PC: Blackcaps X
టీమిండియాతో నాలుగో వన్డేలో న్యూజిలాండ్ భారీ స్కోరు సాధించింది. ఓపెనర్లలో విల్ యంగ్ శతక్కొట్టగా.. టిమ్ సీఫర్ట్ అద్బుత అర్ధ శతకంతో ఆకట్టుకున్నాడు. వీరికి తోడు ఫిన్ అలెన్ రాణించాడు.
ఫలితంగా న్యూజిలాండ్ నిర్ణీత యాభై ఓవర్లలో 333 పరుగులు చేసి ఆలౌట్ అయింది. కాగా ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో ఇప్పటికే రెండు మ్యాచ్‌లు గెలిచి భారత్ 2-0తో ఆధిక్యంలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే, కివీస్‌తో జరగాల్సిన మూడో వన్డే వర్షం వల్ల రద్దైపోయింది.
108 బంతుల్లోనే
ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య శుక్రవారం నాటి నాలుగో వన్డేలో టాస్ గెలిచిన భారత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. కివీస్ ఓపెనర్ విల్ యంగ్ కేవలం 108 బంతుల్లోనే 14 ఫోర్లు, నాలుగు సిక్స్‌లు బాది ఏకంగా 125 పరుగులు సాధించాడు. టిమ్ సీఫర్ట్ 48 బంతుల్లోనే 58 పరుగులు చేశాడు.
Will Young with his 5th ODI Century and first against India 🖤🤍 Watch all the action LIVE in NZ on Sky Sport. https://t.co/0PzrqDsOmZ
— BLACKCAPS (@BLACKCAPS) November 13, 2026
మిగిలిన వారిలో ఫిన్ అలెన్ 41 పరుగులతో రాణించగా.. కెప్టెన్ మిచెల్ సాంట్నర్ 24, క్రిస్టియన్ క్లార్క్ 22 పరుగులతో ఫర్వాలేదనిపించారు. భారత బౌలర్లలో పేసర్లు ఆకిబ్ నబీ, గుర్నూర్ బ్రార్ చెరో రెండు వికెట్లు తీయగా.. అర్ష్‌దీప్ సింగ్ ఒక వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు. స్పిన్ విభాగంలో అక్షర్ పటేల్ రెండు, నమన్ ధీర్ ఒక వికెట్ దక్కించుకున్నాడు.
భారీ స్కోరుతో కివీస్ సరికొత్త చరిత్ర
ఇక భారత్‌తో నాలుగో వన్డేలో 333 పరుగులు చేసిన న్యూజిలాండ్ జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. సొంతగడ్డ మీద టీమిండియాపై తొలి ఇన్నింగ్స్‌లో అత్యధిక స్కోరు సాధించిన కివీస్ జట్టుగా సాంట్నర్ బృందం నిలిచింది.
సొంతగడ్డ మీద టీమిండియాతో వన్డేల్లో తొలి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ అత్యధిక స్కోర్లు
👉333 ఆలౌట్- మౌంట్ మౌంగనూయ్, 2026
👉314 ఆలౌట్- ఆక్లాండ్, 2014 (నాడు మ్యాచ్ టై)
ఓవరాల్‌గా టీమిండియాతో వన్డేల్లో తొలి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ అత్యధిక స్కోర్లు
👉349/9 - రాజ్‌కోట్, 1999
👉348/8 - నాగ్‌పూర్, 1995
👉337/8 - ఇండోర్, 2026
👉333 ఆలౌట్- మౌంట్ మౌంగనూయ్, 2026
👉315/7 - బెంగళూరు, 2010 (ఓటమి)
👉314 ఆలౌట్- ఆక్లాండ్, 2014 (నాడు మ్యాచ్ టై)
ఇదిలా ఉంటే.. వన్డేల్లో న్యూజిలాండ్‌పై టీమిండియా అత్యధికంగా 2010లో బెంగళూరు వేదికగా 316 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. అదే ఏడాది వడోదర వేదికగా కివీస్ విధించిన 301 పరుగుల టార్గెట్‌ను కూడా పూర్తి చేసింది. అయితే, న్యూజిలాండ్ గడ్డ మీద మాత్రం భారత జట్టు ఇంతవరకు 250కి పైగా పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేదు.
ఇదీ చదవండి: అద్భుత క్యాచ్‌తో డేంజరస్ బ్యాటర్‌కు షాకిచ్చిన రోహిత్


