Photo Credit: Twitter
రావల్పిండి వేదికగా పాకిస్తాన్‌తో జరుగుతున్న తొలి టెస్టులో శ్రీలంక ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి శ్రీలంక 102 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 404 పరుగుల భారీ స్కోరు చేసింది. ధనంజయ డిసిల్వా (167 నాటౌట్, 20 ఫోర్లు), కెప్టెన్ కుశాల్ మెండిస్ (117 నాటౌట్; 10 ఫోర్లు, 4 సిక్సర్లు) శతకాలతో చెలరేగారు. ఈ ఇద్దరు కలిసి ఐదో వికెట్‌కు అజేయంగా 360 బంతుల్లో 249 పరుగులు జోడించారు. కమిందు మెండిస్ (58) అర్థసెంచరీ చేశాడు. పాక్ బౌలర్లలో మొహమ్మద్ అబ్బాస్, సకిబ్‌ఖాన్‌లు చెరో 2 వికెట్లు పడగొట్టారు.
ఈ నేపథ్యంలో కెప్టెన్‌గా కుశాల్ మెండిస్ ఒక అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. లంక తరఫున టెస్టుల్లో కెప్టెన్‌గా ప్రాతినిధ్యం వహిస్తున్న తొలి మ్యాచ్‌లోనే సెంచరీ సాధించిన బ్యాటర్‌గా రికార్డులకెక్కాడు. అంతేకాదు, కెప్టెన్‌గా తన తొలి టెస్టులోనే శతకం సాధించిన 37వ క్రికెటర్‌గా కుశాల్ మెండిస్ నిలిచాడు. దీంతో పాటు ఈ మ్యాచ్‌లో మరిన్ని రికార్డులు కూడా బద్దలయ్యాయి.
👉కెప్టెన్‌గా తన తొలి టెస్టులోనే పాకిస్తాన్‌పై సెంచరీ సాధించిన రెండో ఆటగాడిగా కుశాల్ మెండిస్ నిలిచాడు. 2006లో లార్డ్స్ వేదికగా పాక్‌తో జరిగిన టెస్టులో ఆండ్రూ స్ట్రాస్ (128 పరుగులు) సెంచరీ సాధించిన తొలి ఆటగాడిగా ఉన్నాడు.
👉మ్యాచ్‌లో ధనంజయ డిసిల్వా, కుశాల్ మెండిస్ ఐదో వికెట్‌కు నెలకొల్పిన 249 పరుగుల అజేయ భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ క్రమంలో టెస్టుల్లో పాకిస్తాన్‌పై శ్రీలంకకు ఐదో వికెట్‌కు అత్యధిక భాగస్వామ్యంగా నిలిచింది. 2009లో లాహోర్ వేదికగా శ్రీలంక బ్యాటర్లు ఐదో వికెట్‌కు జోడించిన 207 పరుగుల మునుపటి రికార్డును కూడా ఈ జోడీ అధిగమించింది.
👉1984లో ఫైసలాబాద్‌లో భారత ఆటగాళ్లు సందీప్ పాటిల్, రవిశాస్త్రి 200 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పగా, 2006లో ముల్తాన్‌లో వెస్టిండీస్ దిగ్గజాలు డ్వేన్ బ్రావో, బ్రియాన్ లారా కూడా ఐదో వికెట్‌కు 200 పరుగులు జోడించారు.


