పుణే: బీసీసీఐ జాతీయ సీనియర్ మహిళల టి20 ట్రోఫీ ఎలైట్ టోర్నీని హైదరాబాద్ జట్టు విజయంతో ముగించింది. గ్రూప్ ‘డి’లో భాగంగా పుదుచ్చేరితో బుధవారం జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్‌లో హైదరాబాద్ ఏడు వికెట్ల తేడాతో గెలిచింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ వంకా పూజ ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబరిచి హైదరాబాద్ విజయంలో కీలకపాత్ర పోషించింది. మొదట బ్యాటింగ్ చేసిన పుదుచ్చేరి 19.5 ఓవర్లలో 133 పరుగులకు ఆలౌటైంది. వంకా పూజ 4 ఓవర్లలో 15 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టింది.
ఈ టోర్నీలో పూజ ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లు తీసుకోవడం మూడోసారి కావడం విశేషం. అనంతరం హైదరాబాద్ జట్టు 18.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 134 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. వంకా పూజ (41 బంతుల్లో 55 నాటౌట్; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) అజేయ అర్ధసెంచరీ సాధించింది. గొంగడి త్రిష (33; 4 ఫోర్లు), కెపె్టన్ ప్రణవి చంద్ర (27; 4 ఫోర్లు, 1 సిక్స్), మమత మదివాలా (15 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్స్) కూడా రాణించారు. ఏడు జట్లున్న గ్రూప్ ‘డి’లో హైదరాబాద్ రెండు మ్యాచ్‌ల్లో గెలిచి, నాలుగింటిలో ఓడి ఎనిమిది పాయింట్లతో ఐదో స్థానంలో నిలిచింది.


