source: X
వెస్టిండీస్ మాజీ ఆల్‌రౌండర్ కీరన్ పొలార్డ్ మరో కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇంగ్లండ్‌లో జరిగే 'ది హండ్రెడ్' టోర్నీలో ఎంఐ లండన్ జట్టు ప్రధాన కోచ్ బాధ్యతల నుంచి తప్పుకోనున్నట్లు పలు నివేదికలు వెల్లడించాయి. కొంతకాలం విశ్రాంతి తీసుకోవాలనే ఉద్దేశంతోనే పొలార్డ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
ఈ ఏడాది జరిగిన 2026 సీజన్‌తో పొలార్డ్ ఎంఐ లండన్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టాడు. అతడి పర్యవేక్షణలో సామ్ కరన్ నాయకత్వంలోని జట్టు ఎనిమిది మ్యాచ్‌ల్లో ఐదు విజయాలు సాధించింది. పాయింట్ల పట్టికలో 20 పాయింట్లతో సన్‌రైజర్స్ లీడ్స్‌తో సమంగా నిలిచినా.. నెట్ రన్‌రేట్ తక్కువగా ఉండటంతో ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించలేకపోయింది. ఎనిమిది జట్ల పట్టికలో నాలుగో స్థానంతో సరిపెట్టుకుంది.
ముంబై ఇండియన్స్ కోచ్‌గా కొత్త బాధ్యతలు
మరోవైపు ఐపీఎల్ 2027 సీజన్‌కు ముందు పొలార్డ్‌కు ముంబై ఇండియన్స్ యాజమాన్యం కీలక బాధ్యతలు అప్పగించింది. జట్టు ప్రధాన కోచ్‌గా నియమించింది. గతంలో ముంబై తరఫున ఆటగాడిగా 13 సీజన్లలో 189 మ్యాచ్‌లు ఆడిన పొలార్డ్.. ఐదు టైటిల్ విజయాల్లో భాగమయ్యాడు. గతంలో జట్టు బ్యాటింగ్ కోచ్‌గానూ పనిచేశాడు.
ఐపీఎల్ ముగిసిన కొద్దికాలానికే ఇంగ్లండ్‌లో ది హండ్రెడ్ టోర్నీ ప్రారంభమవుతుంది. దీంతో వరుసగా రెండు టోర్నీల బాధ్యతలు నిర్వహించడం కష్టమవుతుందని భావించి పొలార్డ్ ఎంఐ లండన్ కోచ్ పదవి నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
పొలార్డ్ స్థానంలో కొత్త కోచ్‌ను నియమించేందుకు సర్రే క్రికెట్ క్లబ్ ప్రకటన విడుదల చేయనున్నట్లు సమాచారం. రిలయన్స్ ఇండస్ట్రీస్‌తో కలిసి సర్రే క్లబ్ ఎంఐ లండన్ ఫ్రాంచైజీని నిర్వహిస్తోంది.
ఇదీ చదవండి: మూడో టెస్టుకూ పంత్ దూరం.. ప్రత్యామ్నాయంగా తిలక్ వర్మ..!


