‘మీ పోరాటం దేశానికే స్ఫూర్తిదాయకం’ | Prime Minister Narendra Modi with the medal winners of the Asian Para Games | Sakshi
Sakshi News home page

‘మీ పోరాటం దేశానికే స్ఫూర్తిదాయకం’

Nov 6 2026 12:57 AM | Updated on Nov 6 2026 12:57 AM

Prime Minister Narendra Modi with the medal winners of the Asian Para Games

ఆసియా పారా క్రీడల పతక విజేతలతో ప్రధాని నరేంద్ర మోదీ  

న్యూఢిల్లీ: ఆసియా పారా క్రీడల్లో పతకాలు సాధించిన భారత పారా అథ్లెట్లను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేకంగా అభినందించారు. వారి విజయాలు, పోరాట పటిమ యావత్‌ దేశానికి స్ఫూర్తి అని ప్రధాని పేర్కొన్నారు. ఇటీవల జపాన్‌ వేదికగా జరిగిన పారా ఏషియన్‌ గేమ్స్‌లో భారత అథ్లెట్లు 114 పతకాలు సాధించారు. ఇందులో 30 స్వర్ణాలు, 35 రజతాలు, 49 కాంస్య పతకాలు ఉన్నాయి. ఈ పోటీల్లో భారత్‌ నుంచి 97 మంది పారా అథ్లెట్లు పోటీపడగా... వారితో ప్రధాని గురువారం ఇందిరాగాంధీ స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌లో సమావేశమయ్యారు. పారా ఆర్చర్‌ శీతల్‌ దేవి, స్ప్రింట్‌లో రెండు స్వర్ణాలు సాధించిన సిమ్రాన్‌తో ప్రధాని ప్రత్యేకంగా ముచ్చటించారు. ఈ సందర్భంగా పారా అథ్లెట్లకు నరేంద్ర మోదీ స్వీట్లు తినిపించారు. 

అనంతరం ప్రధాని మెదీ మాట్లాడుతూ... ‘మీ అద్భతమైన ప్రదర్శన క్రీడా రంగంలో మనదేశం ఒక బలీయమైన శక్తిగా ఎదుగుతోందనడానికి నిదర్శనం. మీరు పతకాలు మాత్రమే గెలవలేదు. కోట్లాది మంది హృదయాలను గెలుచుకున్నారు. మీ పోరాటాలు, మీ విజయాలు ప్రతీ భారతీయుడికి స్ఫూర్తినిస్తాయి. గతంలో తల్లిదండ్రులు తమ పిల్లలను క్రీడారంగం వైపు ప్రోత్సహించడానికి భయపడేవారు... కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవు. ఎవరికి ఏ రంగంలో మక్కువ ఉంటే వారు అందులో అత్యున్నత శిఖరాలకు చేరుకునే మార్గాలు ఉన్నాయి. ప్రతిభను ప్రోత్సహించడంలో ఎల్లప్పుడూ ముందుంటాం. దాని ఫలితాలే ఇప్పుడు మనం చూస్తున్నాం. 

ఒకప్పుడు మనవాళ్లు చాలా తక్కువ క్రీడల్లో పాల్గొనేవారు... ఇప్పుడు అందులో మార్పు వచ్చింది. ఆర్చరీ, అథ్లెటిక్స్, షూటింగ్, స్విమ్మింగ్, టేబుల్‌ టెన్నిస్, బ్యాడ్మింటన్, జూడో, పవర్‌లిఫ్టింగ్‌ ఇలా ఒక్కటేమిటి అన్నీ క్రీడల్లో మన ప్రాతినిధ్యం పెరిగింది. ఇది బలమైన క్రీడా దేశానికి సంకేతం. నైపుణ్యం ఎక్కడ ఉన్నా దానికి పదును పెట్టేందుకు సిద్ధం’ అని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర క్రీడా శాఖ మంత్రి మన్సుఖ్‌ మాండవీయ, సహాయ మంత్రి రక్షా ఖడ్సే తదితరులు పాల్గొన్నారు. ఆసియా పారా క్రీడల్లో తెలుగు రాష్ట్రాల క్రీడాకారులు జీవంజీ దీప్తి, బానోతు అకీరా నందన్, బుడిగిన రవి కార్తీక్, రవి రొంగళి, రవన్ని వలసనైని పతకాలు సాధించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement