Photo Credit: Twitter
న్యూజిలాండ్, భారత్ మధ్య జరుగుతున్న వన్డే సిరీస్‌లో తొలిసారి బ్యాటర్లు పరుగుల పండుగ చేసుకున్నారు. వర్షం అంతరాయంతో తొలి రెండు మ్యాచ్‌లు పరుగులు రాక సప్పగా సాగాయి. అయితే మౌంట్ మాంగనూయ్ వేదికగా జరుగుతున్న నాలుగో వన్డేలో మాత్రం బ్యాటర్లు పరుగులు పిండుకున్నారు.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 333 పరుగులకు ఆలౌటైంది. తద్వారా భారత్ ఎదుట 334 పరుగుల చాలెంజింగ్ టార్గెట్‌ను నిర్దేశించింది. రెండుసార్లు ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న ఓపెనర్ విల్ యంగ్ (125) శతకంతో మెరవగా, మరో ఓపెనర్ టిమ్ సీఫెర్ట్ (58) అర్థసెంచరీతో అలరించాడు.
ఈ ఇద్దరు తొలి వికెట్‌కు 85 పరుగులు జోడించి శుభారంభం అందించారు. ఆ తర్వాత నిక్ కెల్లీ (4), డీన్ ఫాక్స్‌క్రాఫ్ట్ (8) విఫలమైనప్పటికీ, ఫిన్ అలెన్ (30 బంతుల్లో 41) ధాటిగా ఆడాడు. అతడికి తోడు విల్ యంగ్ కూడా మెరవడంతో న్యూజిలాండ్ స్కోరుబోర్డు పరుగులు పెట్టింది. వీరిద్దరు ఉన్నప్పుడు కివీస్ ఈజీగా 400 స్కోరు చేస్తుందేమోననిపించింది.
కానీ కీలక సమయంలో భారత బౌలర్లు వికెట్లు తీయడంతో కివీస్ స్కోరు మందగించింది. ఆఖర్లో మిచెల్ సాంట్నర్ (24), క్రిస్టియన్ క్లార్క్ (22), కైల్ జేమీసన్ (19 నాటౌట్) మెరవడంతో కివీస్ 330 పరుగుల మార్క్‌ను దాటింది. భారత బౌలర్లలో గుర్నూర్ బ్రార్, అక్షర్ పటేల్, అకిబ్ నబీ తలా 2 వికెట్లు తీయగా, అర్షదీప్, నమన్ ధీర్ ఒక్కో వికెట్ తీశారు. జట్టులోకి స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా వచ్చిన కుల్దీప్ యాదవ్ 8 ఓవర్లు బౌలింగ్ వేసి 73 పరుగులిచ్చి వికెట్ లేమితో నిరాశపరిచాడు.
ఇదీ చదవండి: అద్భుత క్యాచ్‌తో డేంజరస్ బ్యాటర్‌కు షాకిచ్చిన రోహిత్


