితో చేసేది ఏమీ లేక బ్యాంకుకు వెళ్లి రుణం రెన్యువల్‌ చేసుకున్నా.''
– ఎం. యాదయ్య, జాజిరెడ్డి గూడెం, సూర్యాపేట జిల్లా

తీర్మానం చేసి తొమ్మిది రోజులు 
రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో పంట రుణాలపై మారటోరియం విధించాలని ఇటీవల ప్రజాభవన్‌లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమక్షంలో జరిగిన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్‌ఎల్‌బీసీ) సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఏడాది పాటు మారటోరియం విధించడంతో పాటు తీవ్రంగా కరువు ఉన్న మండలాల్లో ఐదేళ్లు, ఓ మోస్తరు కరువు ఉన్న మండలాల్లో మూడేళ్ల పాటు రైతులు రుణాలు తిరిగి చెల్లించే వెసులుబాటు ఇవ్వాలని, రైతులు మారటోరియం కోసం దరఖాస్తు చేసుకోకపోయినా సుమోటోగా తీసుకోవాలని మరీ తీర్మానం చేశారు.

ఈ తీర్మానం చేసి తొమ్మిది రోజులు పూర్తి కాగా, ఇంతవరకు మారటోరియంపై ప్రభుత్వం నుంచి అధికారిక లేదంటే బహిరంగ ప్రకటన రాలేదు. అంతర్గతంగా ప్రభుత్వం, బ్యాంకర్ల మధ్య జరిగే సంప్రదింపుల కాగితాలకే ఇది పరిమితం అయ్యింది. దీంతో బ్యాంకుల సిబ్బంది రైతు రుణాల రెన్యువల్‌పై దృష్టి పెట్టారు. 

వెంటనే రండి.. రెన్యువల్‌ చేసుకోండి
బ్యాంకులు రైతుల నుంచి రుణాలు వసూలు చేసుకునే విషయంలో ముందు చూపుతో వ్యవహరిస్తున్నాయి. ఫలానా తేదీ నుంచి మారటోరియం అమల్లోకి వస్తుందనే నిబంధన లేకపోవడం, వచ్చే నెల 8వ తేదీలోగా అమల్లోకి తేవాలని బ్యాంకర్లే గడువు విధించుకోవడం, మారటోరియం సమయంలో రైతు రుణాలకు అయ్యే వడ్డీని చెల్లించే విషయంలో ప్రభుత్వం నుంచి స్పష్టత లేకపోవడం, ఇప్పటివరకు అధికారిక ప్రకటన ఏదీ వెలువడకపోవడంతో.. బ్యాంకర్లు ఇదే అదనుగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి.

ముఖ్యంగా వచ్చే నెల 8వ తేదీలోపు వీలున్నన్ని రైతు రుణాలను రెన్యువల్‌ చేసుకుని, మిగిలిన అరకొర రుణాలపై మారటోరియం అమలు చేస్తే స్వామి కార్యం, స్వకార్యం రెండూ నెరవేరుతాయనే ఆలోచనతో బ్యాంకర్లు ముందుకెళుతున్నారు. ఈ నేపథ్యంలోనే రైతులకు బ్యాంకుల నుంచి ఫోన్లమీద ఫోన్లు వస్తున్నాయి. వెంటనే వచ్చి వడ్డీ కట్టి పాత రుణం రెన్యువల్‌ చేయించుకోవాలని, లేదంటే రబీలో రుణాలివ్వబోమని, భవిష్యత్తులో ఇచ్చే రుణాలకు కూడా ఇబ్బంది అవుతుందంటూ ఒత్తిడి తెస్తున్నాయి.

దీంతో రైతులు మళ్లీ అప్పులు చేసి గతంలో తీసుకున్న అప్పుకు వడ్డీ చెల్లించి రుణాలను రెన్యువల్‌ చేసుకుంటున్నారు. వాణిజ్య బ్యాంకులతో పాటు సహకార బ్యాంకులు కూడా ఇదే తీరున వ్యవహరిస్తున్నాయని క్షేత్రస్థాయి పరిస్థితులు చెపుతున్నాయి. కొన్ని చోట్ల రుణాల చెల్లింపునకు బ్యాంకుల నుంచి రైతులకు నోటీసులు సైతం వస్తుండడం గమనార్హం.

వడ్డీ లెక్క తేలితేనే..!
ఆర్థిక సూత్రాలకు లోబడి పనిచేసే బ్యాంకులు అంత సులువుగా మారటోరియం అమలుకు చిత్తశుద్ధితో పూనుకోలేవని రైతు సంఘాలంటున్నాయి. రైతులు తీసుకున్న రుణాలకు వడ్డీలు చెల్లిస్తేనే ఆ రుణాలను రెన్యువల్‌ చేస్తాయని, ఏడాది పాటు వసూళ్ల జోలికి వెళ్లకుండా ఉంటాయని, ఆ వడ్డీ లెక్క తేలితేనే రైతులపై బ్యాంకర్ల ఒత్తిడి తగ్గుతుందని వారంటున్నారు.

రైతు సంఘాల అభిప్రాయం మేరకు లెక్కల్లోకి వెళితే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు రూ.98 వేల కోట్ల స్వల్పకాలిక రుణాలను బ్యాంకుల నుంచి రైతులు తీసుకున్నారు. అయితే రాష్ట్రంలోని 58 శాతం మండలాలనే కరువు మండలాలుగా ప్రకటించినందున ఆ మేరకు ఆయా మండలాల్లో రైతు స్వల్ప కాలిక రుణాలు రూ.60 వేల కోట్ల వరకు ఉంటాయని అంచనా. వీటికి కనిష్టంగా 4 శాతం వడ్డీ లెక్కిస్తే రూ.2,400 కోట్లు, 7 శాతం లెక్కగడితే రూ.4,200 కోట్లు కట్టాల్సి ఉంటుంది.

ఈ వడ్డీ మొత్తాన్ని చెల్లించే విషయంలోనే రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పష్టత రావాల్సి ఉందని రైతు సంఘాలంటున్నాయి. లేదంటే కేంద్రాన్ని ఒప్పించి వడ్డీ రాయితీ పొందల్సి ఉంటుంది. ఈ రెండింటిలో ఏదో ఒకటి జరిగితేనే బ్యాంకుల నుంచి ఒత్తిడి తగ్గుతుందని లేదంటే వచ్చే నెల 8వ తేదీలోపు కనీసం 60 శాతం రైతు రుణాలు రెన్యువల్‌ అయిపోతాయని, అప్పుడు మారటోరియం కూడా అవసరం లేదని రైతు సంఘాలు స్పష్టం చేస్తుండటం గమనార్హం.

ఇదీ చదవండి: సిద్దిపేట వేదికగా కీలక పథకం.. సీఎం రేవంత్‌ రెడ్డి పర్యటన!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement