డబ్ల్యూపీఎల్ 2027 మినీ వేలం తేదీ ఖరారు | WPL 2027 Auction Date, Time, Venue Confirmed | Sakshi
Sakshi News home page

డబ్ల్యూపీఎల్ 2027 మినీ వేలం తేదీ ఖరారు

Oct 19 2026 8:11 PM | Updated on Oct 19 2026 8:16 PM

WPL 2027 Auction Date, Time, Venue Confirmed

source: X

మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) 2027 సీజన్‌కు సంబంధించి ఆటగాళ్ల వేలం తేదీ, వేదిక ఖరారయ్యాయి. అక్టోబర్ 28న కేరళలోని కొచ్చిలో మినీ వేలం నిర్వహించనున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. సాయంత్రం 5:30 గంటలకు వేలం ప్రారంభం కానుంది.

సెప్టెంబర్‌లోనే ఫ్రాంచైజీలు తమ జట్లలో కొనసాగించే ఆటగాళ్లు, విడుదల చేసిన క్రికెటర్ల జాబితాలను ప్రకటించాయి. గతేడాది ఢిల్లీలో జరిగిన మెగా వేలం తర్వాత తొలిసారిగా మినీ వేలం జరగనుంది.

27 స్థానాల కోసం 146 మంది ప్లేయర్లు
వేలంలో మొత్తం 146 మంది ఆటగాళ్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. వీరిలో దేశీయ, విదేశీ క్రికెటర్లు ఉన్నారు. ఫ్రాంచైజీల వద్ద ఖాళీగా ఉన్న 27 స్థానాలను (20 భారత్‌, 7 విదేశీ) భర్తీ చేయడమే ఈ వేలం ప్రధాన లక్ష్యం.

రూ.50 లక్షల బేస్ ప్రైస్‌తో సోఫియా డంక్లీ, సోఫీ మోలిన్యూ
ఇంగ్లండ్‌కు చెందిన సోఫియా డంక్లీ, ఆస్ట్రేలియా క్రికెటర్ సోఫీ మోలిన్యూ అత్యధికంగా రూ.50 లక్షల కనీస ధరతో వేలంలో తమ పేర్లు నమోదు చేసుకున్నారు.

రూ.40 లక్షల బేస్ ప్రైస్‌తో జి. కమలిని, కిరణ్ నవగిరే, హీథర్ గ్రాహం, జెస్ జొనాసెన్ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. మొత్తం 30 మంది ఆటగాళ్లు రూ.30 లక్షల కనీస ధరను నిర్ణయించుకున్నారు. ఈ జాబితాలో చమరి ఆటపట్టు, గ్రేస్ హారిస్, క్లో ట్రయాన్, స్నేహ్ రాణా ఉన్నారు.

రూ.10 లక్షల బేస్ ప్రైస్‌తో 106 మంది
వేలం కోసం నలుగురు ఆటగాళ్లు రూ.20 లక్షల కనీస ధరను నిర్ణయించుకోగా, అత్యధికంగా 106 మంది రూ.10 లక్షల బేస్ ప్రైస్‌తో పేర్లు నమోదు చేసుకున్నారు.

మొత్తం వేలం జాబితాలో 119 మంది భారత ఆటగాళ్లు ఉన్నారు. వీరిలో 22 మంది అంతర్జాతీయ క్రికెట్ ఆడినవారు కాగా, 97 మంది అన్‌క్యాప్డ్ ప్లేయర్లు. విదేశీ ఆటగాళ్లు 27 మంది ఉండగా, వారిలో ఆరుగురు అసోసియేట్ దేశాలకు చెందినవారు.

ఇదీ చదవండి: బీసీసీఐ సెలెక్టర్‌గా రమేశ్‌ పొవార్‌.. చీఫ్‌ సెలెక్టర్‌గా ప్రజ్ఞాన్ ఓజా


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement