అది గుడ్డి వ్యతిరేకత | CM Revanth Reddy Fires On BRS and BJP: Telangana | Sakshi
Sakshi News home page

అది గుడ్డి వ్యతిరేకత

Nov 14 2026 5:27 AM | Updated on Nov 14 2026 5:27 AM

CM Revanth Reddy Fires On BRS and BJP: Telangana

బీజేపీ, బీఆర్‌ఎస్‌పై సీఎం రేవంత్‌రెడ్డి ఫైర్‌ 

కిషన్‌రెడ్డి, బండి గుజరాత్‌ గులాంలని ధ్వజం

నరేంద్ర మోదీ గుజరాత్‌కు ప్రధానమంత్రిలా వ్యవహరిస్తున్నారు 

కేటీఆర్‌కు గడ్డం పెంచడానికే యాభై ఏళ్లు.. మెదడు పెరిగేదెప్పుడు? 

కిషన్‌రెడ్డి, కేటీఆర్, రాంచందర్‌రావు  ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు 

వీళ్లు ప్రభుత్వ వ్యతిరేకులు కాదు.. రాష్ట్రానికి, ప్రజలకు వ్యతిరేకులు 

గ్లోబల్‌ సమ్మిట్‌కు పీయూష్‌ రావొచ్చు.. భారత్‌ సమ్మిట్‌కు రాహుల్‌ రావొద్దా? 

ప్రధాని అవుతారేమోనని రాహుల్‌ని చూసి బీజేపీ భయపడుతోంది 

తెలంగాణ పెట్టుబడులకు అనుకూలమని ప్రపంచానికి చెప్పాలన్నదే మా ఉద్దేశం 

నేటి నుంచి గిగ్‌ వర్కర్ల పాలసీ అమలు 

ముద్దులే భారత విదేశాంగ విధానం కాదు: సల్మాన్‌ ఖుర్షీద్‌

సాక్షి, హైదరాబాద్‌:  రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని మంచి కార్యక్రమాలు చేపట్టినా, వాటిని గుడ్డిగా వ్యతిరేకించడమే బీజేపీ, బీఆర్‌ఎస్‌లు పనిగా పెట్టుకున్నాయని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌లు గుజరాత్‌ గులాంల మాదిరిగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. వారికి తెలంగాణతో సంబంధం లేదని అన్నారు. తెలంగాణకు చెందిన ఒక్క ప్రాజెక్టుకు కూడా వారు సహకరించడం లేదని, అన్నీ గుజరాత్‌కు తీసుకెళ్లేలా వారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఊడిగం చేస్తున్నారని విమర్శించారు.

మోదీ గుజరాత్‌కు ప్రధానమంత్రిలా వ్యవహరిస్తూ మిగిలిన రాష్ట్రాల పట్ల వివక్ష ప్రదర్శిస్తున్నారని అన్నారు. రాహుల్‌గాంధీ వస్తుంటే నల్ల జెండాలు చూపించాలన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు వ్యాఖ్యలను సీఎం ఖండించారు. నల్ల జెండాల ప్రదర్శన కాదు..వారి ముఖాలే నల్లబడతాయని వ్యాఖ్యానించారు. కేటీఆర్‌కు గడ్డం పెంచడానికి యాభై ఏళ్లు పట్టిందని, మెదడు పెరిగేదెప్పుడు? అంటూ ఎద్దేవా చేశారు.

రెండు పార్టీలు కాంగ్రెస్‌ ప్రభుత్వంపై వ్యతిరేకతతో కాకుండా, రాష్ట్ర ప్రయోజనాలు, ప్రజలకు వ్యతిరేకంగా ఉంటున్నాయని విమర్శించారు. శుక్రవారం ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీలోని బోధి    పెవిలియన్‌లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, వివేక్‌ వెంకటస్వామి, అజహరుద్దీన్, ఎంపీలు వేం  నరేందర్‌రెడ్డి, బలరాంనాయక్, అనిల్‌కుమార్‌ యాదవ్, కేంద్ర మాజీ మంత్రి సల్మాన్‌ ఖుర్షీద్, ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్‌తో కలిసి రేవంత్‌ మీడియాతో మాట్లాడారు.  

