గంభీర్‌పై విమర్శలు సరికావు.. వ్యూస్ కోసం అలా చేయొద్దు: పఠాన్ | Irfan Pathan issues strong statement after NZ vs IND 2026 1st T20I | Sakshi
Sakshi News home page

గంభీర్‌పై విమర్శలు సరికావు.. వ్యూస్ కోసం అలా చేయొద్దు: పఠాన్

Oct 23 2026 7:08 PM | Updated on Oct 23 2026 8:02 PM

 Irfan Pathan issues strong statement after NZ vs IND 2026 1st T20I

క్రైస్ట్‌చర్చ్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టీ20లో భారత్ అద్భుత విజయం సాధించిన సంగతి తెలిసిందే. మెన్ ఇన్ బ్లూ జట్టు 226 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించి సరికొత్త చరిత్ర సృష్టించింది. అయితే ఈ మ్యాచ్‌లో ఇషాన్ కిషన్ బ్యాటింగ్ ఆర్డర్‌ను మార్చడంపై సోషల్ మీడియాలో పెద్దఎత్తున విమర్శలు వచ్చాయి. వన్ డౌన్‌లో రావాల్సిన ఇషాన్ కిషన్ స్థానంలో తిలక్ వర్మ బరిలోకి దిగడంతో అంతా ఆశ్చర్యపోయారు.

భారత హెడ్‌కోచ్ గౌతమ్ గంభీర్ మరోసారి అనవసరమైన ప్రయోగాలు చేశాడంటూ కొందరు నెటిజన్లు, విమర్శకులు విరుచుకుపడ్డారు. అయితే ఆ నిర్ణయం వెనుక అసలు కారణం వేరే ఉంది. 

ఇషాన్ కిషన్ స్వల్ప గాయంతో  బాధపడుతున్నాడు. అందుకే అతడిని వెంటనే బ్యాటింగ్‌కు పంపకుండా కొంచెం కిందకు దించారు. ఈ విషయంపై స్పందించిన భారత మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్.. గంభీర్‌కు మద్దతుగా నిలిచాడు.

"ఇషాన్ కిషన్‌కు చిన్నపాటి గాయం ఉండటం వల్లే అతడు బ్యాటింగ్‌లో కాస్త ఆలస్యంగా వచ్చాడు. కానీ కొంచెం కూడా ఆలోచించకుండా ప్రతి ఒక్కరూ గౌతమ్ గంభీర్‌ను విమర్శించడం మొదలుపెట్టారు. ప్రస్తుతం గంభీర్‌ను విమర్శించడం కొందరికి టైమ్‌పాస్‌గా మారిపోయింది.

ఏదైనా విషయంపై ఒకరిని విమర్శించే ముందు కాస్త ఆలోచించండి. పూర్తి విషయం తెలియకుండానే తొందరపడి ఒక నిర్ధారణకు రావద్దు. ఇది జీవితంలోని అన్ని విషయాలకు వర్తిస్తుంది. సోషల్ మీడియాలో వ్యూస్, లైక్స్ కోసం ఆరాటపడే క్రమంలో, అసలు నిజమేంటో తెలుసుకోకుండా మీరు ఎవరినైనా తీవ్రంగా బాధపెట్టే అవకాశం ఉంది. కాబట్టి ఏదైనా తీర్పు ఇచ్చే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించండి" అంటూ ఇర్ఫాన్ పఠాన్ ఎక్స్ వేదికగా పేర్కొన్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement