Photo Credit: Twitter
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) చరిత్రలోనే తొలిసారి కొంతమంది స్టార్ ఆటగాళ్లు 2028 మెగా వేలానికి ముందు తమను రిటైన్ చేసుకోవాలంటే రూ.40 కోట్ల ఫీజును డిమాండ్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. మెగా వేలం జరగడానికి మరో ఏడాది (డిసెంబర్ 2027) సమయం ఉన్నప్పటికీ, ఆటగాళ్ల నుంచి ఈ విధమైన డిమాండ్ రావడం ఆయా ఫ్రాంచైజీలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఈ వార్తల్లో నిజమెంత అనేది పక్కనబెడితే, మెగావేలంలోనే ఆటగాళ్లకు ఇంత ధర ఎప్పుడు పెట్టింది లేదు.
అలాంటిది రిటెన్షన్ కింద తమను అట్టిపెట్టుకోవడానికి సదరు ఆటగాళ్లు రూ. 40 కోట్లు డిమాండ్ చేయడం హాస్యాస్పదంగా అనిపిస్తోంది. అయితే ఐపీఎల్ 2025 మెగా వేలంలో రిషబ్ పంత్‌ను లక్నో సూపర్‌జెయింట్స్ రూ. 27 కోట్లకు, శ్రేయస్ అయ్యర్‌ను పంజాబ్ కింగ్స్ రూ.26.75 కోట్లకు కొనుగోలు చేశాయి. దీంతో ఈసారి తాము మెగా వేలంలోకి వెళ్తే ఇంతకంటే ఎక్కువ ధర లభిస్తుందనే నమ్మకంతోనే కొందరు స్టార్ ఆటగాళ్లు రిటెన్షన్ కింద రూ. 40 కోట్లు డిమాండ్ చేస్తున్నారని తెలుస్తోంది.
ఫ్రాంచైజీల ఆందోళన..
ప్రస్తుతం ఒక జట్టుకు అందుబాటులో ఉన్న మొత్తం పర్స్ వాల్యూ రూ. 120 కోట్లు. వచ్చే ఏడాది మెగా వేలం జరిగే సమయానికి ఈ పర్సు విలువ సుమారు రూ. 150 కోట్లకు పెరగవచ్చని నివేదికలు పేర్కొంటున్నాయి. ఇప్పుడు ఒక్క ఆటగాడికే రూ. 40 కోట్లు కేటాయిస్తే, మొత్తం బడ్జెట్‌లో నాలుగో వంతు వారికే వెచ్చించాల్సి వస్తుంది. ఇది జట్టు సమతుల్యతను దెబ్బతీస్తుందని, ఇతర నాణ్యమైన ఆటగాళ్లను కొనుగోలు చేయడం కష్టమవుతుందని ఫ్రాంచైజీలు ఆందోళన చెందుతున్నాయి.
ఇక వచ్చే ఏడాది మెగా వేలానికి ముందు వచ్చే నెలలో ఐపీఎల్ 2027 మినీ వేలం జరగనుంది. డిసెంబర్ 16, 2026న గోవాలో ఆటగాళ్లను మినీ వేలంలో ఆయా ఫ్రాంచైజీలు దక్కించుకోనున్నాయి. ఇక ఆటగాళ్ల రిటెన్షన్, రిలీజ్ జాబితాలను సమర్పించే గడువును భీసీసీఐ నవంబర్ 15 నుంచి నవంబర్ 17కు పొడిగించిన సంగతి తెలిసిందే.
ఆటగాళ్ల ట్రేడింగ్..
అయితే మినీ వేలానికి ముందు ఆటగాళ్ల ట్రెడింగ్ కొనసాగుతుంది. ఇప్పటికే ఢిల్లీ క్యాపిటల్స్ రిషబ్ పంత్‌ను తీసుకొని.. ట్రేడింగ్‌లో కుల్దీప్ యాదవ్‌ను లక్నోకు పంపించింది. ఇక ఫాస్ట్ బౌలర్ టి.నటరాజన్ సన్‌రైజర్స్ గూటికి చేరుకోగా, బదులుగా ఢిల్లీ క్యాపిటల్స్ లెగ్ స్పిన్నర్ జీషన్ అన్సారీని ట్రేడింగ్ చేసుకుంది. ఇక సీఎస్‌కే కూడా లివింగ్‌స్టోన్, జాక్ ఎడ్‌వర్డ్స్‌లను తీసుకోగా..ఖలీల్ అహ్మద్, నాథన్ ఎల్లిస్‌లు సీఎస్‌కే నుంచి ఎస్‌ఆర్‌హెచ్‌కు ట్రేడ్ అయ్యారు.
ఇదీ చదవండి: ముగిసిన నిషేధం.. విధ్వంసకర వీరుడి రీఎంట్రీ!