మీడియాతో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి. చిత్రంలో శ్రీధర్‌బాబు, అజహరుద్దీన్, సత్పాల్‌సింగ్, సల్మాన్‌ ఖుర్షీద్, భట్టి విక్రమార్క, బలరాం నాయక్, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, అనిల్‌కుమార్‌యాదవ్, వివేక్‌ వెంకటస్వామి  

బీజేపీని వ్యతిరేకిస్తే దేశ వ్యతిరేకులంటున్నారు.. 
    ‘బీజేపీ వైఖరిని, విధానాలను వ్యతిరేకిస్తే దేశ వ్యతిరేకులు అంటూ ముద్రవేయడం, ప్రచారం చేయడం బీజేపీకి అలవాటుగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం భారత్‌ సమ్మిట్‌ను నిర్వహించడం వెనుక.. రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడం, తెలంగాణ పెట్టుబడులకు అన్ని రకాలుగా అనువైన ప్రాంతం అని దాదాపు 70 దేశాల నుంచి వచ్చే 1,000 మంది అతిథులకు చూపించడం, ప్రపంచంలోని అలజడి, యుద్ధాలను చర్చల ద్వారా పరిష్కరించడం అనే తాపత్రయం ఉంది.

కానీ కిషన్‌రెడ్డి, కేటీఆర్‌లు తప్పుడు ఆరోపణలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించాలని చూస్తున్నారు. ఇప్పుడు వచ్చిన విదేశీ అతిథులు రేపు తెలంగాణకు బ్రాండ్‌ అంబాసిడర్‌లుగా వ్యవహరిస్తారు. మీ కడుపులో విషం, కళ్లల్లో కోపం ఉంటే ఉండనీయండి.. కానీ ప్రజలపై ప్రదర్శించకండి. మూసీ, ఆర్‌ఆర్‌ఆర్, మెట్రో రైలు ఇలా ప్రతి దానికీ కిషన్‌రెడ్డి అడ్డుపడుతున్నారు. 

మోదీ నియంతలా వ్యవహరిస్తున్నారు.. 
    ప్రధాని మోదీ నియంతలా వ్యవహరిస్తున్నారు. గుజరాత్‌ను గిఫ్ట్‌సిటీ పేరిట పన్నుల మినహాయింపునకు స్వర్గంలా చేశారు. అదే తెలంగాణతో సహా మరే ఇతర రాష్ట్రానికి ఎందుకు ప్రకటించలేదు? గుజరాత్‌లో పెట్టుబడులు పెడితే పన్నుల రాయితీ అంటూ మిగిలిన రాష్ట్రాలకు పరిశ్రమలు రాకుండా అడ్డుపడుతున్నారు. ఈ భారత్‌ సమ్మిట్‌కు హాజరుకావడానికి కేంద్రం తొలుత కొందరికి వీసాలు మంజూరు చేసి ఆ తర్వాత నిలిపివేసింది.

నార్వేలో ఓ పాత్రికేయురాలు మోదీని ప్రశ్నించిందని ఆమెకు మంజూరు చేసిన వీసాను తర్వాత రద్దు చేశారు. ఓ పాత్రికేయురాలు ప్రశ్నించగానే మోదీ ఎన్నికల్లో ఓడిపోతారా? మోదీ చైనా, పాకిస్తాన్‌లాంటి దేశాల నేతలతో చర్చలు జరపొచ్చు.. బిర్యానీలు తినొచ్చు.. కానీ రాహుల్‌గాంధీ సమావేశాల్లో పాల్గొనకూడదా? అప్పట్లో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న అటల్‌ బిహారీ వాజ్‌పేయిని భారత్‌ తరఫున విదేశాలకు పంపించి రాజీవ్‌గాంధీ మంచి మార్గాన్ని అనుసరిస్తే, ప్రస్తుతం కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం మాత్రం రాహుల్‌గాం«దీని చులకన చేస్తోంది..’ అని సీఎం ధ్వజమెత్తారు.  

భారత్‌ జోడోతోనే రాహుల్‌ ప్రజల ఆత్మగా మారారు.. 
    ‘ప్రతిపక్ష నేతగా భారత్‌ సమ్మిట్‌కు రాహుల్‌గాంధీ హాజరవుతుంటే బీజేపీకి ఎందుకంత కడుపుమంట? గ్లోబల్‌ సమ్మిట్‌ కర్టెన్‌ రైజర్‌ కార్యక్రమానికి కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ వచ్చినప్పుడు లేని అభ్యంతరం రాహుల్‌గాంధీ వస్తుంటే ఎందుకు? కర్టెన్‌ రైజర్‌ కార్యక్రమానికి కిషన్‌రెడ్డిని ఆహ్వానించినా రాలేదు. ఆయన గుజరాత్‌ గులాం అనే ఈ సమ్మిట్‌కు పిలవలేదు. ఒకవేళ ఆయన నన్ను పిలవలేదని అంటే.. రేపే డిప్యూటీ సీఎంను పంపించి ఆహ్వానిస్తాం. 

