అద్భుతం.. అతడిని టెస్టుల్లోనూ ఆడించండి: టీమిండియా దిగ్గజం | Excellent: Gavaskar Makes Red Ball Claim After Arshdeep ODI Masterclass | Sakshi
Sakshi News home page

అద్భుతం.. అతడిని టెస్టుల్లోనూ ఆడించండి: టీమిండియా దిగ్గజం

Nov 4 2026 7:35 PM | Updated on Nov 4 2026 8:07 PM

 Excellent: Gavaskar Makes Red Ball Claim After Arshdeep ODI Masterclass

టీమిండియా (PC: BCCI X)

ఆక్లాండ్‌ వేదికగా న్యూజిలాండ్‌తో తొలి వన్డేలో భారత పేసర్‌ అర్ష్‌దీప్‌ సింగ్‌ అదరగొట్టాడు. పది ఓవర్ల కోటాలో డెబ్బై పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు కూల్చాడు. కివీస్‌ ఓపెనర్‌ విల్‌ యంగ్‌ (9), హెన్రీ నికోల్స్‌ (9), గ్లెన్‌ ఫిలిప్స్‌ (30) రూపంలో మూడు కీలక వికెట్లు తీయడంతో పాటు.. కైలీ జెమీషన్‌ (1) వికెట్‌ను కూడా తన ఖాతాలో వేసుకున్నాడు.

గెలుపులో పాత్ర
తద్వారా న్యూజిలాండ్‌ 185 పరుగులకే ఆలౌట్‌ కావడంలో కీలక పాత్ర పోషించి.. టీమిండియా విజయంలో తన వంతు సహకారం అందించాడు. ఈ నేపథ్యంలో భారత దిగ్గజ కెప్టెన్‌ సునిల్‌ గావస్కర్‌ అర్ష్‌దీప్‌ సింగ్‌ను ప్రశంసిస్తూ.. టీమిండియా యాజమాన్యానికి కీలక సూచనలు చేశాడు.

లైన్‌ అండ్‌ లెంగ్త్‌ అత్యద్భుతంగా ఉంది
సోనీ స్పోర్ట్స్‌ నెట్‌వర్క్‌ షోలో మాట్లాడుతూ.. ‘‘అతడు బంతిని రెండు వైపులా స్వింగ్‌ చేయగలుగుతున్నాడు. ఇన్‌స్వింగ్‌, అవుట్‌స్వింగ్‌ రాబడుతున్నాడు. తద్వారా బ్యాటర్లను తికమకపెడుతున్నాడు. ఈరోజు అతడి లైన్‌ అండ్‌ లెంగ్త్‌ అత్యద్భుతంగా ఉంది.

టెస్టులలోనూ ఆడించండి
నిజంగా అతడు ఈరోజు సూపర్‌గా బౌలింగ్‌ చేశాడు. గత రెండు, మూడేళ్లుగా అతడి ఆటను చూస్తున్నా. టెస్టుల్లో కూడా అర్ష్‌దీప్‌ సింగ్‌ను ఆడించాలి. వైట్‌బాల్‌నే ఇంతలా స్వింగ్‌ చేస్తున్నాడంటే.. రెడ్‌బాల్‌ క్రికెట్‌లో ఎలాంటి అద్భుతాలు చేయగలడో చూడాలి’’ అని గావస్కర్‌ పేర్కొన్నాడు.

రహానే సైతం
అదే షోలో భాగమైన భారత మాజీ బ్యాటర్‌ అజింక్య రహానే సైతం గావస్కర్‌తో ఏకీభవించాడు. ‘‘అర్ష్‌దీప్‌నకు కచ్చితంగా టెస్టుల్లోనూ అవకాశం వస్తుంది. బంతిని అద్భుతంగా స్వింగ్‌ చేయడంతో పాటు వరుస విరామాల్లో వికెట్లు తీయగల నైపుణ్యం అతడి సొంతం. రెడ్‌బాల్‌తోనూ ఈ లెఫ్టార్మ్‌ సీమర్‌ రాణించగలడు’’ అని రహానే అభిప్రాయపడ్డాడు. కాగా ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో తొలి వన్డేలో భారత్‌ ఐదు వికెట్ల తేడాతో గెలిచింది.

ఇవీ చదవండి: రోహిత్‌ భాయ్‌ వల్లే ఇలా!.. అతడు అద్భుతంగా బ్యాటింగ్‌ చేశాడు: గిల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement