Photo Credit: Twitter
అఫ్గానిస్తాన్ కెప్టెన్ రహ్మత్ షా ఆ దేశ క్రికెట్ చరిత్రలోనే సరికొత్త చరిత్రను లిఖించాడు. ఐసీసీ పురుషుల టెస్టు ర్యాంకింగ్స్‌లో తొలిసారి టాప్-10లో చోటు దక్కించుకున్న రహ్మత్ షా అఫ్గానిస్తాన్ తరఫున ఈ ఫీట్ సాధించిన తొలి బ్యాటర్‌గా రికార్డులకెక్కాడు. బుధవారం ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్ వివరాలను అప్‌డేట్ చేసింది.
షార్జా వేదికగా జింబాబ్వేతో జరిగిన తొలి టెస్టులో రహ్మత్ షా (173 పరుగులు) భారీ శతకంతో చెలరేగాడు. ఈ నేపథ్యంలో తాజాగా విడుదలైన టెస్టు బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో 735 పాయింట్లతో ఏడో స్థానంలో నిలిచి కెరీర్ బెస్ట్ ర్యాంక్ అందుకున్నాడు. ఈ నేపథ్యంలో భారత కెప్టెన్ శుబ్‌మన్ గిల్, మార్కరమ్, కమిందు మెండిస్‌లను రహ్మత్ షా అధిగమించడం విశేషం.
ఇదే మ్యాచ్‌లో సెంచరీతో మెరిసిన మరో ఆఫ్గన్ బ్యాటర్ సెదికుల్లా అటల్ కూడా ర్యాంకింగ్స్‌లో గణనీయ పురోగతిని సాధించాడు. ఏకంగా 14 స్థానాలు ఎగబాకిన సెదికుల్లా అటల్ 414 పాయింట్లతో 81వ స్థానంలో నిలిచాడు. ఇక డెబ్యూ సెంచరీ సాధించిన రహమనుల్లా 83వ స్థానంలో నిలిచాడు.
ఇక జింబాబ్వే బ్యాటర్లు కూడా ర్యాంకింగ్స్‌లో అదరగొట్టారు. 41 ఏళ్ల వయసులో డబుల్ సెంచరీ బాదిన క్రెయిగ్ ఎర్విన్ తొమ్మిది స్థానాలు ఎగబాకి 48వ స్థానంలో నిలవగా, సెంచరీ సాధించిన కెప్టెన్ బ్రియాన్ బెన్నెట్ 10 స్థానాలు ఎగబాకి 75వ స్థానానికి చేరుకున్నాడు. ఇక మరో సీనియర్ బ్రెండన్ టేలర్ 103వ స్థానానికి ఎగబాకాడు. ఇరుజట్లు కలిపి దాదాపు వెయ్యికి పైగా పరుగులు నమోదు చేసిన ఈ టెస్టు మ్యాచ్ డ్రాగా ముగిసింది.
ఇక బంగ్లాదేశ్, వెస్టిండీస్ మధ్య జరిగిన రెండో టెస్టు కూడా డ్రాగా ముగిసినప్పటికీ, ఈ మ్యాచ్‌లోనూ బ్యాటర్లు సెంచరీలు బాదారు. ఈ క్రమంలో ఇరుజట్ల ఆటగాళ్లు ర్యాంకింగ్స్‌లో ఎగబాకారు. డబుల్ సెంచరీతో మెరిసిన బంగ్లాదేశ్ బ్యాటర్ తౌహిద్ హృదోయ్ ఏకంగా 175వ స్థానం నుంచి 60వ స్థానానికి రావడం విశేషం. ఇక విండీస్ బ్యాటర్ కవెమ్ హడ్జ్ 52వ ర్యాంకు సాధించిన కెరీర్ బెస్ట్ అందుకున్నాడు.
ఇదీ చదవండి: 'నోరు మూయ్.. నువ్వొక పాకిస్తానీ'


