Photo Credit: Twitter
ఆస్ట్రేలియా టీ20 స్పెషలిస్ట్ బ్యాటర్ క్రిస్ లిన్ నిషేధం నుంచి విముక్తి పొందాడు. ఈ ఏడాది జూలైలో నిషేధిత కొకైన్ వాడినందుకు క్రిస్ లిన్‌పై నెలపాటు నిషేధం పడింది. తాజాగా అది పూర్తయిందని, త్వరలో జరగబోయే బిగ్‌బాష్ లీగ్‌లో ఆడుకోవచ్చని ఇంగ్లండ్ క్రికెట్ రెగ్యులేటరీ వెల్లడించింది. బిగ్‌బాష్ లీగ్‌లో క్రిస్ లిన్ అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కొనసాగుతున్నాడు.
అసలేం జరిగిందంటే?
జూలై 18, 2026న ఇంగ్లాండ్‌లో జరిగిన 'టీ20 బ్లాస్ట్ ఫైనల్స్ డే' (T20 Blast Finals) మ్యాచ్‌ల సందర్భంగా క్రిస్ లిన్‌కు సాధారణ యాంటీ-డోపింగ్ పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షలో అతని యూరిన్ శాంపిల్‌లో కొకైన్‌కు సంబంధించిన 'బెంజోయిల్‌ఎక్గోనైన్' (benzoylecgonine) అనే పదార్థం ఉన్నట్లు నిర్ధారణ అయింది.
ఆ సమయంలో అతను నార్తాంప్టన్‌షైర్ జట్టు తరఫున ఆడుతున్నాడు. అయితే క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో గాయపడిన తర్వాత, తాను జూలై 15 రాత్రి, 16న తెల్లవారుజామున కొకైన్ తీసుకున్నట్లు క్రిస్ లిన్ అంగీకరించాడు. అయితే, ఇది ఆటలో మెరుగైన ప్రదర్శన చేయడం కోసం కాదని, వ్యక్తిగత కారణాలతో తీసుకోవాల్సి వచ్చిందని ఇంగ్లండ్ రెగ్యులేటరీ బోర్డుకు క్రిస్ లిన్ వివరించాడు.
అయితే క్రికెట్ రెగ్యులేటర్ మొదట అతనిపై మూడు నెలల సస్పెన్షన్ విధించాలని భావించింది. కానీ, క్రిస్ లిన్ ఒక పునరావాస కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేయడంతో ఈ నిషేధాన్ని ఒక నెలకు తగ్గించారు. క్రిస్ లిన్ తనపై విధించిన నిషేధాన్ని జూలై 31 నుంచి ఆగస్టు 30 మధ్య కాలంలోనే పూర్తి చేసుకున్నాడు.
మ్యాచ్‌లు జరుగుతున్న సమయంలో కాకుండా సాధారణ సమయంలో క్రిస్ లిన్ కొకైన్ తీసుకున్నట్లు నిపుణులు తేల్చడంతో కఠిన చర్యల నుంచి అతడికి ఉపశమనం లభించినట్లయింది. క్రికెట్ రెగ్యులేటర్ తనపై విధించిన నెల నిషేధ కాలం ముగిసిపోవడంతో క్రిస్ లిన్ క్రికెట్ ఆడేందుకు రెడీ అవుతున్నాడు. ఆస్ట్రేలియాలో జరగబోయే బిగ్ బాష్ లీగ్(బీబీఎల్ 2026-27) టోర్నీలో మెల్‌బోర్న్ రెనెగేడ్స్ తరఫున క్రిస్ లిన్ బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నాడు.
ఆస్ట్రేలియా తరఫున 4 వన్డేలు, 18 టీ20లు ఆడిన క్రిస్ లిన్ ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు. ఐపీఎల్‌లో 42 మ్యాచ్‌లాడిన క్రిస్ లిన్ 1329 పరుగులు సాధించాడు. ఇక బీబీఎల్‌లో 137 మ్యాచ్‌లాడిన క్రిస్ లిన్ 4,133 పరుగులు సాధించాడు. బీబీఎల్ చరిత్రలో 4వేల పరుగులు పూర్తి చేసుకున్న తొలి ఆటగాడిగా క్రిస్ లిన్ నిలిచాడు.
ఇదీ చదవండి: ‘అతడొక సాధారణ ప్లేయర్.. సీఎస్‌కే డీల్ నచ్చలేదు’