కిషన్‌రెడ్డీ.. చిల్లర పనులు ఆపేసి వచ్చి రాహుల్‌గాం«దీని కలువు. ఆయన కొంత జ్ఞానబోధ చేస్తారు. రాహుల్‌గాంధీని చూసి బీజేపీ భయపడుతోంది. ఆయనను ఇప్పుడు లాంఛింగ్‌ చేయాల్సిన అవసరం ఏముంది? 2004 నుంచే ఆయన రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పుడు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు. ఆ తర్వాత ప్రమోషన్‌ ప్రధానమంత్రి పోస్టు.. వచ్చే ఎన్నికల్లో ఆయన ప్రధాని అవుతారని భయపడుతున్నారు.

భారత్‌ జోడో యాత్రతోనే రాహుల్‌ ప్రజల ఆత్మగా మారారు. భారత్‌ సమ్మిట్‌లో ఎల్‌నినో ప్రభావం, వాతావరణ మార్పులు, ఆర్థిక, పారిశ్రామిక, విదేశాంగ విధానం, రాష్ట్రంలో పెట్టుబడులకు అనుకూలతలు తదితర అనేక అంశాలపై కూలంకషంగా చర్చలు జరుగుతాయి. తీర్మానాలు చేయడం జరుగుతుంది..’ అని ముఖ్యమంత్రి తెలిపారు. 

త్వరలో ‘టెలిఫోన్‌ ట్యాపింగ్‌’లో కీలక పరిణామాలు 
    ‘టెలిఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో విచారణ పూర్తయింది. త్వరలోనే ఆసక్తికరమైన కొన్ని శక్తుల ప్రమేయం బయటపడనుంది..’ అని రేవంత్‌ చెప్పారు. భారత్‌ సమ్మిట్‌కు వెయ్యి కోట్ల ప్రజాధనం ఖర్చు చేసి కాంగ్రెస్‌కు ప్రచారం చేసుకుంటున్నారని కేటీఆర్‌ అన్నట్లు ఓ విలేకరి  ప్రస్తావించగా.. ఆయనవి మతిలేని మాటలని, ప్రభుత్వం ఖర్చు చేసే ప్రతిపైసాకు లెక్క ఉంటుందని అన్నారు.

ఇదేమైనా కాళేశ్వరం ప్రాజెక్టా.. అవినీతి జరగడానికి? అని ప్రశ్నించారు. రాష్ట్రంలోని లక్షలాది మంది గిగ్‌ వర్కర్లకు ప్రయోజనం చేకూర్చే పథకం శనివారం నుంచి ప్రారంభం అవుతుందని సీఎం ప్రకటించారు. రాహుల్‌గాంధీ దీనిని ప్రారంభిస్తారని, అంతకుముందు శిల్పకళా వేదిక నుంచి హైటెక్స్‌ వరకు ర్యాలీలో పాల్గొంటారని తెలిపారు. భారత్‌ సమ్మిట్‌ ముగింపు సభలో కీలక ఉపన్యాసం కూడా చేస్తారని వెల్లడించారు. 

మోదీకి సల్మాన్‌ ఖుర్షీద్‌ చురకలు 
    విదేశాలకు వెళ్లడం, ముద్దులు పెట్టడమే విదేశాంగ విధానం కాదని ప్రధాని మోదీని ఉద్దేశించి కేంద్ర విదేశాంగ శాఖ మాజీ మంత్రి సల్మాన్‌ ఖుర్షీద్‌ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వాలు ఉన్నప్పుడు అలీన విధానాన్ని అనుసరించామని, ఇప్పుడు ఈ ప్రభుత్వానికి విదేశాంగ విధానం అనేదే లేకుండా పోయిందని, గాలివాటంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. దావోస్‌ పెట్టుబడులకు, ఆర్థిక విధానపరమైన చర్చలకు కేంద్రంగా మారినట్లే.. హైదరాబాద్‌ కూడా రాజకీయ, ఆర్థిక, ప్రగతిశీల భావాల చర్చా వేదికగా మారుతుందని అన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement