వికారాబాద్ జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఎంతో భవిష్యత్తు ఉన్న ఓ యువ మహిళా క్రికెటర్ ఆకతాయిల వేధింపులకు బలైపోయింది. ఇటీవలే బీసీసీఐ అండర్-19 జట్టుకు ఎంపికైన 17 ఏళ్ల నందిని ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా కలకలం రేపింది.
ఏమి జరిగిందంటే?
యాలాల్ మండలం సంగయ్య పల్లికి చెందిన నందిని(17) వికారాబాద్ టౌన్ లో అమ్మమ్మ వాళ్ల ఇంటి దగ్గర ఉంటూ క్రికెట్‌లో మెళకువలు నేర్చుకుంటుంది. మైదానంలో అద్భుత ప్రతిభ కనబరుస్తూ బీసీసీఐ అండర్-19 జట్టులో చోటు దక్కించుకుంది. అయితే తన కలను నిజం చేసుకున్న ఆనందం ఎంతో కాలం నిలవకముందే.. శుక్రవారం (నవంబర్ 13) ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ప్రాణాలు తీసుకుంది.
వేధింపులే కారణమంటున్న బాధిత కుటుంబం
స్థానికంగా ఉండే ఇద్దరు విద్యార్థుల వేధింపులే తమ కూతురు మరణానికి కారణమని నందిని తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు. ప్రేమ పేరుతో ఓ యువకుడు గత కొద్దిరోజులుగా నందినిని మానసిక వేదనకు గురిచేస్తున్నాడని, అతనికి కృష్ణ సహకరిస్తూ వేధింపులకు పాల్పడ్డాడని వారు ఆరోపించారు. వారి వేధింపులు తట్టుకోలేకనే నందిని ఈ తీవ్ర నిర్ణయం తీసుకుందని ఆవేదన వ్యక్తం చేశారు.


