PC: CAB X
రంజీ ట్రోఫీ 2026-27 సీజన్‌లో భాగంగా బెంగాల్‌తో మ్యాచ్‌లో మహారాష్ట్ర ఘన విజయం సాధించింది. ప్రత్యర్థి జట్టును ఏకంగా పది వికెట్ల తేడాతో మట్టికరిపించింది. కోల్‌కతా వేదికగా సోమవారం మొదలైన మ్యాచ్‌లో టాస్ గెలిచిన మహారాష్ట్ర తొలుత బౌలింగ్ ఎంచుకోగా.. ఆతిథ్య బెంగాల్ జట్టు బ్యాటింగ్‌కు దిగింది.
మహారాష్ట్రకు 75 పరుగుల ఆధిక్యం
మహారాష్ట్ర బౌలర్ల ధాటికి టాపార్డర్ కుదేలు కాగా.. వికెట్ కీపర్ బ్యాటర్ అభిషేక్ పోరెల్ అర్ధ శతకం (54)తో రాణించాడు. అతడికి తోడు ప్రదీప్త ప్రామాణిక్ 31 పరుగులతో ఫర్వాలేదనిపించాడు. ఫలితంగా తొలి ఇన్నింగ్స్‌లో బెంగాల్ 143 పరుగుల గౌరవప్రదమైన స్కోరుకు ఆలౌట్ అయింది.
మహారాష్ట్ర బౌలర్లలో తనయ్ సంఘ్వీ నాలుగు వికెట్లతో సత్తా చాటగా.. ప్రదీప్ దాధే, రాజ్‌వర్దన్ హంగర్గేకర్, సిద్దేశ్ వీర్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. ఈ క్రమంలో మహారాష్ట్ర తమ తొలి ఇన్నింగ్స్‌లో 218 పరుగులకు ఆలౌట్ కాగా.. 75 పరుగుల ఆధిక్యం లభించింది. తనయ్ సంఘ్వీ అజేయ హాఫ్ సెంచరీ (60)తో సత్తా చాటాడు.
186 పరుగులకు ఆలౌట్.. లక్ష్యం 111
ఈ క్రమంలో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన బెంగాల్ ఈసారి 186 పరుగులకు ఆలౌట్ అయింది. అభిషేక్ పోరెల్ మరోసారి అర్ధ శతకం (65)తో అలరించగా.. సుమంత గుప్తా సైతం హాఫ్ సెంచరీ (59) బాదాడు. ఫలితంగా బెంగాల్ మహారాష్ట్రకు 111 పరుగుల లక్ష్యం విధించగలిగింది.
పృథ్వీ షా మెరుపులు.. సచిన్ అర్ధ శతకం
ఆటకు ఆఖరి రోజైన గురువారం నామమాత్రపు లక్ష్యంతో బరిలోకి దిగిన మహారాష్ట్ర వికెట్ నష్టపోకుండా పనిపూర్తి చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో నిరాశపరిచిన ఓపెనర్, కెప్టెన్ పృథ్వీ షా ఈసారి మెరుపులు మెరిపించాడు. కేవలం 50 బంతుల్లోనే మూడు ఫోర్లు, నాలుగు సిక్సర్లు బాది 53 పరుగులతో అజేయంగా నిలిచాడు.
పృథ్వీ షాకు తోడు మరో ఓపెనర్ సచిన్ దాస్ కూడా అజేయ అర్ధ శతకం (68 బంతుల్లో 61)తో రాణించాడు. ఫలితంగా 19.4 ఓవర్లలోనే 114 పరుగులు చేసిన మహారాష్ట్ర పది వికెట్ల తేడాతో బెంగాల్‌ను చిత్తు చేసింది.
తద్వారా ఈ సీజన్‌లో ఇప్పటికి నాలుగు మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న మహారాష్ట్ర... రెండో విజయం నమోదు చేసింది. ఇదిలా ఉంటే.. మహారాష్ట్రతో మ్యాచ్‌లో బెంగాల్ పేసర్, టీమిండియా వెటరన్ స్టార్ మహ్మద్ షమీ తొలి ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లతో సత్తా చాటాడు.
ఇదీ చదవండి: IND vs NZ: ‘అతడు తుదిజట్టులో లేకపోయినా పెద్దగా తేడా ఉండదు’


