source: X
మహిళల బిగ్‌బాష్ లీగ్‌లో ఇవాళ అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. చివరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో మెల్‌బోర్న్ రెనెగేడ్స్ అద్భుత విజయాన్ని అందుకుంది. హోబర్ట్ హరికేన్స్‌తో జరిగిన ఈ పోరులో స్కోర్లు సమం కావడంతో సూపర్ ఓవర్ తప్పదని అంతా భావించారు. అయితే వికెట్ కీపర్ లిజెల్ లీ చేసిన పొరపాటు మ్యాచ్ ఫలితాన్నే మార్చేసింది.
చివరి బంతి వేసే సమయంలో వికెట్ కీపర్ లిజెల్ లీ చేతి గ్లోవ్స్ వికెట్ల ముందు వైపు ఉన్నట్లు రీప్లేలో గుర్తించారు. నిబంధనల ప్రకారం బంతి వికెట్లను దాటే వరకు వికెట్ కీపర్ పూర్తిగా వికెట్ల వెనుకే ఉండాలి.
ఎంసీసీ నిబంధనల్లోని 27.3 ప్రకారం వికెట్ కీపర్ ఈ నిబంధనను ఉల్లంఘిస్తే నోబాల్‌గా ప్రకటిస్తారు. ఈ ఉదంతంలో లీ చేసిన తప్పిదం కారణంగా ప్రత్యర్దికి నోబాల్ రూపంలో అదనపు పరుగు వచ్చింది. దీంతో సూపర్ ఓవర్ అవసరం లేకుండానే మెల్‌బోర్న్ రెనెగేడ్స్ విజయం సాధించింది.
“Cricket is cruel.” We thought we had a Super Over, but it’s the @RenegadesBBL who claim victory over the @HurricanesBBL in extraordinary fashion! #WBBL12 https://t.co/fIrkS0rIQw
— Weber Women's Big Bash League (@WBBL) November 4, 2026
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన హోబర్ట్ హరికేన్స్ 20 ఓవర్లలో 154 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో రెనెగేడ్స్ ఒక దశలో సునాయాసంగా గెలిచేలా కనిపించింది. అయితే హీథర్ గ్రాహమ్, నికోలా క్యారీ కీలక వికెట్లు తీసి మ్యాచ్‌ను హరికేన్స్ వైపు తిప్పారు.
చివరి ఓవర్‌లో రెనెగేడ్స్ విజయానికి ఏడు పరుగులు అవసరమయ్యాయి. బంతిని అందుకున్న నికోలా క్యారీ తొలి నాలుగు బంతుల్లో కేవలం రెండు పరుగులే ఇచ్చింది. ఐదో బంతికి బౌండరీ రావడంతో చివరి బంతికి ఒక్క పరుగు అవసరమైంది. అయితే క్యారీ వేసిన చివరి బంతిని డియాండ్రా డాటిన్ ఆడలేకపోయింది. దీంతో మ్యాచ్ టై అయి సూపర్ ఓవర్‌కు వెళ్తుందని అంతా భావించారు.
ఇంతలో థర్డ్ అంపైర్ రీప్లేలను పరిశీలించడంతో అసలు విషయం బయటపడింది. క్యారీ బంతి వేసే సమయంలో వికెట్ కీపర్ లిజెల్ లీ చేతి గ్లోవ్స్ వికెట్ల ముందు వైపు ఉన్నట్లు గుర్తించారు. దీంతో నో బాల్ రూపంలో అదనపు పరుగు లభించి మెల్‌బోర్న్ రెనెగేడ్స్ విజేతగా నిలిచింది.
ఇదీ చదవండి: ఆ ఒక్క దేశంలోనే కోహ్లి సగటు 50 కంటే తక్కువ..!


