నాకేం సంబంధం లేదు: పాక్‌ క్రికెటర్‌పై ఇర్ఫాన్‌ పఠాన్‌ ప్రశంసలు | Irfan Pathan Distances Himself From Amir Joining Kandahar Warriors | Sakshi
Sakshi News home page

నాకేం సంబంధం లేదు: పాక్‌ క్రికెటర్‌పై ఇర్ఫాన్‌ పఠాన్‌ ప్రశంసలు

Nov 5 2026 5:50 PM | Updated on Nov 5 2026 6:01 PM

Irfan Pathan Distances Himself From Amir Joining Kandahar Warriors

PC: BCCI/PCB X

టీమిండియా మాజీ క్రికెటర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌ పేరు గత కొన్ని రోజులుగా క్రీడా వర్గాల్లో ఎక్కువగా వినిపిస్తోంది. పాకిస్తాన్‌కు చెందిన మహ్మద్‌ ఆమిర్‌.. ఇర్ఫాన్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఉన్న జట్టులో చేరడమే ఇందుకు కారణం.

కాగా పాకిస్తాన్‌ మాజీ క్రికెటర్లు ముఖ్యంగా షాహిద్‌ ఆఫ్రిది వంటి వాళ్లు భారత్‌ను ఉద్దేశించి అవాకులు, చెవాకులు పేలితే.. వారికి కౌంటర్‌ ఇవ్వడంలో ఇర్ఫాన్‌ పఠాన్‌ ముందుంటాడు. గతంలో షాహిద్‌తో ఇర్ఫాన్‌కు మైదానం వెలుపల పెద్ద గొడవలే జరిగాయి. ఇందుకు బదులుగా ఆటతో పాటు మాటలతోనూ అతడికి ఇర్ఫాన్‌ గట్టి కౌంటర్లే ఇచ్చాడు.

బ్రాండ్‌ అంబాసిడర్‌గా
ఇక ప్రస్తుతం ఇర్ఫాన్‌ పఠాన్‌ అఫ్గానిస్తాన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో ఖలందర్‌ వారియర్స్‌కు బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఉన్నాడు. ఈ జట్టుకు అఫ్గాన్‌ దిగ్గజ స్పిన్నర్‌ రషీద్‌ ఖాన్‌ కెప్టెన్‌. అయితే, ఈ జట్టులోకి పాకిస్తాన్‌కు చెందిన మహ్మద్‌ ఆమిర్‌ వచ్చాడు. ఈ నేపథ్యంలో ఇర్ఫాన్‌ పఠాన్‌పై విమర్శలు రాగా.. తాజాగా స్పందించాడు.

వారిద్దరే నిర్ణయం తీసుకుంటారు
‘‘నేను ఆ జట్టుకు కేవలం బ్రాండ్‌ అంబాసిడర్‌ను మాత్రమే. ప్లేయర్ల డ్రాఫ్టింగ్‌ విషయంలో నాకు ఎలాంటి సంబంధం ఉండదు. కెప్టెన్‌ రషీద్‌ ఖానే జట్టు సభ్యుల ఎంపికకు బాధ్యుడు. రవి బొపార హెడ్‌కోచ్‌. వారిద్దరే నిర్ణయం తీసుకుంటారు.

అనుభవజ్ఞుడైన ఆటగాడు
ఏదేమైనా మహ్మద్‌ ఆమిర్‌ అనుభవజ్ఞుడైన ఆటగాడు. తనొక సీనియర్‌ ప్లేయర్‌. అయితే, ప్రస్తుతం నా దృష్టి మొత్తం అఫ్గానిస్తాన్‌ యువ ఆటగాళ్లపైనే ఉంది. వారికి నా అవసరం ఉందంటే కచ్చితంగా బౌలింగ్‌లో మెళకువలు నేర్పుతాను. వారి నైపుణ్యాలకు మెరుగులు దిద్దుతాను’’ అని ఇర్ఫాన్‌ పఠాన్‌ వెల్లడించాడు.

కాగా పాకిస్తాన్‌కు చెందిన మహ్మద్‌ ఆమిర్‌.. బ్రిటన్‌లో స్థిరపడ్డాడు. బ్రిటిష్‌ పౌరుడిగానే అతడు అఫ్గాన్‌ ప్రీమియర్‌ లీగ్‌ డ్రాఫ్ట్‌లో తన పేరును నమోదు చేసుకున్నాడు. ఖలందర్‌ వారియర్స్‌ అతడిని సుమారు రూ. 94.75 లక్షలకు కొనుగోలు చేసింది.

మహ్మద్‌​ ఆమిర్‌తో పాటు టైమల్‌ మిల్స్‌, జో క్లార్క్‌, జార్జ్‌ మున్సే, కుశాల్‌ పెరీరా, ఇబ్రహీం మసూద్‌, డ్వేన్‌ ప్రిటోరియస్‌ తదితరులు ఈ జట్టులోకి చేరారు. కాగా ఆమిర్‌ బ్రిటీష్‌ పౌరుడిగా ఐపీఎల్‌ వేలంలోకి వస్తాడనే వార్తలు రాగా.. అతడు ఖండించాడు. ప్రస్తుతం అలాంటి చర్చలు ఏమీ జరగడం లేదని ఇటీవలే స్పష్టం చేశాడు.

ఇదీ చదవండి: పృథ్వీ షా మెరుపులు.. పది వికెట్ల తేడాతో ఘన విజయం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement