సొంతగడ్డపై ఇంగ్లండ్‌తో మూడు వన్డేల సిరీస్‌లో ఆస్ట్రేలియా శుభారంభం చేసింది. శుక్రవారం పెర్త్ స్టేడియం వేదికగా జరిగిన తొలి వన్డేలో 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ జట్టు కేవలం 33.4 ఓవర్లలో కేవలం 131 పరుగులకే కుప్పకూలింది.
అరంగేట్ర పేసర్ మహ్లీ బార్డ్‌మన్ అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శనతో పర్యాటక జట్టును దెబ్బ తీశాడు. బార్డ్‌మన్ 7.4 ఓవర్లలో కేవలం 24 పరుగులిచ్చి 6 వికెట్లు పడగొట్టాడు. అతడికి తోడుగా స్పెన్సర్ జాన్సన్ 3 వికెట్లు సాధించాడు. ఒక దశలో 65 పరుగులకే 8 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడ్డ ఇంగ్లండ్‌ను అట్కిన్సన్(29), జాక్స్(25) ఆదుకోవడంతో స్కోరు 130 మార్కును దాటగలిగింది.
జో రూట్ (17), బెన్ డకెట్ (9), కెప్టెన్ హ్యారీ బ్రూక్ (1), సామ్ కరన్ (0) వంటి స్టార్ బ్యాటర్లు పూర్తిగా నిరాశపరిచారు. అనంతరం 132 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియాకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ ట్రావిస్ హెడ్ (0) ఎదుర్కొన్న తొలి బంతికే గస్ అట్కిన్సన్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అయితే మరో ఓపెనర్, కెప్టెన్ మిచెల్ మార్ష్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు.
కేవలం 30 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 50 పరుగులు చేసి విజయాన్ని ఖాయం చేశాడు. ఆ తర్వాత కూపర్ కొన్నోలీ (27), మాట్ రెన్‌షా (26 నాటౌట్), జోష్ ఇంగ్లిస్ (23 నాటౌట్) బాధ్యతాయుతంగా ఆడటంతో ఆసీస్ కేవలం 23.3 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించింది. ఇరు జట్ల మధ్య రెండో వన్డే అడిలైడ్ ఓవల్ వేదికగా ఆదివారం జరగనుంది.


