నిల్వలు కనిష్టం తాగునీటికీ కష్టం! | Telangana Faces Water Shortage | Sakshi
Sakshi News home page

నిల్వలు కనిష్టం తాగునీటికీ కష్టం!

Nov 14 2026 5:43 AM | Updated on Nov 14 2026 5:46 AM

Telangana Faces Water Shortage

ప్రధాన ప్రాజెక్టుల్లో వేగంగా తగ్గిపోతున్న నీటి నిల్వలు

పది రోజుల్లోనే అడుగు మేర తగ్గిన నాగార్జునసాగర్‌     నీటిమట్టం  

కడెం ప్రాజెక్టులో 4.70 టీఎంసీలకు.. ఉన్నది 2.01 టీఎంసీలే

శ్రీశైలం, శ్రీరాంసాగర్, నిజాంసాగర్‌లో సగానికి పడిపోయిన నీటి నిల్వలు

వ్యవసాయానికి సాగునీరు బంద్‌.. తాగునీటి

అవసరాలకే సరఫరా రానున్న వేసవిలో నీటి కష్టాలు తప్పవా?

సాక్షి ప్రతినిధి, నల్లగొండ: రాష్ట్రంలోని ప్రధాన సాగునీటి ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు గణనీయంగా తగ్గిపోతున్నాయి. గోదావరి, కృష్ణానది పరీవాహక ప్రాంతాల్లోని రిజర్వాయర్లలో గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది నీటి నిల్వలు భారీగా తగ్గడం ఆందోళన కలిగిస్తోంది. దీంతో పంటలకు సాగునీరు కాదు.. వచ్చే వేసవిలో తాగునీటి భద్రతపై ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా శ్రీశైలం, నాగార్జునసాగర్, శ్రీరాంసాగర్, సింగూరు ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు గణనీయంగా పడిపోయాయి.

ఇప్పటికే పంటల సాగుకు నీటి సరఫరాను ప్రభుత్వం నిలిపివేసింది. కేవలం తాగునీటి అవసరాలకే ప్రస్తుతం ఉన్న నీటిని వినియోగించుకోవాలని చెబుతున్నా, వచ్చే వేసవి నాటికి కూడా ప్రస్తుతం ఉన్న నీరు సరిపోయే పరిస్థితి లేదు.  

11 ప్రాజెక్టుల పరిధిలో 55.2 శాతం నీటి లోటు 
రాష్ట్రంలోని 11 ప్రధాన ప్రాజెక్టులకు సంబంధించి నీటి పారుదల శాఖ లెక్కల ప్రకారమే గురువారం నాటికి 55.2 శాతం నీటిలోటు ఉంది. వాటిల్లో మొత్తం 729.50 టీఎంసీల నిల్వ సామర్థ్యం కాగా, ప్రస్తుతం 326.59 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. గతేడాది నవంబరు 12న ఆయా ప్రాజెక్టుల్లో 694.61 టీఎంసీల నీరు నిల్వ ఉంది. అంటే గతేడాది కంటే  ఈ ఏడాది 368.02 టీఎంసీల నీరు తక్కువగా ఉంది. గతేడాదితో పోలిస్తే ప్రస్తుత నిల్వలు 53 శాతం తక్కువగా ఉన్నాయి. మొత్తం సామర్థ్యంలో 44.8 శాతం నీరు మాత్రమే నిల్వ ఉంది. 


కృష్ణా బేసి¯న్‌లోనే భారీ లోటు 
కృష్ణానది పరీవాహక ప్రాంతంలోని శ్రీశైలం, నాగార్జునసాగర్, జూరాల ప్రాజెక్టుల్లో నీటి లోటు భారీగా ఉంది. శ్రీశైలం ప్రాజెక్టులో 49.75 టీఎంసీల నీరు మాత్రమే ఉంది.డెడ్‌ స్టోరేజీ కంటే దిగువకు నీటి నిల్వలు పడిపోయాయి. నాగార్జునసాగర్‌ ప్రాజెక్టులో ప్రస్తుతం 179.49 టీఎంసీలే ఉన్నాయి.

గతేడాది ఇదే సమయంలో 305.75 టీఎంసీలు ఉండగా, ఇప్పుడు 126.26 టీఎంసీల లోటు ఏర్పడింది. ప్రస్తుత నిల్వ సామర్థ్యంలో 57.5 శాతం మాత్రమే. ఈనెల 2వ తేదీన 536.70 అడుగుల నీరు ఉండగా, గురువారం నాటికి 535.70 అడుగులకు పడిపోయాయి. అంటే పది రోజుల్లో ఒక అడుగు మేర నీరు తగ్గిపోతోంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే 510 అడుగుల డెడ్‌ స్టోరేజీకి పడిపోయే పరిస్థితి ఎంతో దూరంలో లేదు.  

గోదావరి ప్రాజెక్టుల్లోనూ తగ్గిన నిల్వలు 
గోదావరి పరీవాహక ప్రాంతాల్లోనూ పరిస్థితి ఆశాజనకంగా లేదు. శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టులో ప్రస్తుతం 36.47 టీఎంసీలు, నిజాంసాగర్‌లో ప్రస్తుతం 9.17 టీఎంసీల నీటి నిల్వలు మాత్రమే ఉన్నాయి. సింగూరు ప్రాజెక్టు పరిస్థితి మరింత ఆందోళనకరంగానే ఉంది. కేవలం 2.36 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉంది. కడెం ప్రాజెక్టులోనూ ప్రస్తుతం 2.01 టీఎంసీలు మాత్రమే ఉన్నాయి. ఎల్లంపల్లి ప్రాజెక్టులో17.17 టీఎంసీలు, లోయర్‌ మానేరు డ్యాంలో 15.18 టీఎంసీల మేర నీటి న్విలు ఉన్నాయి. కుమురంభీం ప్రాజెక్టులో గతేడాది కంటే ఈసారి కొంత మెరుగైన నిల్వ కనిపిస్తోంది. 

హైదరాబాద్‌ తాగునీటిపైనా ప్రభావం 
సింగూరు ప్రాజెక్టు నిల్వలు తగ్గడం సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి ప్రాంతాలతోపాటు హైదరాబాద్‌ తాగునీటి సరఫరాపైనా ప్రభావం చూపే అవకాశం ఉంది. మంజీరా మంచినీటి వ్యవస్థ ద్వారా నగరానికి అందే నీటి సరఫరా తగ్గితే ప్రత్యామ్నాయ వనరులపై ఆధారపడాల్సి వస్తుంది. నాగార్జునసాగర్‌ డెడ్‌ స్టోరేజీకి చేరినా, సాగర్‌ వెనుక జలాల్లో మోటార్లు బిగించి ఏఎంఆర్‌పీ ద్వారా నీటిని తీసుకునే వెసలుబాటు ఉండటం కొంత మేరకు ఊరట. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement