లే బిడ్డా.. నా గతి ఏం కావాలె? | Maktal Anitha Death Harassment Case Telangana | Sakshi
Sakshi News home page

లే బిడ్డా..నా గతి ఏం కావాలె?

Nov 14 2026 8:38 AM | Updated on Nov 14 2026 8:38 AM

Maktal Anitha Death Harassment Case Telangana

అనిత (ఫైల్‌)

ఉద్యోగం వచ్చేదాక చదువుతా అంటివి కదా..

కూతురు మృతదేహంవద్ద ఓ తల్లి కన్నీటిపర్యంతం

యువకుడి వేధింపులకు యువతి బలి

నారాయణపేట జిల్లా జౌళ్లాపురంలో ఘటన

మక్తల్‌: ‘మనం బీదవాళ్లం బిడ్డా.. ఇంట్లో మీ నాయన కూడా లేడు.. నాకు నిన్ను చదివించేందుకు చేతకాదు.. కూలీనాలీ చేసి చదివించాలె.. చదువు బంద్‌ చేయమ్మా.. నేను బతికి ఉండగానే నీకు పెండ్లి చేస్తా.. నా కళ్లతో నీ పెండ్లి చూస్తానమ్మ.. నా మాట వినమ్మా అంటివి.. నా మాట వినకుండా.. అమ్మా! నేను ప్రభుత్వ ఉద్యోగం వచ్చే వరకు చదువుతా! నువ్వే నా మాట వినమ్మా అంటివి.. ఇప్పుడు ఏమైంది బిడ్డా.. ఇట్ల పండుకున్నవ్‌.. లే అమ్మా.. నా గతి ఏం కావాలె’అంటూ కూతు రు అనిత మృతదేహం వద్ద తల్లి వెంకటమ్మ రోదించిన తీరు అక్కడున్న వారి మనసులను కలచివేసింది.

ఓ యువకుడి వేధింపులతో యువతి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మండలంలోని జౌళ్లాపురంలో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా.. జౌళ్లాపురం గ్రామానికి చెందిన హన్మంతు, వెంకటమ్మ దంపతుల కూతురు అనిత(23) హైదరాబాద్‌లోని సిటీ కాలేజీలో డిగ్రీ పూర్తిచేసింది. ఆ తర్వాత పీజీ కోసం దరఖాస్తు చేసుకుంది.

రోదిస్తున్న అనిత తల్లి వెంకటమ్మ

ఈ క్రమంలో గతేడాది తండ్రి హన్మంతు రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. దీంతో తల్లి వెంకటమ్మ ఒక్కగానొక్క కూతురుతో కలిసి జీవిస్తోంది. అయితే అనిత మహబూబ్‌నగర్‌ జిల్లా చిన్నచింతకుంట మండలంలోని అమ్మాపూర్‌ గ్రామానికి చెందిన అనిల్‌తో సన్నిహితంగా ఉంటూ తరుచుగా ఫోన్‌లో మాట్లాడేదని, ఈ క్రమంలో తాను ఇంకా చదువుకుంటానని, ఉద్యోగం చేయాలని చెప్పడం.. వారిద్దరి మధ్య భేదాభిప్రాయాలు రావడంతో ఆ యువకుడిని దూరం పెట్టినట్లు గ్రామస్తులద్వారా తెలిసింది. యువకుడు మాత్రం తరచూ ఫోన్‌ చేసి పెళ్లి చేసుకోవాలని వేధింపులకు గురిచేసేవాడని గ్రామస్తులు పేర్కొన్నారు.

యువకుడి వేధింపులు ఎక్కువ కావడంతో తీవ్ర మనస్తాపానికి గురైన అనిత శుక్రవారం గ్రామ సమీపంలోని ఓ షెడ్డులో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ఆ తర్వాత ఇంట్లో కూతురు కనిపించడం లేదని తల్లి వెంకటమ్మ చుట్టుపక్కల వారిని అడగగా గ్రామ సమీపంలోని షెడ్డులో ఉరివేసుకుని మృతిచెందినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు.

మక్తల్‌ సీఐ రాంలాల్, ఎస్‌ఐ రాజు గ్రామానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబీకులకు అప్పగించగా సాయంత్రం స్వగ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు. ఈ ఘటనపై తల్లి ఫిర్యాదు మేరకు అనిల్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

ఇదీ చదవండి: అండర్‌-19 క్రికెటర్‌ మృతి.. తల్లిదండ్రుల సంచలన ఆరోపణలు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement