అతడు వరల్డ్‌ బెస్ట్‌.. మా విజయానికి కారణం అదే: కివీస్‌ కెప్టెన్‌ | He is World Best 3 pretty big scalps in 1st over: Santner Lauds Henry Vs IND | Sakshi
Sakshi News home page

అతడు వరల్డ్‌ బెస్ట్‌.. మా విజయానికి కారణం అదే: కివీస్‌ కెప్టెన్‌

Nov 13 2026 3:49 PM | Updated on Nov 13 2026 3:59 PM

He is World Best 3 pretty big scalps in 1st over: Santner Lauds Henry Vs IND

PC: Blackcaps X

న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌లో భారత్‌ విజయాలకు బ్రేక్‌ పడింది. శుబ్‌మన్‌ గిల్‌ కెప్టెన్సీలో తొలి రెండు వన్డేల్లో గెలిచి సత్తా చాటింది టీమిండియా. ఇరుజట్ల మధ్య మూడో వన్డే వర్షం వల్ల రద్దు కాగా.. శుక్రవారం నాటి నాలుగో వన్డేలో భారత జట్టు చతికిలపడింది.

మౌంట్‌ మౌంగనీయ్‌ వేదికగా శ్రేయస్‌ అయ్యర్‌ సేన కివీస్‌ చేతిలో ఏకంగా 244 పరుగుల భారీ తేడాతో ఘోర పరాజయం చవిచూసింది. న్యూజిలాండ్‌ పేసర్‌ మ్యాట్‌ హెన్రీ ఆరు వికెట్లతో చెలరేగి భారత బ్యాటింగ్‌ ఆర్డర్‌ను కుదేలు చేశాడు. కివీస్‌ విధించిన 334 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు టీమిండియా బరిలోకి దిగగా.. తొలి ఓవర్లోనే హెన్రీ మూడు వికెట్లు పడగొట్టాడు.

రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లి, శ్రేయస్‌ అయ్యర్‌లను డకౌట్‌ చేసిన హెన్రీ.. టీమిండియా టాప్‌ స్కోరర్‌గా నిలిచిన ఇషాన్‌ కిషన్‌ (27)ను బౌల్డ్‌ చేశాడు. ఆఖర్లో కుల్దీప్‌ యాదవ్‌ (1), గుర్నూర్‌ బ్రార్‌ (2) వికెట్లు కూడా తీశాడు. ఈ క్రమంలో టీమిండియా 89 పరుగులకే కుప్పకూలింది.

ఈ నేపథ్యంలో కివీస్‌ కెప్టెన్‌ మిచెల్‌ సాంట్నర్‌ మ్యాట్‌ హెన్రీపై ప్రశంసల వర్షం కురిపించాడు. విజయానంతరం మాట్లాడుతూ.. ‘‘ఈ మ్యాచ్‌లో ఆడాలని హెన్రీ కోరుకున్నాడు. అందుకు తగినట్లే తుదిజట్టులో చోటు దక్కింది. వికెట్‌ పాతబడే కొద్దీ బౌలర్లకు కాస్త అనుకూలంగా మారింది. కొత్త బంతితో హెన్రీ అద్భుతం చేశాడు.

ప్రపంచంలోనే అతడు అత్యుత్తమ ఆటగాడు. తొలి ఓవర్లోనే మూడు వికెట్లు తీసి మా విజయానికి పునాది వేశాడు. మా గెలుపునకు ప్రధాన కారణం కూడా అదే. మ్యాట్‌ ఫిషర్‌ కూడా మెరుగ్గా బౌలింగ్‌ చేశాడు. ఆరంభ మ్యాచ్‌లలో తడబడ్డా ఇప్పుడు రాణించాడు.

నిజానికి ఈ మ్యాచ్‌లో నాకు బౌలింగ్‌ చేయాల్సిన అవసరమే రాలేదు. ఆఖరిదైన ఐదో వన్డేలో కూడా పిచ్‌ సహకరిస్తే ఆశించిన ఫలితాన్ని రాబట్టవచ్చు. ఇక విల్‌ యంగ్‌ అద్భుత శతకం (108 బంతుల్లో 125)తో పాటు మిగిలిన వాళ్లు కూడా తలా కొన్ని పరుగులు జోడించడంతో మేము భారీ స్కోరు చేయగలిగాము. జట్టు ప్రదర్శన పట్ల చాలా చాలా సంతోషంగా ఉంది’’ అని సాంట్నర్‌ హర్షం వ్యక్తం చేశాడు.

ఇవీ చదవండి: IND vs NZ: ‘నీ చేతులతో నువ్వే అంతా నాశనం చేసుకున్నావు’
IND vs NZ: భారీ స్కోరు.. చరిత్ర సృష్టించిన కివీస్‌ జట్టు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement