PC: Blackcaps X/BCCI X
న్యూజిలాండ్‌తో నాలుగో వన్డేలో టీమిండియాకు ఘోర పరాభవం ఎదురైంది. ఆతిథ్య జట్టు చేతిలో శ్రేయస్ అయ్యర్ సేన ఏకంగా 244 పరుగుల అతి భారీ తేడాతో ఓటమిపాలైంది. కివీస్ వెటరన్ పేసర్ మ్యాట్ హెన్రీ ఆకాశమే హద్దుగా చెలరేగి టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించాడు.
విల్ యంగ్ విధ్వంసకర శతకం
మౌంట్ మౌంగనూయ్‌లోని బే ఓవల్ మైదానంలో శుక్రవారం టాస్ గెలిచిన భారత్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో కివీస్ ఓపెనర్లలో విల్ యంగ్ విధ్వంసకర శతకం (108 బంతుల్లో 125)తో విరుచుకుపడగా.. టిమ్ సీఫర్ట్ అద్భుత అర్ధ శతకం (48 బంతుల్లో 58)తో ఆకట్టుకున్నాడు.
మిగిలిన వారిలో ఫిన్ అలెన్ (41) రాణించగా.. కెప్టెన్ మిచెల్ సాంట్నర్ (24), క్రిస్టియన్ క్లార్క్ (22) ఫర్వాలేదనిపించారు. ఫలితంగా నిర్ణీత యాభై ఓవర్లలో న్యూజిలాండ్ 333 పరుగుల భారీ స్కోరు సాధించింది. టీమిండియా బౌలర్లలో ఆకిబ్ నబీ, గుర్నూర్ బ్రార్, అక్షర్ పటేల్ తలా రెండు వికెట్లు కూల్చగా.. అర్ష్‌దీప్ సింగ్, నమన్ ధీర్ చెరో వికెట్ పడగొట్టారు.
తొలి ఓవర్లోనే మూడు వికెట్లు
అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన టీమిండియాకు ఆదిలోనే చేదు అనుభవం ఎదురైంది. తొలి ఓవర్లోనే మ్యాట్ హెన్రీ ఓపెనర్ రోహిత్ శర్మ, నాలుగో నంబర్ బ్యాటర్, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌ను గోల్డెన్ డకౌట్‌గా వెనక్కి పంపాడు. వన్‌డౌన్‌లో వచ్చిన విరాట్ కోహ్లిని డకౌట్ చేశాడు.
దీంతో సున్నా పరుగులకే భారత్ మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. మరో ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ (5) నిరాశపరచగా.. వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ (53 బంతుల్లో 27) కాస్త పట్టుదలగా నిలబడగా.. హెన్రీ అతడిని బౌల్డ్ చేశాడు.
హెన్రీకి ఆరు వికెట్లు
మిగిలిన వారిలో అక్షర్ పటేల్ (21), నమన్ ధీర్ (21) చెప్పుకోదగ్గ స్కోర్లు చేయగా.. మిగతా వారంతా ఇలా వచ్చి అలా వెళ్లారు. ఫలితంగా 26.4 ఓవర్లలో కేవలం 89 పరుగులు చేసి భారత్ ఆలౌట్ అయింది. కివీస్ బౌలర్లలో హెన్రీ ఆరు వికెట్లతో చెలరేగగా.. మ్యాట్ ఫిషర్ మూడు వికెట్లు దక్కించుకున్నాడు. కైలీ జెమీషన్ ఒక వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు.
ఇవీ చదవండి: IND vs NZ: ‘నీ చేతులతో నువ్వే అంతా నాశనం చేసుకున్నావు’
IND vs NZ: భారీ స్కోరు.. చరిత్ర సృష్టించిన కివీస్ జట్టు


