అక్టోబర్ నెలకు గానూ 'ప్లేయర్ ఆఫ్‌ది మంత్' అవార్డుకు నామినేట్ అయిన ఆటగాళ్ల జాబితాను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) తాజాగా ప్రకటించింది. పురుషల విభాగంలో మార్కో జాన్సెన్, షాయ్ హోప్, అరఫాత్ మిన్హాస్ నామినేట్ అవ్వగా.. మహిళల విభాగంలో భారత స్టార్ ఆల్‌రౌండర్ దీప్తి శర్మతో పాటు శోభనా మోస్తరీ, అన్నాబెల్ సుథర్‌ల్యాండ్ తుది జాబితాలో చోటు దక్కించుకున్నారు. పురుషల కేటగిరీలో భారత్ నుంచి ఒక్కరు కూడా లేకపోవడం గమనార్హం.
జాన్సెన్ ఆల్‌రౌండ్ షో
సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్‌లో సౌతాఫ్రికా ఆల్‌రౌండర్ మార్కో జాన్సెన్ అదరగొట్టాడు. అటు బంతితోనూ ఇటు బ్యాట్‌తోనూ అతడు సత్తాచాటాడు. సౌతాఫ్రికా 2-1తో కైవసం చేసుకోవడంలో జాన్సెన్ కీలక పాత్ర పోషించాడు. మరోవైపు విండీస్ కెప్టెన్ షాయ్ హోప్ భారత పర్యటనలో అద్భుతమైన ఫామ్‌ను ప్రదర్శించాడు.
టీ20 సిరీస్‌లో 4 ఇన్నింగ్స్‌ల్లో రెండు సెంచరీలతో 261 పరుగులు సాధించడమే కాకుండా, వన్డే సిరీస్‌లో కూడా అతడు దుమ్మురేపాడు. అలాగే ఇంగ్లండ్, శ్రీలంకతో జరిగిన ముక్కోణపు వన్డే సిరీస్‌లో పాకిస్తాన్ యువ ఆల్‌రౌండర్ అరఫాత్ మిన్హాస్ కూడా రాణించాడు. అతడు 149 పరుగులు చేయడంతో పాటు 9 వికెట్లు పడగొట్టాడు.
ఇక మహిళల విభాగం విషయానికి వస్తే.. భారత స్టార్ ఆల్‌రౌండర్ దీప్తి శర్మ జింబాబ్వేతో జరిగిన వైట్ బాల్ సిరీస్‌లలో అద్భుత ప్రదర్శన చేసింది. వడోదరలో జరిగిన రెండో వన్డేలో సెంచరీ సాధించడంతో పాటు, వన్డే సిరీస్‌లతో 5 వికెట్లు, టీ20ల్లో 2 వికెట్లు తీసింది.
డిసెంబర్ 2023లో చివరిసారిగా ఈ అవార్డును గెలుచుకున్న దీప్తి, మరోసారి ఈ రేసులో ముందంజలో ఉంది. ఆసీస్ ఆల్‌రౌండర్ అన్నాబెల్ సుథర్‌ల్యాండ్ కూడా బంగ్లాదేశ్, న్యూజిలాండ్ సిరీస్‌లో కూడా సత్తాచాటింది.


