కూతుళ్ల కోసం ఇద్దరి తండ్రుల కన్నీటిగాథ
కూతురి ఫీజు కోసం కష్టపడి సొమ్ము సంపాదించిన తండ్రి
అదే సొమ్మును తన కూతురు మందుల కోసం దొంగిలించిన మరో తండ్రి
భావోద్వేగానికి గురిచేసిన సన్నివేశం... ఓ తండ్రి రిమాండ్
బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఘటన
హైదరాబాద్ : తండ్రి ప్రేమ ఇద్దరిలోనూ ఒకటే.. కానీ పరిస్థితులు వారిని వేర్వేరు దారుల్లో నడిపించాయి. ఓ తండ్రి తన కుమార్తె పాఠశాల ఫీజు చెల్లించేందుకు నెలరోజులు కష్టపడి సంపాదించిన డబ్బును తీసుకెళ్తుండగా.. మరో తండ్రి అనారోగ్యంతో ఉన్న తన కుమార్తెకు మందులు కొనడానికి డబ్బుల్లేక దొంగతనానికి పాల్పడ్డాడు. చివరకు ఒకరి కష్టార్జితం మరికొకరి అవసరానికి బలైంది. హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన ఇద్దరు తండ్రుల ఆవేదనను కళ్లకు కట్టింది. వివరాల్లోకి వెళితే... ఫస్ట్ లాన్సర్‌కు చెందిన నూరుల్లాఖాన్ టైలర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.
కుమార్తె పాఠశాల ఫీజు చెల్లించేందుకు ఎంతో కష్టపడి రూ.5వేలు కూడబెట్టాడు. ఆ డబ్బును తీసుకుని బైక్‌పై ఇంటికి వెళ్తుండగా బంజారాహిల్స్ రోడ్డునెంబర్–1లోని జలగం వెంగళరావు పార్కు సమీపంలో సాదిక్ (39) అనే వ్యక్తి యాక్టివాపై వచ్చి అతడిని ఆపాడు. బైక్ నుంచి పెట్రోల్ లీకవుతుందని నూరుల్లాఖాన్‌ను నమ్మించి అతడి దృష్టిని మరల్చాడు. దీంతో బైక్ దిగి పెట్రోల్ పైపును పరిశీలిస్తున్న సమయంలో జేబులో ఉన్న రూ.5 వేల నగదును చాకచక్యంగా దొంగిలించి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. కొద్దిసేపటి తర్వాత డబ్బులు కనిపించకపోవడంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు సీసీటీవీ ఫుటేజీలు, వాహనం నంబర్ ఆధారంగా దర్యాప్తు చేపట్టి యాకుత్‌పురాకు చెందిన సాదిక్‌ను అరెస్టు చేశారు.
విచారణలో చెప్పుల దుకాణంలో పనిచేస్తున్న అతడు, తన కుమార్తె అనారోగ్యంతో బాధపడుతుండడంతో మందులు కొనడానికి డబ్బులు లేక ఈ చోరీకి పాల్పడినట్లు అంగీకరించాడు. నిందితుడిని పోలీస్‌స్టేషన్‌కు తీసుకువచ్చిన సమయంలో బాధితుడు నూరుల్లాఖాన్ అక్కడికి చేరుకుని తన ఆవేదనను వ్యక్తంచేశాడు. కుమార్తె ఫీజు కోసం ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బును కోల్పోవడంతో తన కుటుంబం ఇబ్బందుల్లో పడిందని కన్నీటిపర్యంతమయ్యాడు. మరోవైపు.. నిందితుడు కూడా తన కుమార్తె మందుల కోసమే ఈ పని చేసినట్లు చెప్పడంతో అక్కడి వాతావరణం భావోద్వేగంగా మారింది. నిందితుడు చోరీ చేసిన రూ.5 వేలలో సుమారు 1,100 కుమార్తె మందుల కోసం ఖర్చుచేసినట్లు పోలీసులు గుర్తించారు. మిగిలిన నగదును రికవరీ చేశారు. అనంతరం సాదిక్‌ను అరెస్టుచేసి రిమాండ్‌కు తరలించారు.


