ముంబై ఇండియన్స్‌లోకి కొత్తగా ఇంగ్లండ్ స్టార్.. కెప్టెన్ కూడా అతడే..!
ముంబై ఇండియన్స్ ఫ్యామిలీలోకి కొత్తగా మరో ముగ్గురు చేరారు. ది హండ్రెడ్ లీగ్ 2026 ఎడిషన్ కోసం ఎంఐ లండన్ ఫ్రాంచైజీ (మునుపటి ఓవల్ ఇన్విన్సిబుల్స్) ఇంగ్లండ్ ప్లేయర్లు సామ్ కర్రన్ , విల్ జాక్స్, డ్యానీ వ్యాట్-హాడ్జ్ (మహిళ)ను ప్రీ-ఆక్షన్ సైనింగ్స్‌గా ఎంపిక చేసుకుంది. వీరిలో సామ్ కర్రన్‌ను ఎంఐ లండన్ పురుషుల జట్టు కెప్టెన్‌గానూ ప్రకటించింది. గత సీజన్ వరకు ఈ ఫ్రాంచైజీకి సామ్ బిల్లంగ్స్ సారథ్యం వహించాడు. బిల్లంగ్స్ నాయకత్వంలో నాటి ఓవల్ ఇన్విన్సిబుల్స్ (ప్రస్తుత ఎంఐ లండన్) 2023–2025 మధ్యలో వరుసగా మూడు టైటిళ్లు గెలిచించి. అయినా యాజమాన్యం బిల్లింగ్స్‌ను మార్చి సామ్ కర్రన్‌కు కెప్టెన్సీ పగ్గాలు అప్పజెప్పింది. ఎంఐ లండన్ ఫ్రాంచైజీ అంబానీల (ముకేశ్, నీతా) యాజమాన్యంలో నడిచే ముంబై ఇండియన్స్‌కు (ఐపీఎల్) సిస్టర్ ఫ్రాంచైజీ. ప్రపంచవాప్తంగా చాలా లీగ్‌ల్లో ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీలు ఉన్నాయి. ఐపీఎల్, WPLలో ముంబై ఇండియన్స్ కాగా.. సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో ఎంఐ కేప్‌టౌన్, ఇంటర్నేషనల్ లీగ్ టీ20లో ఎంఐ ఎమిరేట్స్, మేజర్ లీగ్ క్రికెట్లో ఎంఐ న్యూయార్క్, హండ్రెడ్ లీగ్‌లో ఎంఐ లండన్ ఫ్రాంచైజీలు ముంబై ఇండియన్స్ ఫ్యామిలీలో భాగంగా ఉన్నాయి. హండ్రెడ్ లీగ్‌లో కొత్తగా ఎంపికైన తమ కెప్టెన్ సామ్ కర్రన్‌ను ముంబై ఇండియన్స్ సాదరంగా తమ ఫ్యామిలీలోకి ఆహ్వానించింది. అలాగే జాక్స్, డానీకి కూడా వెల్కమ్ చెప్పింది. హండ్రెడ్ లీగ్‌లో ఓవల్ ఇన్విన్సిబుల్స్ (ప్రస్తుతం ఎంఐ లండన్) మొత్తంగా ఐదు టైటిళ్లు సాధించింది. ఇందులో పురుషుల విభాగంలో 3.. మహిళల విభాగంలో 2 టైటిళ్లు ఉన్నాయి.కాగా, హండ్రెడ్ లీగ్ 2026 ఎడిషన్ జులై 21 నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఆగస్ట్ 16 వరకు సాగే ఈ టోర్నీ కోసం జనవరి చివరి వరకు నాలుగు ముందస్తు వేలం ఒప్పందాలు (అన్ని ఫ్రాంచైజీలకు) అనుమతించబడతాయి. వీటిలో గరిష్టంగా మూడు ప్రత్యక్ష ఒప్పందాలు కావచ్చు. వీరిలో ఒకరు వారివారి జాతీయ జట్లతో సెంట్రల్ కాంట్రాక్ట్ కలిగి ఉండాలి. కనీసం ఒకరిని (ఎవరైనా) రిటెన్షన్ చేసుకునే అవకాశం ఉంది. ఎంఐ లండన్ లాగే హండ్రెడ్ లీగ్‌లోని మిగతా ఫ్రాంచైజీలు (బర్మింగ్‌హామ్ ఫీనిక్స్, లండన్ స్పిరిట్, మాంచెస్టర్ ఒరిజినల్స్, సన్‌రైజర్స్ లీడ్స్, ట్రెంట్ రాకెట్స్, సదరన్ బ్రేవ్, వెల్ష్ ఫైర్) కూడా ప్రీ-ఆక్షన్ సైనింగ్స్ చేసుకుంటున్నాయి.