రావల్పిండి వేదికగా శ్రీలంక-పాకిస్తాన్ మధ్య జరిగిన తొలి టెస్టు మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఆఖరి రోజు శ్రీలంక బౌలర్లు 8 వికెట్లు పడగొట్టి విజయం కోసం తీవ్రంగా శ్రమించినప్పటికి.. పాక్ మిడిల్ ఆర్డర్ బ్యాటర్ సౌద్ షకీల్ (97) అద్భుత పోరాటంతో మ్యాచ్ చేజారకుండా కాపాడు.
టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ తమ తొలి ఇన్నింగ్స్‌ను 434/9 వద్ద డిక్లేర్ చేసింది. పాక్ బ్యాటర్లలో సౌద్ షకీల్ (93), తయ్యబ్ ఆరిఫ్ (57), అరఫాత్ మిన్హాస్ (52), మొహమ్మద్ తహా ఖాన్ (51), బాబర్ ఆజం (50) అర్ధ సెంచరీలతో రాణించారు. శ్రీలంక బౌలర్లలో అసిత ఫెర్నాండో, దిల్షాన్ మధుశంక చెరో 3 వికెట్లు తీశారు.
అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన శ్రీలంక 446 పరుగుల భారీ స్కోర్ చేసి ఆలౌటైంది. ధనంజయ డి సిల్వా (167), కుశాల్ మెండిస్ (119) సెంచరీలతో చెలరేగారు. తొలి ఇన్నింగ్స్‌లో 12 పరుగుల స్వల్ప ఆధిక్యం మాత్రమే లభించింది. అయితే మొదటి ఇన్నింగ్స్‌లో పాక్ అరంగేట్ర పేసర్ సాకిబ్ ఖాన్ అదరగొట్టాడు.
సాకిబ్ ఖాన్ 130 పరుగులిచ్చి 7 వికెట్లు పడగొట్టి లంక భారీ ఆధిక్యం సాధించకుండా అడ్డుకున్నాడు. ఈ అద్భుత ప్రదర్శనకు గాను సాకిబ్ ఖాన్‌కు 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు లభించింది. 12 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన పాకిస్తాన్‌కు శ్రీలంక బౌలర్లు షాకిచ్చారు. టాపార్డర్ బ్యాటర్ అజాన్ అవైస్(22), తయ్యాబ్ అరిఫ్(11), మహ్మద్ తహా(24) ఆరంభంలోనే పెవిలియన్‌కు పంపారు.
బాబర్ ఆజం (34), ఘాజీ ఘోరీ (35) కొద్దిసేపు క్రీజులో నిలబడినప్పటికి.. ఒక దశలో పాక్ 261 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ సమయంలో సౌద్ షకీల్ (210 బంతుల్లో 97; 7 ఫోర్లు) గోడలా నిలబడి లంక బౌలర్ల సహనాన్ని పరీక్షించాడు. తొలి ఇన్నింగ్స్‌లో 93 పరుగుల వద్ద ఔటైన షకీల్.. రెండో ఇన్నింగ్స్‌లోనూ కేవలం 3 పరుగుల తేడాతో సెంచరీ చేజార్చుకున్నాడు.
లహిరు కుమార బౌలింగ్‌లో షకీల్ బౌల్డ్ కావడంతో పాక్ 284/8 వద్ద ఉండగా ఇరు జట్ల కెప్టెన్లు డ్రాకు అంగీకరించారు. లంక బౌలర్లలో మిలన్ రత్నాయకే 3 వికెట్లు, అసిత ఫెర్నాండో, లహిరు కుమార చెరో 2 వికెట్లు తీశారు. ఇరు జట్ల మధ్య రెండో టెస్టు నవంబర్ 17 నుంచి రావల్పిండి వేదికగా ప్రారంభం కానుంది.


