'మాట‌ల్లేవ్‌.. అత‌డి భ‌విష్య‌త్తు తొలి మ్యాచ్‌లోనే చెప్పేశా' | Tendulkar-Praise Joe Root-Happy-Who-Very-Near-Break-His Test Record | Sakshi
Sakshi News home page

'మాట‌ల్లేవ్‌.. అత‌డి భ‌విష్య‌త్తు తొలి మ్యాచ్‌లోనే చెప్పేశా'

Nov 5 2026 8:24 AM | Updated on Nov 5 2026 8:33 AM

Tendulkar-Praise Joe Root-Happy-Who-Very-Near-Break-His Test Record

Photo Credit: Twitter

టెస్టు క్రికెట్ చరిత్ర‌లో ఇంగ్లండ్ స్టార్ క్రికెట‌ర్ జో రూట్‌ ప్ర‌స్తుతం రెండో టాప్ స్కోర‌ర్‌గా కొన‌సాగుతున్నాడు. అతడు ఇప్ప‌టివ‌ర‌కు 169 టెస్టుల్లో 309 ఇన్నింగ్స్‌లు ఆడి 14,278 ప‌రుగులు సాధించాడు. టెస్టు క్రికెట్‌లో అత్య‌ధిక ప‌రుగుల రికార్డు భార‌త క్రికెట్ దిగ్గ‌జం స‌చిన్ టెండూల్క‌ర్ పేరిట ఉంద‌న్న విష‌యం ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌వ‌స‌రం లేదు. స‌చిన్ టెండూల్క‌ర్ త‌న టెస్టు కెరీర్‌లో 200 టెస్టులాడి 329 ఇన్నింగ్స్‌ల్లో 15,921 ప‌రుగులు సాధించాడు. 

అయితే స‌చిన్ రికార్డును బ‌ద్ద‌లుకొట్టేందుకు రూట్ కేవ‌లం 1,643 ప‌రుగుల దూరంలో ఉన్నాడు. ఈ నేప‌థ్యంలో  రెడ్డిట్‌లో జరిగిన 'ఆస్క్ మీ ఎనీథింగ్' సెషన్‌లో అభిమానులతో ముచ్చటించిన సచిన్‌కు.. త్వ‌ర‌లోనే టెస్టుల్లో మీ పేరిట ఉన్న‌ అత్య‌ధిక ప‌రుగుల రికార్డును రూట్ బ‌ద్ద‌లుకొట్టేలా ఉన్నాడు. దీనిపై మీ స్పంద‌నేంటి? అని ప్ర‌శ్నించారు. 

రూట్‌ను ప్ర‌శంస‌ల‌తో ముంచెత్తిన స‌చిన్ మాట్లాడుతూ.. "నేను రూట్‌ను ఎప్పుడూ గొప్ప ఆటగాడిగానే భావిస్తాను. అతను తన తొలి టెస్ట్ మ్యాచ్ ఆడినప్పుడే భవిష్యత్తులో ఒక పెద్ద స్టార్ అవుతాడని నాకు స్పష్టంగా అర్థమైంది.  ఇక రూట్ గురించి మాట్లాడుకోవ‌డానికి కొత్త‌గా ఏం లేదు. నా రికార్డు బ‌ద్ద‌లవుతుందంటే బాధ క‌న్నా సంతోష‌మే ఎక్కువగా అనిపిస్తుంది. టీమిండియా ప్లేయ‌ర్లు కాకుండా నాకిష్ట‌మైన విదేశీ క్రికెట‌ర్ల‌లో జోరూట్‌, హ్యారీ బ్రూక్‌, స్టీవ్ స్మిత్ ఉంటారు. ఈ ముగ్గురు టెస్టు క్రికెట్ సంప్ర‌దాయాన్ని కాపాడుతూ వ‌స్తున్నారు.'' అని చెప్పుకొచ్చాడు.

2012లో నాగ్‌పూర్‌లో భారత్‌తో జరిగిన మ్యాచ్‌తో రూట్ టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. ఆ మ్యాచ్‌లో సచిన్ కూడా భారత జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. ఆ మ్యాచ్‌లో రూట్ మొదటి ఇన్నింగ్స్‌లో 73 పరుగులు చేశాడు.  ఇక రెండో ఇన్నింగ్స్‌లో 20 ప‌రుగుల‌తో నాటౌట్‌గా నిలిచాడు. ఆ మ్యాచ్ డ్రాగా ముగిసింది.

ఇక, వన్డే అంతర్జాతీయ ఫార్మాట్‌లో మార్పులు తీసుకురావాలనే తన పాత సూచనను సచిన్ మరోసారి పునరుద్ఘాటించాడు. 50 ఓవర్ల మ్యాచ్‌ను ఒక్కో జట్టుకు 25 ఓవర్ల చొప్పున రెండు వేర్వేరు ఇన్నింగ్స్‌లుగా విభజించాలని సూచించాడు. "నా సూచన చాలా సులభం. 50 ఓవర్లను రెండు 25 ఓవర్ల ఇన్నింగ్స్‌లుగా విభజించాలి.

కానీ, మొత్తం 50 ఓవర్లకు 10 వికెట్లు అలాగే ఉంచాలి. ఒకే బంతిని ఉపయోగించాలి. దీనివల్ల బ్యాట్, బాల్ మధ్య పోటీ స‌మంగా ఉంటుంది. మంచు ప్రభావం వల్ల ఒకే జట్టుకు అనుకూలంగా మారే పరిస్థితి ఉండదు. బౌలర్లు కనుమరుగు కాకముందే మనం ఏదైనా చేయాలి" అని సచిన్ తన ప్రతిపాదనను వివరించాడు. ఈ మార్పుతో ఆట రెండు జట్లకు సమతుల్యంగా మారుతుందని అభిప్రాయపడ్డాడు.

ఇదీ చ‌ద‌వండి: ఎంత వెతికినా దొర‌క‌లేదు.. పాపం కోహ్లి!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement