సహచర ఆటగాళ్లతో నితీశ్ రెడ్డి (PC: BCCI X)
న్యూజిలాండ్‌తో తొలి వన్డేలో గెలుపొందిన టీమిండియా.. రెండో వన్డేలో విజయంపై కన్నేసింది. వెల్లింగ్‌టన్ వేదికగా శనివారం నాటి రెండో వన్డేల్లోనూ సత్తా చాటాలని పట్టుదలగా ఉంది. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ అజింక్య రహానే ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
కివీస్‌తో రెండో వన్డే కోసం భారత తుదిజట్టులో మార్పులు చేయాల్సిన అవసరం లేదని రహానే అభిప్రాయపడ్డాడు. పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి ప్లేయింగ్ ఎలెవన్‌లో లేనందున పెద్దగా తేడా ఏమీ ఉండదని.. అతడు లేకున్నా జట్టుకు నష్టం లేదని పేర్కొన్నాడు.
టీ20 సిరీస్ కైవసం.. తొలి వన్డేలో విజయం
కాగా ఐదు టీ20లు, ఐదు వన్డేలు, రెండు టెస్టులు ఆడేందుకు టీమిండియా న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. తొలుత టీ20 సిరీస్ జరుగగా భారత్ 3-2తో సిరీస్ కైవసం చేసుకుంది. ఇక బుధవారం వన్డే సిరీస్ మొదలుకాగా.. సమిష్టి ప్రదర్శనతో టీమిండియా విజయం సాధించింది.
తొలుత కివీస్‌ను 185 పరుగులకే ఆలౌట్ చేసిన భారత జట్టు.. వర్షం అంతరాయం వల్ల 32 ఓవర్లలో 143 పరుగుల లక్ష్యాన్ని ఛేదించాల్సి రాగా కేవలం 22.4 ఓవర్లలోనే పని పూర్తి చేసింది. ఐదు వికెట్ల తేడాతో గెలిచి 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది.
ఇక న్యూజిలాండ్‌తో తొలి వన్డేలో భారత పేసర్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు. అర్ష్‌దీప్ సింగ్ నాలుగు వికెట్లతో అదరగొట్టగా.. గుర్నూర్ బ్రార్ మూడు, అన్షుల్ కాంబోజ్ రెండు వికెట్లు దక్కించుకున్నారు. ఈ నేపథ్యంలో అజింక్య రహానే సోనీ లివ్ షోలో మాట్లాడుతూ..
నితీశ్ రెడ్డి అవసరం లేదు
‘‘కివీస్‌తో తొలి వన్డేలో భారత తుదిజట్టు చక్కగా కుదిరింది. కాబట్టి నితీశ్ రెడ్డి ప్లేయింగ్ ఎలెవన్‌లో లేకపోయినా పెద్దగా తేడా ఉమీ ఉండదు. నిజానికి నితీశ్ రెడ్డి మంచి ప్లేయర్. టీ20 సిరీస్‌లో మెరుగ్గా రాణించాడు.
అయితే, ప్రస్తుత జట్టు కూర్పు దృష్ట్యా అతడిని రెండో వన్డేలో ఆడించాల్సిన అవసరం మాత్రం కనిపించడం లేదు’’ అని అభిప్రాయపడ్డాడు.
అయితే, తొలి వన్డేలో విఫలమైనప్పనటికీ జమ్మూ కశ్మీర్ ఎక్స్‌ప్రెస్ ఆకిబ్ నబీకి మరో అవకాశం ఇవ్వాలని రహానే ఈ సందర్భంగా టీమిండియా కెప్టెన్ శుబ్‌మన్ గిల్‌కు విజ్ఞప్తి చేశాడు. కాగా తొలి వన్డేలో నబీ ఆరు ఓవర్లలో 33 పరుగులు ఇచ్చి వికెట్ తీయలేకపోయాడు.
ఇవీ చదవండి: ఆల్‌టైమ్ టాప్-5 వన్డే క్రికెటర్లు వీరే!.. కోహ్లికి దక్కని చోటు
'మాటల్లేవ్.. అతడి భవిష్యత్తు తొలి మ్యాచ్‌లోనే చెప్పేశా'


