హైదరాబాద్: తెలంగాణ అనుకూలతలు , తెలంగాణ గొప్పతనాన్ని ప్రపంచానికి తెలియజెప్పడానికి భారత్ సమ్మిట్ నిర్వహిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. పెట్టుబడుల కోసం స్పష్టమైన విధివిధానాలతొ ముందుకు వెళ్తున్నామని చెప్పారు.
ఇవాళ హైదబాద్‌లో రేవంత్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ హైదరాబాద్ వస్తానంటే ఎందుకు అడ్డుకుంటామంటున్నారని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ‘‘కిషన్ రెడ్డి, కేటీఆర్ విజ్ఞత ప్రదర్శించండి. గిగ్ వర్కర్స్ కోసం మేము తెచ్చిన పాలసీ దేశంలో బెస్ట్ గా ఉంటుంది. వచ్చే ఎన్నికల్లో రాహుల్ గాంధీ తమను ఓడిస్తారనే భయం బీజేపీకి పట్టుకుంది. లోక్ సభ ప్రతిపక్ష నేత హైదరాబాద్ పర్యటన ను ప్రతిపక్షాలు స్వాగతం పలకాల్సిన అవసరం ఉంది. ఢిల్లీలో గ్లోబల్ సమ్మిట్ కర్టన్ రైజ్ ప్రోగ్రాంకు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వచ్చారు. ఢిల్లీ నేతలు స్వాగతిస్తే.. తెలంగాణ కేంద్ర మంత్రి ,బీజేపీ వ్యతిరేకిస్తోంది’’ అని అన్నారు.
ఒకే విధివిధానాలతో బీజేపీ-బీఆర్ఎస్
బీజేపీ-బీఆర్ఎస్ రెండు ఒకే విధివిధానాలతో ముందుకు వెళ్తున్నాయని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ‘‘విదేశీ శక్తులు పాల్గొంటున్నాయని బీజేపీ ఆరోపిస్తే.. డబ్బు వృథా చేస్తున్నారని బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. కిషన్ రెడ్డి, రాంచందర్ రావు ,కేటీఆర్ ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారో అర్థం కావడం లేదు. వాతావరణం, పెట్టుబడులు,హైదరాబాద్ అవశ్యకతను వివరించడం ద్వారా పెట్టుబడులు వస్తాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా గుడ్డిగా వ్యతిరేకించడం బీజేపీ, బీఆర్ఎస్ కు అలవాటు అయింది.
అనవసరపు ఆరోపణలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. ఇప్పటికైనా బీజేపీ, బీఆర్‌ఎస్ నేతలు విజ్ఞతతో మెలగాలి. 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల వ్యవస్థ మా లక్ష్యం. విదేశీ జర్నలిస్టులను కూడా భారత్ సమ్మిట్‌కు ఆహ్వానించాం. రాహుల్ గాంధీ హైదరాబాద్‌కు వస్తున్నారు. భారత్ సమ‍్మిట్ గిగ్ వర్కర్స్ సమావేశంలో రాహుల్ గాంధీ మాట్లాడతారు. ప్రపంచంలో ఎక్కడ చూసినా అలజడే ఉంది. రాజ్యాంగాన‍్నే 106 సార్లు సవరించుకున్నాం. మార్పు అవసరం. బీజేపీ వైఖరి నియంతల వైఖరిలా ఉంది. పరిశ్రమలను ఆకర్షించడం ద్వారా ఉద్యోగ, ఉపాధి అవకాశాలను అందించడమే మా లక్ష్యం. తెలంగాణ రాష్ట్రం పెట్టుబడులకు ఎంతో అనుకూలం’’ అని తెలిపారు.
ఇదీ చదవండి: హైదరాబాద్‌లో మరో అండాల రాకెట్ గుట్టురట్టు


