హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌కు తెలంగాణ హైకోర్టు ఊహించని షాక్! | Telangana High Court directed DGP to produce HYDRAA Commissioner AV Ranganath | Sakshi
Sakshi News home page

హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌కు తెలంగాణ హైకోర్టు ఊహించని షాక్!

Nov 11 2026 11:15 PM | Updated on Nov 11 2026 11:25 PM

Telangana High Court directed DGP to produce HYDRAA Commissioner AV Ranganath

సాక్షి,హైదరాబాద్: హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌కు తెలంగాణ హైకోర్టు ఊహించని షాకిచ్చింది. వచ్చే మంగళవారం హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ను కోర్టులో హాజరు పరచాలని రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్‌కు ఆదేశాలు జారీ చేసింది. అదేవిధంగా, శంషాబాద్ ఎమ్మార్వోను సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్వయంగా కోర్టులో హాజరుపరచాలని స్పష్టం చేసింది.

న్యాయస్థానం ఉత్తర్వులను బేఖాతరు చేస్తూ చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్న అధికారుల తీరుపై తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు సమన్లు జారీ చేసినప్పటికీ విచారణకు గైర్హాజరైన హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్, శంషాబాద్ ఎమ్మార్వోల వ్యవహారంపై న్యాయస్థానం తప్పుబట్టింది. వారి వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలన్న అభ్యర్థన పిటిషన్లను తోసిపుచ్చింది.  

2024 సంవత్సరంలో శంషాబాద్ పరిధిలోని ఒక వివాదాస్పద భూమికి సంబంధించి హైకోర్టు ముందస్తు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, ఆ ఉత్తర్వులను లెక్కచేయకుండా హైడ్రా కమిషనర్ రంగనాథ్ తో పాటు స్థానిక రెవెన్యూ అధికారులు ఆ భూమి వద్దకు భారీగా తరలివెళ్లారు. అక్కడ ఉన్న నిర్మాణాలను ఎలాంటి ముందస్తు నోటీసులు లేకుండా కూల్చివేయడమే కాకుండా, భూమి చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసి ఇది ప్రభుత్వ భూమి అంటూ అధికారిక బోర్డులను కూడా పాతారు.

కోర్టు ఉత్తర్వులు అమల్లో ఉండగా ఇలా బోర్డు ఏర్పాటు చేయడంపై పలువురు తెలంగాణ  హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ కేసుకు సంబంధించి గతంలోనే హైడ్రా కమిషనర్, రెవెన్యూ అధికారులకు కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ కావడంతో పాటు వ్యక్తిగతంగా హాజరుకావాలని ఆదేశాలు వెలువడ్డాయి.

ఇవాళ జరిగిన విచారణకు సంబంధిత అధికారులు హాజరు కాకపోవడాన్ని న్యాయస్థానం తీవ్రంగా పరిగణించింది.   వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరుతూ దాఖలైన పిటిషన్లను కొట్టివేసిన ధర్మాసనం, చట్టాన్ని అమలు చేయాల్సిన అధికారులే స్వయంగా కోర్టు ఆదేశాలను ఉల్లంఘించడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.

ఇందులో భాగంగానే హైడ్రా చీఫ్ రంగనాథ్‌ను వచ్చే మంగళవారం డీజీపీ ద్వారా కోర్టు ముందు హాజరుపరచాలని, అలాగే శంషాబాద్ ఎమ్మార్వోను సైబరాబాద్ సీపీ ద్వారా ప్రొడ్యూస్ చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement