PC: Blackcaps X
టీమిండియాతో నాలుగో వన్డేలో న్యూజిలాండ్ ఓపెనర్ విల్ యంగ్ అదరగొట్టాడు. ఆకాశమే హద్దుగా చెలరేగుతూ పరుగుల వరద పారించాడు. భారత బౌలర్లకు కొరకరాని కొయ్యలా మారి.. రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ ఫీల్డింగ్ తప్పిదాలను ఆసరా చేసుకుని విధ్వంసకర శతకంతో విరుచుకుపడ్డాడు.
88 బంతుల్లోనే
మౌంట్ మౌంగనూయ్ వేదికగా శుక్రవారం నాటి వన్డేలో కేవలం 88 బంతుల్లోనే విల్ యంగ్ వంద పరుగుల మార్కు అందుకున్నాడు. మొత్తంగా 108 బంతులు ఎదుర్కొన్న 33 ఏళ్ల ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. ఏకంగా 125 పరుగులు సాధించాడు. అతడి ఇన్నింగ్స్‌లో పద్నాలుగు ఫోర్లు, నాలుగు సిక్సర్లు ఉన్నాయి.
Will Young with his 5th ODI Century and first against India 🖤🤍 Watch all the action LIVE in NZ on Sky Sport. https://t.co/0PzrqDsOmZ
— BLACKCAPS (@BLACKCAPS) November 13, 2026
అయితే, నమన్ ధీర్ బౌలింగ్‌లో సబ్‌స్టిట్యూట్ కుమార్ కుశాగ్రాకు క్యాచ్ ఇవ్వడంతో విల్ యంగ్ శతక ఇన్నింగ్స్‌కు తెరపడింది. దీంతో భారత శిబిరం కాస్త ఊపిరి పీల్చుకుంది. ఇక భారత్‌తో నాలుగో వన్డే సందర్భంగా అద్భుత సెంచరీ సాధించిన విల్ యంగ్ రికార్డుల మోత మోగించాడు.
యంగ్ రికార్డుల మోత
సొంతగడ్డ మీద టీమిండియాతో వన్డేలో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన కివీస్ క్రికెటర్ల జాబితాలో యంగ్ రెండోస్థానానికి ఎగబాకాడు. ఈ జాబితాలో అతడి కంటే ముందు టామ్ లాథమ్ ఉన్నాడు. ఆక్లాండ్ వేదికగా 2022లో లాథమ్ భారత్‌తో వన్డేలో 104 బంతుల్లోనే 145 పరుగులతో అజేయంగా నిలిచాడు.
ఇక న్యూజిలాండ్ తరఫున వన్డేల్లో సొంతగడ్డపై టీమిండియాపై అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన తొలి.. ఓవరాల్‌గా రెండో ఓపెనర్‌గానూ విల్ యంగ్ చరిత్రకెక్కాడు. అంతకుముందు ఇండోర్ (ఇండియా) వేదికగా 2023లో కివీస్ ఓపెనర్ డెవాన్ కాన్వే భారత్‌పై 100 బంతుల్లోనే 138 పరుగులు సాధించాడు.
ఇదే అత్యధికం
ఇదిలా ఉంటే.. విల్ యంగ్‌కు వన్డేల్లో ఇదే అత్యధిక వ్యక్తిగత స్కోరు కావడం విశేషం. గతంలో నెదర్లాండ్స్ మీద 2022లో హామిల్టన్ వేదికగా 120 పరుగులు చేసిన విల్ యంగ్.. 2025లో కరాచీ వేదికగా 107 పరుగులు సాధించాడు.
తాజాగా మౌంట్ మౌంగనూయ్‌లో భారత్‌పై 125 పరుగులతో అలరించాడు.అంతేకాదు.. మౌంట్ మౌంగనూయ్ వేదికగా వన్డేల్లో రెండు సెంచరీలు చేసిన రెండో కివీస్ ఓపెనర్‌గానూ యంగ్ నిలిచాడు. గతంలో మార్టిన్ గప్టిల్ కూడా ఇదే వేదికపై వన్డేల్లో రెండుసార్లు శతక్కొట్టాడు.
ఇవీ చదవండి: IND vs NZ: భారీ స్కోరు.. చరిత్ర సృష్టించిన కివీస్ జట్టు
IND vs NZ: ‘నీ చేతులతో నువ్వే అంతా నాశనం చేసుకున్నావు’


